జాగ్రత్త.. రానున్నరోజుల్లో భారీ వరదలు: కేసీఆర్

దిశ, న్యూస్ బ్యూరో: గోదావరికి భారీ వరద వస్తే భద్రాచలం పట్టణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకోసం అధికార యంత్రాగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. నీటి ముంపు పొంచి ఉన్న ప్రాంతాల కోసం ప్రత్యేకంగా సహాయక శిబిరాలను ఏర్పాటుచేసి అవసరమైన వసతి, భోజనం తదితరాలను అందించడంతో పాటు కరోనా నుంచి రక్షణ కోసం మాస్కుల్ని, శానిటైజర్లను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సంభవిస్తున్న […]

Update: 2020-08-17 20:52 GMT

దిశ, న్యూస్ బ్యూరో: గోదావరికి భారీ వరద వస్తే భద్రాచలం పట్టణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకోసం అధికార యంత్రాగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. నీటి ముంపు పొంచి ఉన్న ప్రాంతాల కోసం ప్రత్యేకంగా సహాయక శిబిరాలను ఏర్పాటుచేసి అవసరమైన వసతి, భోజనం తదితరాలను అందించడంతో పాటు కరోనా నుంచి రక్షణ కోసం మాస్కుల్ని, శానిటైజర్లను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సంభవిస్తున్న వర్షాలు, వరదలపై వివిధ శాఖల మంత్రులు, అధికారులతో ప్రగతి భవన్‌లో సోమవారం సమీక్ష నిర్వహించిన సీఎం ఆయా రంగాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.

ఇప్పటివరకు వరదల పరిస్థితి అదుపులోనే ఉందని, రానున్న మూడు నాలుగు రోజులు చాలా ముఖ్యమని, భారీ వర్షాలు పడి భారీ స్థాయిలో వరదలు వచ్చే అవకాశం ఉందని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి జరిగే పరిణామాలను అంచనా వేసి అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి చెరువునూ నిత్యం గమనిస్తూ ఉండాలని, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ జరగడంతో కట్టలు పటిష్టంగా ఉన్నాయని, అవి జరగనిచోట నష్టం వాటిల్లిందన్నారు. ఎంతటి విపత్తు వచ్చినా ప్రాణ నష్టం జరగరాదని, ఇతర నష్టాలను పూడ్చుకోగలంగానీ ప్రాణాలను తిరిగి తేలేమని స్పష్టం చేశారు. ప్రజలు కూడా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తగా ఉండాలని కోరారు.

గోదావరి వరదతో ఏటూరునాగారం, మంగపేట మండలాలతో పాటు పరివాహక ప్రాంతంలోని ముంపు గ్రామాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కూలిపోయే స్థితలో ఉన్న ఇళ్లల్లో ఉండొద్దని, కాజ్‌వేల దగ్గర ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున నీటి ప్రవాహానికి ఎదురు వెళ్లొద్దని కోరారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎక్కడికక్కడే ఉండి ఆయా ప్రాంతాల్లోని సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు.

ఫ్లడ్ మేనేజ్‌మెంట్ పాలసీ రూపొందాలి

ఇప్పుడు వరదలను దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకుంటూనే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు అనుసరించాల్సిన శాశ్వత వ్యూహాన్ని అధికార యంత్రాంగం రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఏ స్థాయిలో వర్షం వస్తే ఎంత నీరు వస్తుంది, ఎంత వరద వస్తుంది, ఏ ప్రాంతాలు మునిగే అవకాశం ఉంది, అలాంటప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, లోతట్టు ప్రాంతాల్ని ముంపునకు గురికాకుండా కాపాడడం ఎలా, రోడ్లపైకి నీరు వచ్చే అవకాశం ఏ స్థాయిలో ఉంది, కాజ్‌వేల మీదుగా నీరు ప్రవహించే అవకాశాలేంటి.. ఇలా అనేక అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేసి వ్యూహాన్ని ఖరారు చేయాలని స్పష్టం చేశారు. మున్సిపల్, పోలీసు శాఖలతో కలిసి ప్రత్యేక టాస్క్ ఫోర్సును ఏర్పాటుచేసి విపత్తు జరిగిన వెంటనే రంగంలోకి దించాలని సూచించారు. అన్ని నదుల దగ్గర ఫ్లడ్ ట్రాక్ షీట్‌ను తయారు చేయాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వానలు, వరదలు సంభవిస్తే ఏం చేయాలనే విషయంలో గతంలో ఆంధ్ర ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే అప్పటి పాలకులు వ్యవహరించారని, ఇప్పుడు తెలంగాణ దృక్పథంలో విపత్తుల నిర్వహణ వ్యూహాన్ని శాశ్వత ప్రాతిపదికన ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీని రూపొందించాలని ఆదేశించారు.

విద్యుత్ వ్యవస్థ పటిష్టంగా ఉంది

వానలు, వరదల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా, గ్రిడ్ ఫెయిల్ కాకుండా విద్యుత్ యంత్రాంగం వ్యూహాత్మకంగా ఉండడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల విద్యుత్ వ్యవస్థకు ఇబ్బందులు కలిగినా సరఫరాకు అంతరాయం కలగలేదని, ఏడు 220 కేవీ టవర్లు కొట్టుకుపోయాయని, రెండు 33 కేవీ సబ్ స్టేషన్లు నీటిలో మునిగిపోయాయని సీఎం తెలిపారు. నీటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని జల విద్యుత్ ఉత్పత్తిపై అధికారులు దృష్టి పెట్టారని, విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోయినా గ్రిడ్ దెబ్బతినకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారని అభినందించారు.

నేడు వరంగల్‌లో మంత్రుల హెలికాప్టర్ పర్యటన

వరదపై సమీక్ష సందర్భంగా వరంగల్ నగరంలోని తాజా పరిస్థితిపై సీఎం ప్రత్యేక సమీక్ష జరిపారు. నగరంలో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తదితరులు మంగళవారం హెలికాప్టర్ పర్యటన చేయాలని సూచించారు. ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించి కలెక్టరేట్‌లో వరదలతో పాటు కరోనా పరిస్థితిని అధికారులతో సమీక్షిస్తారని, తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు.

ఎరువుల కొరత రానీయొద్దు

రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని, ఇది 1.40 కోట్ల ఎకరాలకు చేరుకోవచ్చని అంచనా వేసిన సీఎం డిమాండ్‌కు తగినంత మోతాదులో ఎరువుల్ని కూడా అందుబాటులో ఉంచాలని వ్యవసాయ మంత్రిని ఆదేశించారు. గతేడాది సుమారు 8.06 లక్షల టన్నుల ఎరువుల్ని వాడామని, ఈసారి ఇప్పటికే దాదాపు రెట్టింపై 15.88 లక్షల టన్నులకు చేరుకుందని, మరింతగా పెరిగి సుమారు 22.30 లక్షల టన్నుల దాకా చేరుకోవచ్చని అంచనా వేశారు. దీనికి తగినట్లుగా ఎరువులను సిద్ధం చేయాలని, కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు సమకూర్చుకోవాలని సూచించారు. మంత్రి నిరంజన్ రెడ్డి, కార్యదర్శి జనార్ధన్ రెడ్డి మంగళవారమే ఢిల్లీ వెళ్లి మంత్రిని కలవనున్నారు.

Tags:    

Similar News