Kishan Reddy: గ్యారంటీలు మీరిచ్చి నిధులు మాకివ్వమంటే ఎలా?: కిషన్ రెడ్డి
ఎన్నికల కోసమే డీలిమిటేషన్, త్రిభాషాపై పొలిటికల్ స్టంట్స్ వేస్తున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రాల్లోని ఇతర పార్టీ ప్రభుత్వాలు ప్రజలకు గ్యారంటీలు (Guarantees) ఇచ్చి వాటికి నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఎలా అని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రశ్నించారు. మేం ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత మాదేనన్నారు. శనివారం టీవీ9 కాంక్లేవ్ లో మాట్లాడిన ఆయన పలు కీలక అంశాలపై స్పందించారు. బీజేపీ అంటే ఇతర రాజకీయ పార్టీలు భపడుతున్నాయని అందుకే దేశాన్ని ముక్కలు చేయాలని ఏకమవుతున్నాయని ఆరోపించారు. డీలిమిటేషన్ (Delimitation) విషయంలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
సీఎంకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా?:
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ ప్రయోజనాల కోసమే యాంటీ హిందీ పేరుతో పొలిటికల్ స్టంట్ వేస్తున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. త్రిభాషా సూత్రం (Three Language) కాంగ్రెస్ హయాంలో రూపొందింది. మేము వచ్చాక 2022లో కొత్త విద్యావిధానం తీసుకువచ్చారు. తమిళనాడుకు చెందిన కస్తూరి రంగరాజన్ నేతృత్వంలో కొత్త విద్యావిధానం తీసుకొస్తే ఇన్నేళ్ల తర్వాత స్టాలిన్ కు కొత్త విద్యావిధానం గుర్తుకు వచ్చిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారనే వాదనను కిషన్ రెడ్డి ఖండించారు. బీజేపీ ఏ భాషను నిర్లక్ష్యం చేయదు. మేము అన్ని మాతృభాషలను గౌరవిస్తామమన్నారు. ప్రధాని మోడీ ఏ రాష్ట్రాన్ని సందర్శించినా స్థానిక భాషలోనే ప్రజలను పలకరిస్తారు. ఇది ప్రతి ప్రాంతీయ భాషకు ఆయన ఇచ్చే గౌరవాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. మోడీ నాయకత్వంలో గత 10 సంవత్సరాలలో తమిళనాడు, కర్ణాటక, కేరళలోని ఏ వ్యక్తిని హిందీ నేర్చుకోమని బలవంతం చేయలేదని చెప్పారు.
తదుపరి అధ్యక్షుడు ఎవరనేదానిపై..
ఇతర పార్టీల్లో తదుపరి అధ్యక్షుడు ఎవరో చెప్పొచ్చు కానీ బీజేపీలో (BJP) అలా కాదన్నారు. జేపీ నడ్డా తర్వాత అధ్యక్షుడు ఎవరో దేవుడు కూడా చెప్పలేడు అన్నారు. కాంగ్రెస్ లో అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ తర్వాత ప్రియాంక గాంధీ ఆ తర్వాత ఆమె పిల్లలు ఉంటారని ఆరోపించారు. నలభై సంవత్సరాల క్రితం ప్రజలు బీజేపీ ఒక పార్టీ కూడా కాదని చెప్పుకునేవారు. కానీ నేడు ప్రజలు మమ్మల్ని విశ్వసించడం వల్ల మేము అధికారంలో ఉన్నామమన్నారు. కాంగ్రెస్, డీఎంకే ఇతర కుటుంబ పార్టీలు రాజకీయాలను డబ్బు సంపాదించడానికి ఒక ప్రైవేటు కంపెనీలాగా చూస్తాయని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశాన్ని నిర్లక్ష్యం చేయడం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ కూడా ఒక రాజకీయ పార్టీ. దక్షిణాదిలో బీజేపీ తన ఉనికిని బలోపేతం చేసుకునే దిశగా కృషి చేస్తోందని తెలిపారు. మాకు ఇప్పటికే రెండు దక్షిణాది రాష్ట్రాలు పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రధాని మోడీ నాయకత్వంలో, దక్షిణాది ప్రజల హృదయాలను గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో డబ్బులు ఇచ్చే వారికే గనుల కేటాయింపులు జరిగేవి. ఇప్పుడు వేలం ప్రక్రియలో గనుల కేటాయింపు జరుగుతోందన్నారు. బీజేపీ అధికారంలోకి రాకపోతే ఆర్టికల్ 370 ఎప్పటికీ తొలగించబడి ఉండేది కాదన్నారు.