యూ టర్న్.. పీఆర్సీ కోసం గులాబీకి సై అన్నారా..?

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యోగ సంఘాలు గులాబీ జెండాను పట్టుకున్నాయి. మొన్నటి వరకు సందిగ్ధంలో కొట్టుమిట్టాడిన ఉద్యోగ సంఘాల జేఏసీ ఒక్కసారిగా స్టాండ్​ మార్చింది. మండలి పోరులో టీఆర్​ఎస్​ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించుకుంటున్నాయి. ఉద్యోగ సంఘాల కోసం టీఆర్​ఎస్​ అధిష్ఠానం నుంచే డైరెక్షన్​ రావడంతో, మంత్రుల రాయబారం సక్సెస్​ అవుతోంది. మరోవైపు ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య విభేదాలు రగిల్చిన పీఆర్సీ అంశాన్ని టీఆర్​ఎస్​ తెరపైకి తీసుకువస్తుంది. త్వరలోనే సీఎం కేసీఆర్​ నుంచి ఆమోదయోగ్యమైన […]

Update: 2021-03-07 20:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యోగ సంఘాలు గులాబీ జెండాను పట్టుకున్నాయి. మొన్నటి వరకు సందిగ్ధంలో కొట్టుమిట్టాడిన ఉద్యోగ సంఘాల జేఏసీ ఒక్కసారిగా స్టాండ్​ మార్చింది. మండలి పోరులో టీఆర్​ఎస్​ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించుకుంటున్నాయి. ఉద్యోగ సంఘాల కోసం టీఆర్​ఎస్​ అధిష్ఠానం నుంచే డైరెక్షన్​ రావడంతో, మంత్రుల రాయబారం సక్సెస్​ అవుతోంది. మరోవైపు ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య విభేదాలు రగిల్చిన పీఆర్సీ అంశాన్ని టీఆర్​ఎస్​ తెరపైకి తీసుకువస్తుంది. త్వరలోనే సీఎం కేసీఆర్​ నుంచి ఆమోదయోగ్యమైన ప్రకటన వస్తుందంటూ మంత్రి కేటీఆర్​ కూడా ప్రకటిస్తున్నారు.

ఒక్కసారిగా మారారు..

ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశం చిలికి చిలికి గాలివానలా మారింది. పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు రోడ్లెక్కినా ఫలితం రాలేదు. ఇది కొనసాగుతుండగానే మండలి ఎన్నికల కోడ్​ వచ్చింది. కోడ్​ ఉన్నా పీఆర్సీ ఇచ్చేందుకు అవకాశాలున్నాయని, చంద్రబాబు హయాంలో ఓసారి ప్రకటించారని చెప్పుకొచ్చారు. కానీ ప్రభుత్వం తేలిగ్గానే తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు, కిందిస్థాయి ఉద్యోగులు ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఉపాధ్యాయ సంఘాలు కూడా మండిపడ్డాయి.
అయితే నాలుగు రోజుల కిందట వరకు సైలెంట్​గా ఉన్న ఉద్యోగ సంఘాల జేఏసీ ఒక్కసారిగా స్టాండ్​ మార్చుకుంది. జేఏసీలోని ప్రధాన భాగస్వామ్య సంఘమైన టీఎన్జీఓ, టీజీఓ ఖమ్మం సభలో మద్దతు ప్రకటించింది. శనివారం కూడా మంత్రులు గంగుల కమలాకర్​, మహమూద్​ అలీ టీఎన్జీఓ కేంద్ర సంఘం కార్యాలయానికి వెళ్లి చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని గెలిపించి ఉద్యోగులు గెలువాలంటూ టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్​ ప్రకటించారు. ఆదివారం కూడా టీజీఓ భవన్​లో మంత్రులు హరీష్​రావు, శ్రీనివాస్​గౌడ్, గంగుల కమలాకర్​​తో కలిసి సమావేశమయ్యారు. టీజీఓల మద్దతు వాణీదేవికి ఉంటుందని, టీజీఓల సంపూర్ణ మద్దతు వాణీదేవికి ఇస్తున్నట్లు టీజీఓ ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ ప్రకటించారు.

ఏం జరిగింది…?

ఉద్యోగ సంఘాల ఏకపక్ష నిర్ణయాల వెనక ఏం జరిగిందనేది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో హాట్​ టాపిక్​గా మారింది. ఓవైపు పీఆర్సీపై కొన్ని ఉద్యోగ సంఘాలు ఇంకా వ్యతిరేకంగానే ఉన్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఒకటీ, రెండు చోట్లా కిందిస్థాయి ఉద్యోగులు కూడా విమర్శలకు దిగారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులను వేరు చేస్తున్నారనే కథనాలపై మండిపడ్డారు. ఈ వ్యతిరేకత అంశం కొనసాగుతుండగానే ఉద్యోగ సంఘాలు మాత్రం యూ టర్న్​ తీసుకోవడమే ఇప్పుడు చర్చగా మారింది. సంఘాలను భయ పెడుతున్నారా, బుజ్జగిస్తున్నారా అనే దానిపై ఏకంగా బెట్టింగ్​లే మొదలయ్యాయి. మండలి పోరు తుది దశకు చేరుతున్న ఈ సమయంలో ఎందుకు ఉద్యోగ సంఘాలు స్టాండ్​ మార్చుకున్నాయనేది ప్రత్యేక చర్చనీయాంశం అయింది.

ప్రమోషన్లు వచ్చినా పోస్టింగ్​ల్లేవ్..?

టీజీఓ తరఫున ఆదివారం చర్చలు జరిపిన మంత్రులు హరీష్​రావు, కమలాకర్​, శ్రీనివాస్​గౌడ్​తో మద్దతు ఉంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీజీఓ పదోన్నతులు, ఉద్యోగాలపై ప్రకటన చేసింది. ఒకే నెలలో 32 వేల ప్రమోషన్లు ఇచ్చినట్లు టీజీఓ వెల్లడించింది. వాస్తవంగా చాలా శాఖల్లో పదోన్నతులు ఇచ్చినా ఇప్పటికీ పోస్టింగ్​లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్​ చేతిలో ఉన్న అబ్కారీ శాఖలో ఎక్సైజ్​ అసిస్టెంట్​ సూపరిటెండెంట్​ల నుంచి ఎక్సైజ్​ సూపరింటెండ్​లుగా కొంతమందికి పదోన్నతులు కల్పించారు. మూడు నెలల కిందటే పదోన్నతులిచ్చినట్లు ఉత్తర్వులిచ్చారు. కానీ ఇప్పటి వరకూ పోస్టింగ్​లు లేవు. దీంతో నాలుగైదు నెలల సర్వీసును వెనకబడుతామని పదోన్నతులు పొందిన అధికారులు మొత్తుకుంటున్నా పక్కన పెట్టారు. వాణిజ్య పన్నుల శాఖలో కూడా అదే పరిస్థితి. చాలా శాఖల్లో పోస్టింగ్​లను పక్కన పెట్టారు. టీజీఓ నుంచి పదోన్నతులపై ప్రకటనలు చేయడంపై కొన్ని సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.

Tags:    

Similar News