కేసీఆర్‌పై గవర్నర్ సీరియస్.. అసలు ఏమైందీ ?
దిశ, న్యూస్ బ్యూరో: “కరోనా పరిస్థితిని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైంది. మూడు నెలలుగా మొత్తుకుంటున్నా పట్టించుకోలేదు. ఆరేడు లేఖలు రాశాను. ప్రభుత్వం ఇప్పుడు మేలుకుంది. అప్పుడే సరైన తీరులో స్పందించి ఉంటే ఇప్పుడు కేసులు పెరిగేవి కావు. ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడేవారు కాదు” అని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వ్యాఖ్యానించారు. ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో గవర్నర్ రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా మాత్రమే కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా, ఒక వృత్తిపరమైన వైద్యురాలిగా అనేక […]
దిశ, న్యూస్ బ్యూరో: “కరోనా పరిస్థితిని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైంది. మూడు నెలలుగా మొత్తుకుంటున్నా పట్టించుకోలేదు. ఆరేడు లేఖలు రాశాను. ప్రభుత్వం ఇప్పుడు మేలుకుంది. అప్పుడే సరైన తీరులో స్పందించి ఉంటే ఇప్పుడు కేసులు పెరిగేవి కావు. ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడేవారు కాదు” అని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వ్యాఖ్యానించారు. ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో గవర్నర్ రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా మాత్రమే కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా, ఒక వృత్తిపరమైన వైద్యురాలిగా అనేక అంశాలను వెల్లడించారు.
ఒక ఫార్మా హబ్‌గా, ఒక మెడికల్ హబ్‌గా కరోనా కట్టడి విషయంలో తెలంగాణ చాలా క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉండిందని, కానీ ఆ తరహాలో వ్యవహరించలేదని గవర్నర్ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే ఒక వైద్యురాలిగా తాను జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నానని, అదే జాగ్రత్తలను ప్రభుత్వానికి కూడా చెప్పానని, కానీ పాటించలేదని, ఇప్పుడు చాలా ఆలస్యంగా మేలుకుని ఒక్కటొక్కటిగా అమలుచేస్తూ ఉన్నదని అన్నారు. వాస్తవానికి తాను కరోనా విషయంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి ‘కాంప్లిమెంటరీ’గా, ‘కాంట్రిబ్యూటరీ’గా చెప్పానని, కానీ ప్రభుత్వం దాన్ని ‘కాంట్రడిక్టరీ’గా తీసుకున్నదో ఏమోగానీ పట్టించుకోలేదని అభిప్రాయపడ్డారు. తాను వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రభుత్వం నిజంగా సరైన స్పిరిట్‌లో తీసుకుని ఉన్నట్లయితే రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు, అనుకూల అంశాలతో చాలా చక్కటి ఫలితాలు వచ్చి ఉండేవన్నారు. కేసుల సంఖ్య పెరిగేదీకాదని, వైరస్ వ్యాప్తి చెందేది కాదని, పేషెంట్లకు ఇన్ని ఇబ్బందులు తలెత్తేవే కాదన్నారు.
