మూగ భాషను అనువదించే చేతొడుగు
మూగ, చెవిటివాళ్లు మాట్లాడుకోవడానికి ప్రత్యేకంగా సంజ్ఞల భాష ఉంటుందని చాలా మందికి తెలుసు. వారికి అవసరం కాబట్టి నేర్చుకుంటారు. ఇంకా కొందరు ఆసక్తి ఉన్నవారు, సేవ చేయాలనుకునే వారు కూడా నేర్చుకుంటారు. అయితే పూర్తిగా ఆ భాష తెలిసినవాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. ఒకవేళ ఒక మూగ, చెవిటి మనిషి తన అవసరం మేరకు సంజ్ఞల భాష తెలియని మామూలు మనుషులతో సంభాషించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒకరు చెప్పేది ఇంకొకరికి అర్థంకాక ఇబ్బంది పడాల్సి […]
మూగ, చెవిటివాళ్లు మాట్లాడుకోవడానికి ప్రత్యేకంగా సంజ్ఞల భాష ఉంటుందని చాలా మందికి తెలుసు. వారికి అవసరం కాబట్టి నేర్చుకుంటారు. ఇంకా కొందరు ఆసక్తి ఉన్నవారు, సేవ చేయాలనుకునే వారు కూడా నేర్చుకుంటారు. అయితే పూర్తిగా ఆ భాష తెలిసినవాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. ఒకవేళ ఒక మూగ, చెవిటి మనిషి తన అవసరం మేరకు సంజ్ఞల భాష తెలియని మామూలు మనుషులతో సంభాషించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒకరు చెప్పేది ఇంకొకరికి అర్థంకాక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే టెక్నాలజీ ఉన్న తర్వాత ఇలాంటి సమస్యలకు చిటికెలో పరిష్కారం దొరుకుతుంది. అలాంటి పరిష్కారాన్నే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు కనుగొన్నారు.
సంజ్ఞ భాషలో ప్రధానంగా ఉపయోగించేది చేతులు కాబట్టి.. ఒక హైటెక్ చేతొడుగును వారు కనిపెట్టారు. ఇది ధరించిన వారి చేయి కదలికను బట్టి స్మార్ట్‌ఫోన్ ద్వారా సంజ్ఞ భాషను ఆంగ్లంలోకి అనువదిస్తుంది. కావాలంటే రాత రూపంలో, స్పీచ్ రూపంలో చదివి వినిపిస్తుంది. అమెరికన్ సంజ్ఞల భాషలోని 660 సంజ్ఞలను ఇది 98.63 శాతం కచ్చితత్వంతో అనువదించగలదని ప్రొఫెసర్ జున్ చెన్ అన్నారు. ప్రతి వేలి భాగంలోని సాగేగుణం గల సెన్సార్లు, కదలికలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ సిగ్నళ్లను స్మార్ట్‌ఫోన్‌కు పంపిస్తుంది. అందులో ఉన్న యాప్ నిమిషానికి 60 పదాల చొప్పున అనువదించగలుగుతుందని ఆయన వివరించారు. దీనితో పాటుగా అమెరికన్ సంజ్ఞల భాషలో ముఖకవళికలు కూడా ఒక భాగం కావడంతో ముఖానికి కూడా సెన్సార్లు అంటించగల మార్గం కోసం వారు ప్రస్తుతం అన్వేషిస్తున్నట్లు జున్ చెన్ తెలిపారు. ఈ ప్రోటోటైప్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే మూగ, చెవిటి వాళ్లకు, సాధారణ మనుషులకు మధ్య అంతరాన్ని పూడ్చే అవకాశం కలుగుతుందని జున్ చెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.