భవిష్యత్ నేతల.. బస్తీ మే సవాల్!

గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం కానున్నాయి.. జీహెచెఎంసీలో గెలుపునే 2023 ఎన్నికలకు సంకేతంగా భావిస్తున్నాయి.. ప్రభుత్వ వైఫల్యాలనే ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంటే.. ఐదేళ్ల అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రచారాస్త్రంగా మార్చుకోనుంది.. ఈ ఎన్నికలు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకంటే ముగ్గురు వ్యక్తుల పనితీరుకు గీటురాయి కానున్నాయి. పార్టీలపై ఎలాంటి ప్రభావం వేస్తుందనే దానికంటే వ్యక్తులుగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, పార్లమెంటు […]

Update: 2020-10-03 22:15 GMT

గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం కానున్నాయి.. జీహెచెఎంసీలో గెలుపునే 2023 ఎన్నికలకు సంకేతంగా భావిస్తున్నాయి.. ప్రభుత్వ వైఫల్యాలనే ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంటే.. ఐదేళ్ల అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రచారాస్త్రంగా మార్చుకోనుంది.. ఈ ఎన్నికలు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకంటే ముగ్గురు వ్యక్తుల పనితీరుకు గీటురాయి కానున్నాయి. పార్టీలపై ఎలాంటి ప్రభావం వేస్తుందనే దానికంటే వ్యక్తులుగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు రేవంత్‌రెడ్డిపైనే ఎక్కువ ప్రభావం చూపనున్నాయి..గెలిచినా, ఓడినా అంతిమంగా అది వీరి చుట్టే తిరుగుతుంది కాబట్టి.. ‘భవిష్యత్ నేతలు’ ఇప్పడు బస్తీమే స‘వా(ర్)’ల్ అంటున్నారు..!

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మొత్తం 150 వార్డుల్లో దాదాపు యాభై వరకు ఎంఐఎంకు గట్టిగా పట్టున్న ప్రాంతాల్లో ఉండడంతో దాదాపు అవి ఆ పార్టీకే దక్కే అవకాశం ఉందనే ఒక సాధారణ అభిప్రాయం అన్ని పార్టీల్లోనూ ఉంది. ఇక మిగిలిన 100 వార్డులపైనే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ గురిపెట్టాయి. ఇందులో రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 48 వార్డులు ఉన్నాయి. మిగిలిన వాటిలో మెజారిటీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి వీలైనన్ని ఎక్కువ వార్డుల్ని గెలుచుకోవాలనుకుంటున్నారు.

‘గెలుపు’ నినాదంతో టీఆర్ఎస్..

గత ఎన్నికల్లో గెలుపును భుజాన వేసుకున్న కేటీఆర్ 99 వార్డుల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఎన్నికలు డిసెంబరులోనే రావచ్చనే అంచనాతో ప్రస్తుత కార్పొరేటర్లు, నగర మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులందరికీ ప్రత్యేకంగా బాధ్యతలు అప్పజెప్పారు. పనితీరు సరిగాలేని కార్పొరేటర్లను ఇటీవల హెచ్చరించిన మంత్రి, ఈసారి వారికి టికెట్ దొరకకపోవచ్చనే సంకేతాన్ని పంపారు. గత ఎన్నికల్లో వచ్చిన విజయాన్ని ఈసారి సాధించకపోతే వ్యక్తిగా అది కేటీఆర్ పనితీరుకు నిదర్శనంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ స్పష్టంగా బాధ్యతలు అప్పజెప్పారు.

40 వార్డుల్లో గెలుపే లక్ష్యంగా కిషన్ రెడ్డి వ్యూహం..

టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోవడం సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడిగా కిషన్‌రెడ్డిపై గణనీయంగా ఉంది. నగర పార్టీ నేతలు సైతం ఆయనకే గెలుపు బాధ్యతలు అప్పజెప్పాల్సిందిగా పార్టీ అధిష్టానానికి చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో కేవలం నాలుగు వార్డుల్లో మాత్రమే గెలుపు సాధించిన బీజేపీ ఈసారి 40 వార్డుల్లో గెలుపును లక్ష్యంగా పెట్టుకుంది. గెలిచినా ఓడినా వ్యక్తిగతంగా కిషన్‌రెడ్డికే దాన్ని ఆపాదించనుంది పార్టీ.

రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకం..

మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో గెలిచిన ఎంపీ రేవంత్‌రెడ్డికి సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన పరిధిలో ఉన్న 48 వార్డుల్లో సాధించే గెలుపు ప్రతిష్ఠాత్మకం కానుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపుతో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లోని వార్డుల్లో సాధించే గెలుపు నిర్ణయాత్మకం కానుంది. ఈ మధ్యకాలంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కదాంట్లో కూడా కాంగ్రెస్ గెలవలేదు. పైగా గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సింగిల్ డిజిట్ వార్డులకే పరిమితమైంది. అలాంటి పరిస్థితుల్లో రేవంత్ పార్లమెంటు సభ్యుడిగా గెలవడం టీఆర్ఎస్ పార్టీని నిరుత్సాహపర్చింది. కానీ ఆ అసంతృప్తిని ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం రేవంత్‌కు సవాలుగా మారింది.

Tags:    

Similar News