బిడ్డను కను… బోనస్ పట్టు!
ఓ వైపు పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి అధిక జనాభా గల దేశాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న దేశాలతో, మరోవైపు మా దగ్గర అసలు జనాలే లేరు అంటూ బిడ్డను కన్నవారికి బహుమతుల వర్షం కురిపిస్తున్న దేశాలు కూడా ఉన్నాయి. జనన రేటును పెంచడానికి గ్రీసు దేశం వారు బిడ్డకు జన్మనిచ్చిన ప్రతి జంటకు 2000 యూరోలు అంటే దాదాపు 2 లక్షల రూపాయల బోనస్‌ను ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభం […]
ఓ వైపు పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి అధిక జనాభా గల దేశాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న దేశాలతో, మరోవైపు మా దగ్గర అసలు జనాలే లేరు అంటూ బిడ్డను కన్నవారికి బహుమతుల వర్షం కురిపిస్తున్న దేశాలు కూడా ఉన్నాయి. జనన రేటును పెంచడానికి గ్రీసు దేశం వారు బిడ్డకు జన్మనిచ్చిన ప్రతి జంటకు 2000 యూరోలు అంటే దాదాపు 2 లక్షల రూపాయల బోనస్‌ను ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఈ బోనస్ ఇవ్వడం మొదలుపెట్టారు.
ఎందుకిలా?
ప్రస్తుతం గ్రీసు జనాభా 10.7 మిలియన్లు. తగ్గుతున్న జనన రేటు కారణంగా రానున్న మూడేళ్లలో ఈ జనాభా మూడో వంతుకు తగ్గిపోనుందని యూరోస్టాట్ సర్వే చెబుతోంది. ప్రస్తుత వేగంతో పోలిస్తే 2050 నాటికి 36 శాతం జనాభా 65 ఏళ్లు దాటిన వాళ్లే ఉంటారని సర్వే పేర్కొంది. దీన్ని తట్టుకొని జనన రేటు పెంచే ఉద్దేశంతో ఈ బోనస్ ప్రకటించారు.
2010-15 మధ్యకాలంలో దాదాపు 5 లక్షలమంది గ్రీసు దేశం నుంచి వలస వెళ్లి అమెరికా, కెనడా వంటి దేశాల్లో స్థిరపడ్డారు. చదువుకున్న యువత అందరూ అలా వెళ్లి అక్కడే స్థిరపడిపోవడంతో జననాల రేటు తీవ్రంగా తగ్గింది. అలాగే 2014-15 కాలంలో అక్కడి ఫౌర్నీ అనే ప్రాంతంలో ఒక్క జననం కూడా నమోదు కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అక్కడ మెడికల్ సేవలు అభివృద్ధి చేయడంతో ప్రస్తుతం 11 మంది గర్భిణులు నమోదు చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.
బోనస్ వల్ల ఉపయోగముందా?
జనాభావృద్ధి కోసం గ్రీసు చేపట్టిన బోనస్ కార్యక్రమం వల్ల ఆ దేశ ఖజానాపై భారీ మొత్తంలో భారం పడనుంది. యూరోపియన్ యూనియన్‌కి చెందని సిటిజన్లకు కూడా ఈ బోనస్ వర్తిస్తుందనడంతో ప్రధాని కిరియాకోస్ మిత్సోటకి ప్రభుత్వ విధానాల గురించి కొందరు సందేహిస్తున్నారు. ఏదేమైనా వీరి ప్రయత్నం ఫలించి జనాభా మరీ ఎక్కువ కాకుండా ఉంటే అంతే చాలని ప్రపంచ దేశాలు అభిప్రాయపడుతున్నాయి.