పేరుకే గొప్ప స్కీంలు!

దిశ, న్యూస్‌బ్యూరో: ‘రైతుబంధు కింద నాకు 3 లక్షల రూపాయలేసిన్రు.. అవి నా లాంటి ధనవంతులకెందుకందుకు అధ్యక్షా… ఏం చేస్కోవాలి.. పేద రైతులకు, భూమి లేని కౌలు రైతులకు రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాలిస్తే సరిపోతుంది’ ఇవి తాజాగా తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడిన మాటలు. తెలంగాణలో సంక్షేమ పథకాల్లో నిధులు దుర్వినియోగమవుతున్నాయని, ఇలా ప్రతిపక్ష నాయకులతోపాటు మేధావులు కూడా నిన్న మొన్నటిదాకా విమర్శించేవారు. ఇప్పుడు ప్రభుత్వం వారికి ఆ ఇబ్బంది […]

Update: 2020-03-18 05:33 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ‘రైతుబంధు కింద నాకు 3 లక్షల రూపాయలేసిన్రు.. అవి నా లాంటి ధనవంతులకెందుకందుకు అధ్యక్షా… ఏం చేస్కోవాలి.. పేద రైతులకు, భూమి లేని కౌలు రైతులకు రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాలిస్తే సరిపోతుంది’ ఇవి తాజాగా తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడిన మాటలు. తెలంగాణలో సంక్షేమ పథకాల్లో నిధులు దుర్వినియోగమవుతున్నాయని, ఇలా ప్రతిపక్ష నాయకులతోపాటు మేధావులు కూడా నిన్న మొన్నటిదాకా విమర్శించేవారు. ఇప్పుడు ప్రభుత్వం వారికి ఆ ఇబ్బంది లేకుండా ఇస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల కోసం ఇచ్చిన ఇబ్బడి ముబ్బడి హామీలు అమలు చేయలేక, రాష్ట్రంలో ఈ టర్ములో అన్ని ఎన్నికలు ముగిసినందున నిజమైన పేదలకే వెల్ఫేర్ స్కీములు వర్తింపజేసే కార్యక్రమం స్టార్ట్ చేసింది. అర్హుల జాబితాలోంచి ధనికులను ఏరివేస్తూ స్కీములన్నీ స్ట్రీమ్‌లైన్ చేసే తంతు మొదలు పెట్టింది. ఇంకో 4 ఏళ్ల దాకా పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేనందున పొదుపు మంత్రం జపిస్తోంది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన రుణమాఫీ స్కీం విధివిధానాల ఉత్తర్వులు కూడా మున్ముందు వెల్ఫేర్ స్కీంల అమలు పట్ల పట్ల ప్రభుత్వ విధానం ఎలా ఉండొచ్చన్నదానికి సంబంధించి సంకేతాలిస్తున్నాయి.

రుణమాఫీపై మాట మార్పు

2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికల సమయంలో రూ.లక్ష లోపు రుణాలున్న రైతులందరికీ రుణాలమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి అప్పుడే 15 నెలలు గడిచిపోయింది. ఇప్పటికే రుణమాఫీ మొదటి వాయిదానైనా రైతుల ఖాతాల్లో జమ అయి ఉండాల్సింది. అలా జరగలేదు. ఇన్ని రోజులకు ఈ స్కీం విధివిధానాలను ప్రభుత్వం మంగళవారం ఖరారు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీనిలో కూడా ఓ మెలిక పెట్టింది. ముందు రూ. 25 వేలలోపు ఉన్న రైతులకు సింగిల్ వాయిదాలో అమలు చేస్తామంది. డబ్బులు బ్యాంకుల్లో వేయడం కాకుండా నేరుగా చెక్కులిస్తామని తెలిపింది. రూ.25 వేల పైన రుణాలున్న రైతులకు వచ్చే సంవత్సరం 4 వాయిదాల్లో మాఫీ డబ్బులు ఇస్తామని ప్రకటించింది. కుటుంబం ఒక యూనిట్‌గా స్కీం అమలు, రీషెడ్యూల్ రుణాలకు మాఫీ వర్తించకపోవడం ఇలా చాలా కండీషన్స్ పెట్టింది. రుణమాఫీ అమలు ఆలస్యంగా మొదలు పెట్టడమే కాకుండా కొందరికి ఒక విధంగా మరికొందరికి మరో విధంగా ఇస్తామని చెప్పడం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇవే షరతులు ఎన్నికల టైంలో చెప్పాల్సిందని అవి అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అమలుకు వీలుకాని హామీలిచ్చింది కాబట్టే క్రెడిబిలిటీ ఉన్న తమకు ప్రజలు అధికారమిచ్చారని పదేపదే అంటున్న సీఎం కేసీఆర్, ఏడాది ఆలస్యంగా స్కీంలు అమలు చేయడమే కాకుండా కొందరికి ఇప్పుడు మరి కొందరికి తర్వాత అనడం ఏం క్రెడిబిలిటీ అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

