వందలాది ఎకరాలు.. కబ్జాదారుల నకరాలు
దిశ, మేడ్చల్: ఆ సమయంలో వాళ్లదే ముఖ్యపాత్ర. అవసరమైతే రంగంలోకి వాళ్లే దిగుతారు. కాకపోతే కనిపించరు కానీ, ఖచ్చితంగా మాయం చేస్తరు. విచిత్రమేటంటే అందుకు సంబంధించిన వివరాలు కూడా ఉండవు. కనీసం ఆ జాడ కూడా కనిపించదు. వినడానికి విచిత్రంగా ఉంది కదా..? అయితే.. అదేమిటో తెలుసుకోవాలని ఉందా..? మరి ఇంకెందుకు ఆలస్యం ఓసారి ఈ స్టోరీ చదవండి. మేడ్చల్ జిల్లా పరిధిలో ఓ దందా జోరుగా సాగుతోంది. అందుకు అధికారుల అండదండలు ఉంటున్నాయి. దీంతో వారి […]
దిశ, మేడ్చల్: ఆ సమయంలో వాళ్లదే ముఖ్యపాత్ర. అవసరమైతే రంగంలోకి వాళ్లే దిగుతారు. కాకపోతే కనిపించరు కానీ, ఖచ్చితంగా మాయం చేస్తరు. విచిత్రమేటంటే అందుకు సంబంధించిన వివరాలు కూడా ఉండవు. కనీసం ఆ జాడ కూడా కనిపించదు. వినడానికి విచిత్రంగా ఉంది కదా..? అయితే.. అదేమిటో తెలుసుకోవాలని ఉందా..? మరి ఇంకెందుకు ఆలస్యం ఓసారి ఈ స్టోరీ చదవండి.
మేడ్చల్ జిల్లా పరిధిలో ఓ దందా జోరుగా సాగుతోంది. అందుకు అధికారుల అండదండలు ఉంటున్నాయి. దీంతో వారి కన్ను పడిన వెంటనే అది ఖతమైపోతోంది. మొత్తంగా జిల్లాలో అది లేకుండాపోతుంది. విషయం ఎన్ని సార్లు ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదు. కోర్టు సూచించినా కూడా వాటినీ లెక్కచేయడంలేదు. మొత్తంగా వాళ్ల దందాను కంటిన్యూ చేస్తూ కాసులు వెనుకేసుకుంటున్నారు.
జిల్లాలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం.. వారి పాలిట వరంలా మారింది. కొంతమంది అధికారులైతే అన్నీ తామై ఎక్కడ ఎంత ప్రభుత్వ భూమి ఉంది? దానికి రికార్డులు ఉన్నాయా? ఉంటే వాటిని ఏలా మాయం చేయాలనే వ్యవహారన్నంతా అధికారులే దగ్గరుండి చూసుకుంటున్నారు. కూకట్ పల్లి, కుత్భుల్లాపూర్ నియోజకవర్గాల్లోనైతే.. ఏకంగా అధికారులే బిల్డర్లు, రియల్ వ్యాపారులను రంగంలోకి దించుతున్నారు. మొత్తంగా మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ భూములను మయ దర్జాగా దోచుకుంటున్నారు. స్వయంగా కలెక్టర్ ప్రభుత్వ భూముల పరిరక్షణకు నడుం బిగించినా.. వాటికి అడ్డుకట్ట పడేలాలేదు. ఇటీవల జవహర్ నగర్‌లోని సర్వే నెంబర్లు 648, 649, 673లోని 13 ఎకరాల ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వెలిశాయి. మేడిపల్లిలోని పర్వతాపూర్ లో 4 ఎకరాల్లో అక్రమ నిర్మాణలు చేసేందుకు స్థానిక వ్యాపారులు, రాజకీయ నేతలతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లా పరిధిలో 56,607 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, ఇప్పటివరకు 23,465 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. ఈ భూమికి సంబంధించిన లెక్కలు అధికారుల దగ్గర లేకపోవడం గమనార్హం. రెవెన్యూ కార్యాలయాల్లో ఉండాల్సిన రికార్డులు మాయమయ్యాయి. వీటిని మాయం చేయడంలో అధికారుల పాత్రే కీలకమన్నది బహిరంగ రహస్యమే. అయితే జిల్లా పరిధిలోని ప్రభుత్వ భూములపై దాదాపు 800 కేసులు కోర్టుల్లో నలుగుతున్నాయి.
జిల్లాలో 57వేల ఎకరాల ప్రభుత్వ భూమి..
