సినిమా టికెట్ ధరలపై హైకోర్టు కీలక ఆదేశాలు
దిశ, ఏపీ బ్యూరో : ఏపీలో సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సింగిల్ బెంచ్ తీర్పును ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. అయితే టికెట్ ధరల నియంత్రణకు సంబంధించి ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరిగింది. కోర్టుకు వెళ్లిన వారికి మాత్రమే జీవో నంబర్ 35 రద్దు వర్తిస్తుందని […]
దిశ, ఏపీ బ్యూరో : ఏపీలో సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సింగిల్ బెంచ్ తీర్పును ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. అయితే టికెట్ ధరల నియంత్రణకు సంబంధించి ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరిగింది. కోర్టుకు వెళ్లిన వారికి మాత్రమే జీవో నంబర్ 35 రద్దు వర్తిస్తుందని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను హైకోర్టు తోసిపుచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది. టికెట్ల ధరల నియంత్రణకు సంబంధించి జీవో నంబర్ 35 రద్దు అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ధరల పెంపుపై ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్లకు పంపాలని మరోసారి హైకోర్టు డివిజన్ బెంచ్ సూచించింది. ఇందుకు సంబంధించి వివరాలను అడిషనల్ అఫిడవిట్‌లో దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే గురువారానికి హైకోర్టు వాయిదా వేసింది.
ఇకపోతే టికెట్ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 35ను విడుదల చేసింది. అయితే టికెట్ల ధరల తగ్గింపుపై సినీ పరిశ్రమలో పలువురు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అటు థియేటర్ల యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. కొత్త సినిమాలు విడుదలయ్యే సమయంలో టికెట్స్ రేట్స్ పెంచుకునే అవకాశం థియేటర్ యజమానులకు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. థియేటర్ల యాజామాన్యాల తరఫున సీనియర్ లాయర్లు ఆదినారాయణ రావు, దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం35ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే సగటు ప్రేక్షకుడికి వినోదం అందించే సినిమా టికెట్ల ధరలను ఇష్టారీతిలో పెంచుకొనే విధానానికి తాము వ్యతిరేకమని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. సామాన్యుడికి అందుబాటులో ధరలు తీసుకొచ్చేందుకు వీలుగా సినిమా టికెట్ల ధరలను తగ్గించినట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారణంగానే సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరిపి టికెట్ ధరల బాధ్యతను జేసీలకు అప్పగించింది. ప్రభుత్వం కూడా టికెట్ ధరలపై ఓ కమిటీ వేయాలని సూచించిన సంగతి తెలిసిందే.