జీఎస్టీ మంత్రుల బృందంలో హరీశ్‌రావు
దిశ, తెలంగాణ బ్యూరో : వైద్యరంగానికి సంబంధించిన ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయింపులకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన మంత్రుల బృందంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు స్థానం లభించింది. మేఘాలయ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో గుజరాత్, మహారాష్ట్రల ఉప ముఖ్యమంత్రులు, ఉత్తరప్రదేశ్, గోవా, కేరళ, ఒడిషా రాష్ట్రాల మంత్రులు కూడా సభ్యులుగా ఉన్నారు. వైద్యరంగంలో టెస్టింగ్ కిట్ల మొదలు ఆక్సిజన్, రెమిడెసివర్ లాంటి మందులు, వ్యాక్సిన్ తదితరాలపై జీఎస్టీ రూపంలో విధించే […]
దిశ, తెలంగాణ బ్యూరో : వైద్యరంగానికి సంబంధించిన ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయింపులకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన మంత్రుల బృందంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు స్థానం లభించింది. మేఘాలయ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో గుజరాత్, మహారాష్ట్రల ఉప ముఖ్యమంత్రులు, ఉత్తరప్రదేశ్, గోవా, కేరళ, ఒడిషా రాష్ట్రాల మంత్రులు కూడా సభ్యులుగా ఉన్నారు.
వైద్యరంగంలో టెస్టింగ్ కిట్ల మొదలు ఆక్సిజన్, రెమిడెసివర్ లాంటి మందులు, వ్యాక్సిన్ తదితరాలపై జీఎస్టీ రూపంలో విధించే పన్నులు భారంగా మారాయని, వాటికి పన్ను నుంచి పూర్తి మినహాయింపు లభించాలంటూ పలు రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం జరిగిన జీఎస్టీ 43వ సమావేశంలో చర్చించి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు ఎనిమిది సభ్యులతో కూడిన బృందం ఏర్పాటైంది. అందులో మంత్రి హరీశ్‌రావు కూడా ఒక సభ్యుడిగా ఉన్నారు.
కరోనా పరిస్థితుల్లో రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరిగిందని, కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందడంలేదని, రాష్ట్రాలే వివిధ రూపాల్లో వనరులను సమకూర్చుకుంటున్నాయని, ఆర్థికపరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు జీఎస్టీ సమావేశంలో చర్చను లేవనెత్తారు. ఈ ఎనిమిది మంది మంత్రుల బృందం అన్ని అంశాలను చర్చించి ఈ నెల 8వ తేదీలోగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పించనుంది. ఈ వారం రోజుల పాటు మంత్రుల బృందం ఈ క్రింది అంశాలపై అధ్యయనం జరపనుంది.
– వైద్యరంగానికి అవసరమైన ఏయే అంశాలపై పన్ను తగ్గించడం లేదా మినహాయింపు ఉండాలి.
– కరోనా వ్యాక్సిన్, మందులు, చికిత్స, టెస్టింగ్ కిట్లు తదితరాలపై ఏ మేరకు పన్ను విధానంలో మార్పులు జరగాలి.
– మెడికల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సీమీటర్లు, హ్యండ్ శానిటైజర్లు, ఆక్సిజన్ థెరపీకి ఉపయోగించే పరికరాలు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, ఆక్సిజన్ జనరేటర్లు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, సర్జికల్ మాస్కులు, శరీర ఉష్ణోగ్రతను కొలిచే పరికరాలు తదితరాలపై కూడా జీఎస్టీ మినహాయింపులు ఏ మేరకు ఉండాలి.
– కరోనా అవసరాలకు వాడే ఇతర వస్తువులపై ఏ మేరకు పన్ను సడలింపులు ఉండాలి.