మేడ్చల్ జిల్లా పరిధిలో 56,607 ఎకరాల ప్రభుత్వభూములు ఉన్నాయి. ఇందులో హెచ్ఎండీఏకు 2,128 ఎకరాలు, రెవెన్యూ శాఖకు 1543 ఎకరాలు, దిల్ సంస్థకు 257, హౌసింగ్ సొసైటీకి 649, ఎస్ఎఫ్‌సీకి 280, స్థానిక సంస్థలకు 1407, ఇతర ప్రభుత్వ శాఖలకు 11,821 ఎకరాలు కేటాయించగా, 1,863 ఎకరాల ప్రభుత్వభూమి క్లియర్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇవిగాక 11,384 ఎకరాల ప్రభుత్వ భూములను 8,230 మంది నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీలకు వ్యవసాయం, ఇళ్ల స్థలాల కోసం అప్పటి ప్రభుత్వాలు అసైన్డ్ చేశాయి. ఇవన్నీపోనూ మిగిలిన 23,465 ఎకరాల ప్రభుత్వభూముల వివరాల లెక్క మాత్రం తేలడంలేదు.
శంషీగూడలో 1,500 ఎకరాలు
కూకట్‌పల్లిలోని శంషీగూడ సర్వే నంబర్ 57లో సుమారు 1,500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిపై అక్రమణదారుల కన్నుపడడంతో పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సైతం ఇవి ప్రభుత్వభూములేనని తేల్చి చెప్పింది. ఆ భూముల్లో ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే, అధికార యంత్రాంగం మాత్రం ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులను మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. అనంతరం ఆ భూములపై పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్రమణదారులు తమ పనిని మొదలుపెట్టారు. ఎకరం నుంచి ప్రారంభించి.. కొద్ది రోజుల్లోనే వందల ఎకరాలను కబ్జా చేశారు. అడ్డొచ్చిన అధికారులకు అమ్యామ్యాలు ముట్టజెప్పి రూ.కోట్లు గడించారు. నేటికి ఇంకా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు మాత్రం ఎవరైనా ఫిర్యాదు చేస్తే తూతూమంత్రంగా చిన్నపాటి నిర్మాణాలు కూల్చి అహో ఓహో అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
నకిలీపత్రాలు సృష్టించి…
రోజురోజుకూ రియల్ వ్యాపారుల జోరుకు అడ్డులేకుండా పోతోంది. రూ. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు రాత్రికిరాత్రే ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూములుగా మారుతున్నాయి. దీనంతటికీ రెవెన్యూ అధికారుల అండదండలుండడం గమనార్హం. వందలాది ఎకరాల్లో వెంచర్లు చేసి 60, 80, 100, 120 గజాల చొప్పున ప్లాట్లుగా మారుస్తున్నారు. మరీ కొనేవారేలా కొంటున్నారనేగా మీ డౌటు. అందుకు ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలను సృష్టించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. రియల్ వ్యాపారులు, బిల్డర్లను అధికారులే రంగంలోకి దించి ప్రభుత్వ భూములను ఆక్రమిస్తుండడం గమనార్హం. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములన్నాయనే వివరాలను అధికారులే అందించి, అవసరమైతే రెవెన్యూ కార్యాలయాల్లో రికార్డులను మాయం చేస్తున్న ఘటనలు లేకపోలేదు.
అసైన్డ్ భూముల సంగతి అంతే..
జిల్లా పరిధిలోని అసైన్డ్ భూములను అక్రమార్కులు వదల్లేదు. పలు సందర్భాల్లో గత ప్రభుత్వాలు నిరుపేదలైన అర్హులకు వివిధ అవసరాల నిమిత్తం ప్రభుత్వ భూమిని అసైన్డ్ చేశాయి. జిల్లాలో 8230 మందికి 11,384 ఎకరాలను అసైన్డ్ చేశాయి. ఇందులో సగానికిపైగా భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ఘట్ కేసర్ మండలంలో 1,610 ఎకరాలు, శామీర్‌పేటలో 1,451 ఎకరాలు, కీసరలో 1,500, మేడ్చల్‌లో 4,400, ఉప్పల్‌లో 286, కుత్బుల్లాపూర్‌లో 855 ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. ఇందులో సగానికిపైగా భూముల్లో వెంచర్లు, ఇండిపెండెంట్ హౌస్‌లు, విల్లాలు దర్శనమిస్తున్నాయి.
‘దిల్’కు 99 ఎకరాలు
జిల్లా పరిధిలోని బాచుపల్లి మండలం సర్వే నెంబర్ 292, 293, 294 మొదలుకొని మరికొన్ని సర్వే నెంబర్లలో ఉన్న దాదాపు 99 ఎకరాల భూమిని 2008 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ ప్రాజెక్టుకు కేటాయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. అప్పట్లో హిందూ ప్రాజెక్టు వారు ఆ స్థలం వద్ద సెక్యూరిటీని సైతం పెట్టారు. దీంతో ఆ స్థలం తమదేనంటూ బాచుపల్లికి చెందిన కొందరు గ్రామస్తులు సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీనికి సంబంధించిన వివరాలు అధికారుల వద్ద కూడా లేవు.
ఇలా అన్యాక్రంతమవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని, ఆక్రమణ చేస్తున్నవారిపై, అందుకు సహకరిస్తున్న ప్రభుత్వాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Tags: medchal land, anyakrantham, govt officers