కడగండ్లు మిగిల్చిన వడగండ్ల వాన
దిశ, నల్లగొండ : ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి వడగండ్లతో కురిసిన అకాల వర్షం.. రైతులకు కడగండ్లు మిగిల్చింది. రెండ్రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కురిసిన వడగండ్ల వాన బీభత్సానికి సుమారు 14 వేల ఎకరాలకు పైగా వరి పంట నేలవాలింది. వరి గొలుసుల నుంచి గింజలు నేలరాలాయి. సుమారు రూ. 71.93 కోట్ల మేర నష్టం వాటిల్లిపట్టు వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాకత్‌కు మించి వరి […]
దిశ, నల్లగొండ : ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి వడగండ్లతో కురిసిన అకాల వర్షం.. రైతులకు కడగండ్లు మిగిల్చింది. రెండ్రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కురిసిన వడగండ్ల వాన బీభత్సానికి సుమారు 14 వేల ఎకరాలకు పైగా వరి పంట నేలవాలింది. వరి గొలుసుల నుంచి గింజలు నేలరాలాయి. సుమారు రూ. 71.93 కోట్ల మేర నష్టం వాటిల్లిపట్టు వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
తాకత్‌కు మించి వరి సాగు..
భూగర్భ జలాలు మెండుగా ఉండటంతో ఈ సారి రబీ సీజన్‌లో సాధారణం కన్నా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. యాదాద్రి జిల్లాలో 38 వేల హెక్టార్లకు పైగా సాగు చేశారు. నల్లగొండలోని నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ కాలువల కింద సుమారు లక్ష ఎకరాలు చేయగా.. మిగతా ప్రాంతంలో మరో 70 వేల ఎకరాల వరకు వరిని సాగు చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి రాష్ట్రంలో కొలువుదీరిన తర్వాత వరస ఎన్నికల సాకుతో ఈ సారి రైతులందరికీ పెట్టుబడి సాయం అందించలేకపోయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాపంగా గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సుమారు రూ.200 కోట్ల వరకు రావాల్సి ఉన్నట్టు సమాచారం. అయినప్పటికీ రైతులు భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటంతో అప్పో.. సప్పో చేసి తాకత్‌కు మించి వరిపంటను సాగు చేశారు. మరో వారం పది రోజుల్లో పంట చేతికొస్తుందని సంబరపడిన రైతన్నల ఆశలపై వరసగా మూడ్రోజులుగా కురుస్తున్న వడగండ్ల వాన నీళ్లు కుమ్మరించింది.
14 వేల ఎకరాలకు పైగా నష్టం..
వడగండ్ల వాన, ఈదురుగాలుల బీభత్సం కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 5 వేల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో సుమారు 7 వేల ఎకరాలకు పైగా వరి పంటకు నష్టం వాటిల్లింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో 1000, చౌటుప్పల్ 1100, అడ్డగూడూరు 625, గుండాల 920, ఆత్మకూరు(ఎం) 1150, పోచంపల్లి 250, వలిగొండ 100, యాదగిరిగుట్ట 600, రాజపేట 200, నల్లగొండ జిల్లా చిట్యాల 2400, వేములపల్లి 2100, మిర్యాలగూడ 1500, మర్రిగూడ 500, నాంపల్లి 400, మునుగోడు 500, నారయణపురం 200, చండూర్ 250 ఎకరాల్లో వరి పంట నేకొరిగింది. వరి ధాన్యం నేలరాలింది. రైతు రుణమాఫీ అమలు కాకపోవడంతో చాలా మంది రైతులు బ్యాంకు రుణాలు రెన్యూవల్ చేసుకుంటే రుణ మాఫీ వర్తించదన్న భయంతో ప్రయివేటుగా అప్పులు తెచ్చి ఈ రబీలో సాగు చేశారు. కాగా, ప్రస్తుత పంట నష్టాన్ని పరిశీలిస్తే పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు.
భరోసా ఇవ్వని ఎమ్మెల్యేలు..
పంట నష్టం తీవ్రంగా వాటిల్లిన పరిస్థితుల్లో రైతులకు.. భరోసా ఇవ్వాల్సిన ప్రజా ప్రతినిధుల జాడ కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వడగండ్ల బాధితులను పరామర్శించకపోవడం రైతుల పట్ల వారికున్న చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. కాగా, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని రైతు సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Tags: Nalgonda, Hailstorm, compensation, MLA, farmers, Paddy crop