హెల్త్ ఎమర్జెన్సీ? వైద్య సిబ్బంది సెలవులు రద్దు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఊహకు అందని విధంగా వేలల్లో పెరుగుతుండడంతో వైద్యారోగ్య అప్రమత్తమైంది. ఒకవైపు ప్రజల్లో అవగాహన కలిగిస్తూనే మరోవైపు విపత్కర పరిస్థితి తలెత్తవచ్చనే ఆందోళనతో అదనపు ఏర్పాట్లు చేసుకుంటోంది. వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సెలవులను ఆకస్మికంగా రద్దుచేసింది. ఇప్పటికే సెలవుపై వెళ్ళిపోయినవారు తిరిగి విధుల్లో చేరాలని ఆయా వైద్య విభాగాల హెచ్‌వోడీలు సర్క్యులర్లు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డాక్టర్ల వివరాలను కూడా వైద్యారోగ్య శాఖ సేకరిస్తోంది. […]

Update: 2021-04-09 13:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఊహకు అందని విధంగా వేలల్లో పెరుగుతుండడంతో వైద్యారోగ్య అప్రమత్తమైంది. ఒకవైపు ప్రజల్లో అవగాహన కలిగిస్తూనే మరోవైపు విపత్కర పరిస్థితి తలెత్తవచ్చనే ఆందోళనతో అదనపు ఏర్పాట్లు చేసుకుంటోంది. వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సెలవులను ఆకస్మికంగా రద్దుచేసింది. ఇప్పటికే సెలవుపై వెళ్ళిపోయినవారు తిరిగి విధుల్లో చేరాలని ఆయా వైద్య విభాగాల హెచ్‌వోడీలు సర్క్యులర్లు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డాక్టర్ల వివరాలను కూడా వైద్యారోగ్య శాఖ సేకరిస్తోంది. డాక్టర్ల, స్పెషలిస్టుల సేవలను వైద్య విద్య డైరెక్టర్‌ విభాగానికి బదిలీ చేయడానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ క్షణంలో వైద్యుల అవసరాలు ఏ రూపంలో వచ్చినా వెంటనే వినియోగించుకునే విధంగా పకడ్బందీ మెకానిజాన్ని రెడీ చేస్తోంది.

మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్‌ల సంఖ్యను, ఆక్సిజన్ సౌకర్యాన్ని మెరుగుపర్చడంపై దృష్టి పెట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితిని సమీక్షించారు. వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ సైతం ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో శనివారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తాజా పరిస్థితిపై వివరించడంతోపాటు సమీప భవిష్యత్తులో పేషెంట్ల తాకిడి పెరిగితే బెడ్‌లు, వార్డుల సంఖ్యను సమకూర్చుకోవడంపై సూచనలు చేయనున్నారు. ఇప్పటికే ఐసీయూ, ఆక్సిజన్ బెడ్‌లు నిండిపోవడంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్ల తాకిడి పెరిగింది. ప్రైవేటు హాస్టళ్ళు, భవనాలను ప్రత్యామ్నాయంగా సిద్ధం చేసుకున్నాయి. ఇకపైన రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగి ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు వస్తే తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లతో పాటు సంచార (మొబైల్) ప్లాంట్లను వైద్యారోగ్య శాఖ సిద్ధం చేస్తోంది. లాక్‌డౌన్ ఉండదంటూ ప్రధాని స్వయంగా చెప్పిన నేపథ్యంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వైరస్ వ్యాప్తి నివారణపై ప్రభుత్వం సీరియస్ దృష్టి పెట్టింది. అందులో భాగంగా కరోనా టెస్టుల సంఖ్యను బాగా పెంచింది. గురువారం ఒక్క రోజే లక్షకు పైగా టెస్టులు చేసింది. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని భావించి 24 గంటల వ్యవధిలోనే 1.02 లక్షల మందికి టీకాలు పంపిణీ చేసింది. 45 ఏళ్ళ వయసుపైబడినవారందరికీ వ్యాక్సిన్ అందేలా కేంద్రాల సంఖ్యను కూడా పెంచింది. వారం రోజులకు సరిపోయే స్థాయిలో టీకాల (ఏడు లక్షల)ను స్టాక్ పెట్టుకుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు ‘నిర్బంధ‘ టీకా

కరోనా మొదటి వేవ్‌ కంటే సెకండ్ వేవ్ సీరియస్‌గా ఉందన్న అంచనాకు వచ్చిన వైద్యారోగ్య శాఖ ఎక్కడికక్కడ మొత్తం వైద్యారోగ్య వ్యవస్థను అప్రమత్తం చేసింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం తప్పనిసరి అనే అభిప్రాయంతో మాస్కులు ధరించనివారిపై కేసులు నమోదు చేయడం తీవ్రతరం చేసింది. ఇప్పటిదాకా వ్యాక్సిన్ తీసుకోడానికి నిర్లక్ష్యంగా ఉన్న హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్లు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది, 45 ఏళ్ళ వయసు పైబడినవారు.. ఇలా అర్హత కలిగినవారందరినీ గుర్తించి నిర్బంధంగా వ్యాక్సిన్ వేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులు (45 ఏళ్ళు నిండినవారు) తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా వైద్యారోగ్య శాఖ తరఫున సర్క్యులర్ జారీ అయింది.

రవాణా, పంచాయతీరాజ్, పురపాలక అభివృద్ధి, రెవెన్యూ, పోలీసు తదితర అన్ని శాఖల్లోని ఉద్యోగులు ఫ్రంట్‌లైన్ వారియర్ల కేటగిరీలోకి వస్తున్నందున వారందరికీ నిర్బంధంగా టీకాలు వేయించాల్సిందిగా ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళాయి.

సెకండ్ వేవ్‌లో వైరస్ వ్యాప్తింగా తీవ్రంగా, వేగంగా ఉండడంతో వైద్యారోగ్య శాఖ మునుపెన్నటికంటే ఎక్కువ ఆందోళన పడుతూ దానికి తగిన ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. మరణాలు పెద్దగా లేకపోయినా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో వ్యాప్తి విస్తృతంగా ఉంటుందని అనుమానిస్తోంది. ప్రజల కదలికలను అరికట్టేలా లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటివాటి జోలికి వెళ్ళకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అంతర్ రాష్ట్ర రాకపోకలపై ఆంక్షలు పెట్టింది. గ్రామీణ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా టెస్టుల సామర్థ్యాన్ని పెంచింది.

వైరస్‌నే లాక్‌డౌన్ చేద్దాం..

“సెకండ్ వేవ్‌లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా, వేగంగా ఉంటుంది. దానికి తగినట్లుగానే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వ్యాప్తి నివారణకు గతేడాది లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటివి విధించుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్ల ప్రజల జీవనోపాధి, ఆర్థిక సమస్యలు లాంటివి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అందువల్ల ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి. వైరస్‌నే లాక్‌డౌన్ చేసేలా మన బిహేవియర్ ఉండాలి. ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల సహకారం కూడా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది’’.
– డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్, ప్రజారోగ్య శాఖ

Tags:    

Similar News