రైతుబంధుపై అనధికార కోతలు

రాష్ట్రంలోని 52 లక్షల మంది రైతులకు ఏడాదికి ఒక ఎకరానికి రూ. 5,000 ఇస్తామని 2018 ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎన్నికలపుడు రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరానికి రూ.4 వేల చొప్పున వేసిన ప్రభుత్వం ఎన్నికలు ముగిశాక పెట్టుబడి సాయం పెంచినట్టే పెంచి వివిధ రకాల సాకులు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించింది. 2019 ఖరీఫ్, రబీల్లో కలిపి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం మరో 10 రోజుల్లో ముగుస్తుందనేటప్పటికి కేవలం రూ.7వేల కోట్లకు కాస్త అటుఇటుగా మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసింది. 7 ఎకరాలపైన ఉన్న రైతులకు రబీలో ఇప్పటికీ రైతుబంధు డబ్బులు రాలేదు. ఖరీఫ్‌లోనూ కొందరికి బకాయిలు పెట్టింది. వీరితో పాటు కొత్త పాస్‌బుక్‌లు వచ్చినవారి, కొత్తగా భూమి కొన్నవారి పేర్లు రైతుబంధు జాబితాలో చేర్చడానికి జాప్యం చేస్తూ స్కీంనకు పలు అనధికారిక కోతలు విధించింది. ఎన్నికలప్పుడు రైతుబంధు కేవలం పేద రైతులకే అని ఎందుకు చెప్పలేదంటూ ప్రతిపక్షాలు ఈ స్కీం అమలు తీరు పట్ల ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.

బడ్జెట్‌లో అంకెలకే పరిమితం

సొంత భూమిలో ఇళ్లు నిర్మించుకోవడానికి డబ్బులిస్తామన్న స్కీంనకు కూడా కేవలం బడ్జెట్‌లలో నిధులు కేటాయింపు తప్ప ఇప్పటికి ఒక్క రూపాయి విడుదల కాలేదు. ఇక నిరుద్యోగ భృతిలాంటి నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలిస్తామన్న స్కీంకైతే గత బడ్జెట్‌లో నిధులైనా కేటాయించారు తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనైతే ఆ కేటాయింపులకు కూడా అతీగతి లేదు. ఇలా 2018 అసెంబ్లీ ఎన్నికలపుడు హామీ ఇచ్చిన ఏ వెల్ఫేర్ స్కీంను టీఆర్ఎస్ పార్టీ సరిగా అమలు చేసిన పాపాన పోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముందు గొప్పలు చెప్పి ఇప్పుడు అన్నింటికి కోతలు పెడుతోందని అవి ఫైర్ అవుతున్నాయి. ఇలానే చేస్తూ పోతే మళ్లీ ఎన్నికలొచ్చినపుడు పూర్తిస్థాయిలో స్కీములు అమలు చేసినా ప్రజలు టీఆర్ఎస్ మాటలు నమ్మే పరిస్థితి ఉండదని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags : trs govt, election promises, conditions in implementation, kcr, loan waiver, rythu bandhu, funds

Tags:    

Similar News