హుజురాబాద్‌లో బిజీగా హరీష్.. వాళ్లు మాత్రమే లోపలికి రావాలి, ఫోన్స్ తేవద్దు

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ బై పోల్స్‌లో మంత్రి హరీష్ రావు వ్యూహాత్మకంగా సాగుతున్నారు. ఈటలను ఓడించడమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ సీరియస్‌గా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో సాగుతున్న ప్రచారం తీరు తెన్నుల బాధ్యతలు మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌లతో పాటు ముఖ్య నాయకులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు చేపట్టాల్సిన ప్రచార వ్యూహంపై భారీ కసరత్తులే చేస్తున్నారు. మంత్రి హరీష్ […]

Update: 2021-08-25 01:52 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ బై పోల్స్‌లో మంత్రి హరీష్ రావు వ్యూహాత్మకంగా సాగుతున్నారు. ఈటలను ఓడించడమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ సీరియస్‌గా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో సాగుతున్న ప్రచారం తీరు తెన్నుల బాధ్యతలు మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌లతో పాటు ముఖ్య నాయకులకు అప్పగించారు.

ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు చేపట్టాల్సిన ప్రచార వ్యూహంపై భారీ కసరత్తులే చేస్తున్నారు. మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలోని ఐదు మండలాల ఇంఛార్జీలతో పాటు ఇక్కడి నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. అలాగే సిద్దిపేటకు చెందిన హరీష్ రావు ముఖ్య అనుచరులు కూడా హుజురాబాద్‌లోనే మకాం వేశారు.

సింగాపురం కేంద్రంగా స్కెచ్..

నిన్న మొన్నటి వరకు సిద్దిపేట సమీపంలోని రంగనాయక్ సాగర్ గెస్ట్ హౌజ్ కేంద్రంగా సాగిన హుజురాబాద్ సమీకరణాలు ఇప్పుడు సింగాపురం గెస్ట్ హౌజ్ కేంద్రంగా మొదలయ్యాయి. మంత్రి హరీష్ రావు కెప్టెన్ గెస్ట్ హౌజ్‌లో సీక్రెట్ మీటింగ్స్ ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేస్తున్నారు. మంగళవారం రాత్రి కూడా సింగాపురం చేరుకున్న హరీష్ రావు జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాలకు చెందిన పలువురితో వ్యక్తిగతంగా సమావేశమై ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగాలో వివరించారు.

ప్రతీ ఓటరును పదే పదే కలవాల్సిందే..

పోలింగ్ ప్రక్రియ జరిగే నాటి వరకూ నియోజకవర్గంలోని ప్రతీ ఓటరును వ్యక్తిగతంగా కలవాల్సిందేనని మంత్రి హరీష్ రావు స్పష్టం చేసినట్టు సమాచారం. ఒకటికి పది సార్లు ఓటర్లను కలిసి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారే వరకూ పట్టు వదలని విక్రమార్కుల్లా పని చేయాల్సిందేనని స్పష్టం చేసినట్టు తెలిసింది. నిరంతరం వారితో సాన్నిహిత్యంగా మెదిలి పార్టీకి అనుకూల వాతావరణం వచ్చేందుకు పర్సనల్ క్యాంపెయిన్‌ను కొనసాగించడంలో ఎవరూ నిర్లక్ష్యం వహించకూడదని మంత్రి హరీష్ సూచించినట్టు సమాచారం. ప్రత్యర్థి, అభ్యర్థికి పట్టున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ఓట్లను చీల్చేందుకు కూడా కృషి చేయాలని ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాలని కూడా కోరినట్టు తెలుస్తోంది.

నో మొబైల్స్..

అయితే మంత్రి హరీష్ రావు ఏర్పాటు చేసిన ఈ రహస్య సమావేశానికి హాజరయ్యే నాయకులు ఎవరైనా వారి మొబైల్ ఫోన్లను లోపలకు అనుమతించడం లేదని సమాచారం. మంత్రి మీటింగ్ నిర్వహించే హాల్ ఆరు బయటే సెల్ ఫోన్లను ఉంచి లోపలకు వెళ్లాల్సి ఉంటుంది. అంతర్గతంగా జరిగే ఎలాంటి చర్చలైనా వన్ టూ వన్ జరగాల్సిందే తప్ప మరొకరికి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశ్యంతో ఇలా వ్యవహరిస్తున్నారని సమాచారం.

ఊరు వాడా డాటా..

దాదాపు రెండు నెలలుగా రంగనాయకసాగర్ కేంద్రంగా హుజురాబాద్ పరిస్థితులపై సమీక్షలు జరిపి.. ఇక్కడి నాయకులతో టచ్‌లోకి వెళ్లిన హరీష్ రావు.. నియోజకవర్గానికి చెందిన ఫుల్ డాటాను కూడా తయారు చేసుకున్నారు. ఈ డాటా ఆధారంగా పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగించిన వారిపై క్రాస్ చెక్ చేసేందుకు కూడా సమాయత్తం కానున్నట్టు సమాచారం.

అర్థరాత్రి అయినా పట్ట పగలైనా ఆయా ప్రాంతాల ఇంఛార్జీలకు ఫోన్ చేసి ఆ ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితులను అడిగి తెలుసుకోవడమే కాదు అక్కడి ఓటర్లతో మాట్లాడించమని కూడా హరీష్ రావు పార్టీ ఇంఛార్జీలను కోరనున్నట్టు తెలుస్తోంది. దీంతో క్షేత్ర స్థాయిలో పార్టీ ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు ఎలా పని చేస్తున్నారు, వారికి నిర్దేశించిన చోటే ఉన్నారా లేక సొంత పనులపై వెళ్లారా అన్న విషయం తేలుతుందని ఇలాంటి ఎత్తుగడలకు కూడా రంగం సిద్దం చేసుకున్నట్టు తెలిసింది.

 

Tags:    

Similar News