మూడు నెలల క్రితం చెప్తే.. ఇప్పుడు అమలవుతున్నాయ్
మూడు నెలల క్రితం తాను స్వయంగానూ, లేఖల ద్వారానూ పేర్కొన్న అంశాలు ఇప్పుడు దాదాపుగా అమల్లోకి వచ్చాయని, అప్పుడే వీటి అమలుపై శ్రద్ధ పెట్టి ఉన్నట్లయితే ఇప్పుడీ కరోనా ఉధృతి ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదన్నారు. టెస్టుల సంఖ్యను పెంచాలని, ప్రైవేటు ల్యాబ్‌లకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటికి పర్మిషన్ ఇచ్చి ఉండాల్సిందన్నారు. జిల్లా స్థాయిలో టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయడంతో పాటు చికిత్సకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా అప్పట్లోనే సూచించానని గుర్తుచేశారు. కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటుచేయడం, వైరస్ కేసులు ఎక్కువ ఉన్నచోట మొబైల్ టెస్టింగ్ కేంద్రాలను నెలకొల్పడం లాంటివన్నీ అప్పట్లోనే సూచించానని, కానీ వాటిని ప్రభుత్వం పట్టించుకోకుండా మూడు నెలలు ఆలస్యం చేసిందని, ఇప్పుడు ఒక్కటొక్కటిగా మొదలుపెట్టిందన్నారు. సానుకూలంగా స్పందించడానికి బదులుగా అనుమానాస్పద రీతిలో వ్యవహరించిందేమోనని అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోడీ సైతం ముఖ్యమంత్రులతో ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో దాదాపు 80% పాజిటివ్ కేసులు పది రాష్ట్రాల నుంచే వస్తున్నాయని, ఇందులో తెలంగాణ కూడా ఉన్నట్లు తెలిపారని గవర్నర్ గుర్తుచేశారు. టెస్టుల సంఖ్యను పెంచాల్సిందిగా తాను కూడా మొదట్లోనే చెప్పానని, ప్రధాని సైతం దీన్ని నొక్కిచెప్పారని అన్నారు. తొలి రోజుల్లో రాష్ట్రం మొత్తం మీద యాభై వరక మాత్రమే కరోనా కేసులు వచ్చేవని, ఇప్పుడు రెండు వేలు దాటుతూ ఉన్నదని పేర్కొన్నారు. ప్రారంభంలో గాంధీ ఆసుపత్రి మాత్రమే కరోనా కోసం ఉండేదని, రాష్ట్రంలోని 32 జిల్లాల నుంచి పేషెంట్లు ఇక్కడికే రావాల్సి వచ్చేదని గుర్తుచేశారు. ఐదారు ల్యాబ్‌లలో మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగేవని, దాంతో అవసరమైనంత సంఖ్యలో టెస్టులు జరగడానికి ఆస్కారం లేకుండాపోయిందన్నారు.
వైద్య సిబ్బంది కొరత
రాష్ట్రంలో వైద్య రంగంలో మౌలిక సౌకర్యాల అభివృద్ధిపై ముఖ్యమంత్రిని కలిసిన చాలా సందర్భాల్లో నొక్కిచెప్పానని, ఒక వైద్యురాలిగా తన స్వీయానుభవంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అసౌకర్యాలను ఆయన దృష్టికి తీసుకెళ్ళేదాన్నని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సౌకర్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని, బెడ్‌ల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది లేరని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వమే సుమారు 30 వేల బెడ్‌లు ఉన్నాయని, అందులో 18 వేల బెడ్‌లకు ఆక్సిజన్ సౌకర్యం ఉందని చెప్పుకుంటూ ఉందని, కానీ కేవలం 4,373 మంది నర్సులు మాత్రమే ఉన్నారని గవర్నర్ గుర్తుచేశారు. మొత్తం ఏడు వేల మంది వైద్యులు అవసరమని ప్రభుత్వం చెప్తూనే కేవలం 2,200 మంది మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నదని నొక్కిచెప్పారు. కేవలం బెడ్‌లు మాత్రమే ఉంటే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించి దానికి తగినంత సంఖ్యలో వైద్య సిబ్బందిని కూడా సమకూర్చుకోవడం అవసరమని అన్నారు.
ప్రజల అభిప్రాయాలనే చెప్తున్నాను
కరోనా పరిస్థితులను, వైరస్ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని తనకు ప్రల నుంచి వచ్చిన అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళానని, తాను ప్రథమ పౌరురాలిని అయినప్పటికీ ఒక సామాన్య వ్యక్తిగానే ప్రభుత్వానికి తెలియజేస్తున్నానని అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికే తీసుకెళ్ళానని, మూడు నెలలు ఆలస్యంగా స్పందించడంతో ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఇప్పటికైనా టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌ల సేవలను వినియోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సౌకర్యాలను మెరుగుపర్చామని ప్రభుత్వం చెప్తున్నా ప్రజలు చికిత్స పొందడానికి ఆసక్తి చూపడంలేదని, ఫలితంగా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని, స్వయంగా ముఖ్యమంత్రికే ఈ విషయాన్ని వివరించానని గుర్తుచేశారు. కంటైన్‌మెంట్ జోన్ల విషయంలో సైతం ప్రభుత్వం తగినంత తీవ్రతతో వ్యవహరించలేదన్నారు.