100 కోట్ల వ్యాక్సినేషన్.. మువ్వన్నెల కాంతుల్లో 100 చారిత్రక కట్టడాలు
దిశ, ఫీచర్స్ : కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు శాఖ దేశంలోని 100 చారిత్రక కట్టడాలను మువ్వన్నెల కాంతుల్లో ప్రకాశింపజేసింది. దేశవ్యాప్తంగా కొవిడ్ -19 టీకా డ్రైవ్ గురువారం నాటికి బిలియన్ డోస్ (100 కోట్లు) మైలురాయిని చేరుకున్న సందర్భంగా.. పాండమిక్ టైమ్‌లో అవిశ్రాంతంగా కృషి చేసిన ఫ్రంట్‌లైనర్స్ అందరికీ ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ 100 చారిత్రక కట్టడాల జాబితాలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడిన ఎర్రకోట, ఢిల్లీలోని […]
దిశ, ఫీచర్స్ : కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు శాఖ దేశంలోని 100 చారిత్రక కట్టడాలను మువ్వన్నెల కాంతుల్లో ప్రకాశింపజేసింది. దేశవ్యాప్తంగా కొవిడ్ -19 టీకా డ్రైవ్ గురువారం నాటికి బిలియన్ డోస్ (100 కోట్లు) మైలురాయిని చేరుకున్న సందర్భంగా.. పాండమిక్ టైమ్‌లో అవిశ్రాంతంగా కృషి చేసిన ఫ్రంట్‌లైనర్స్ అందరికీ ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ 100 చారిత్రక కట్టడాల జాబితాలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడిన ఎర్రకోట, ఢిల్లీలోని హుమయూన్ టోంబ్, కుతుబ్ మినార్, ఆగ్రా ఫోర్ట్, యూపీలోని ఫతేపూర్ సిక్రి, ఒడిశాలోని కోణార్క్ ఆలయం, తమిళనాడులోని మామల్లాపురం రథ్ టెంపుల్స్, గోవాలోని సెయింట్ ఫ్రాన్సిస్ అసిసి చర్చి, ఖజురాహో, రాజస్థాన్‌లోని చిత్తోర్ మరియు కుంభల్‌గఢ్, బీహార్‌లోని పురాతన నలంద విశ్వవిద్యాలయంతో పాటు గుజరాత్‌లోని ధోలావీరాలోని త్రవ్వకాల శిథిలాలు ఈ సందర్భంగా జాతీయ జెండా రంగుల్లో అలంకరించబడ్డాయి. ఇక తాజాగా యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తెలంగాణలోని రామప్ప దేవాలయం కూడా త్రివర్ణ కాంతుల్లో మెరిసిపోయింది.
‘భారత్ 100 కోట్ల వ్యాక్సినేషన్ మార్క్ సాధించినందున పాండమిక్ సిచ్యువేషన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు హెల్ప్ చేయడంతో పాటు మానవజాతికి నిస్వార్థ సేవలందించిన కరోనా యోధులు(వ్యాక్సినేటర్స్, పారిశుధ్య సిబ్బంది, పారామెడికల్, సహాయక కార్మికులు, పోలీసు సిబ్బంది తదితరులు)కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీనికి గుర్తుగా 21 అక్టోబర్, 2021 రాత్రి ఈ 100 చారిత్రక కట్టడాలు మూడు రంగుల్లో వెలిగిపోతాయి’ అని మంత్రిత్వ శాఖ ముందుగానే ప్రకటించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఈ ఘనతను ప్రశంసించారు.