ఈటలకు బిగ్ ప్లస్.. గెలుపునకు రూట్ క్లియర్.?
దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజూరాబాద్ ఎన్నికల బరిలో కేవలం ఒక్క రాజేందరే మిగిలారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటు బ్యాంకును చీల్చేందుకు ‘ఈ’ ఇంటిపేరు ఉన్న రాజేందర్‌లు మరో ముగ్గురు నామినేషన్లు వేశారు. వీరిచే నామినేషన్లు వేయించడంతో బలమైన అభ్యర్థిగా ఉన్న ఈటలకు డ్యామేజ్ అవుతుందని భావించారంతా. ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టేందుకు ఈ ఎత్తుగడ వేశారన్న చర్చ కూడా సాగింది. అయితే, సోమవారం నాడు హుజూరాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజూరాబాద్ ఎన్నికల బరిలో కేవలం ఒక్క రాజేందరే మిగిలారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటు బ్యాంకును చీల్చేందుకు ‘ఈ’ ఇంటిపేరు ఉన్న రాజేందర్‌లు మరో ముగ్గురు నామినేషన్లు వేశారు. వీరిచే నామినేషన్లు వేయించడంతో బలమైన అభ్యర్థిగా ఉన్న ఈటలకు డ్యామేజ్ అవుతుందని భావించారంతా. ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టేందుకు ఈ ఎత్తుగడ వేశారన్న చర్చ కూడా సాగింది.
అయితే, సోమవారం నాడు హుజూరాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన స్క్రూటినీ ప్రక్రియలో ఈటల రాజేందర్ మినహా మిగతా ముగ్గురు రాజేందర్‌ల నామినేషన్లను తిరస్కరించారు. మొత్తం19 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా అందులో ఈ ముగ్గురు రాజేందర్‌లు కూడా ఉండడం గమనార్హం. ఆల్ ఇండియా పార్టీ తరుఫున వేసిన ఇప్పలపల్లి రాజేందర్, న్యూ ఇండియా పార్టీ తరుఫున వేసిన ఈసంపల్లి రాజేందర్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరుఫున నామినేషన్ వేసిన ఇమ్మడి రాజేందర్‌ల నామినేషన్లు తిరస్కరించారు. దీంతో ఇక హుజూరాబాద్ బరిలో ఈటల రాజేందర్ మాత్రమే నిలవనున్నారని తేలిపోయింది.
వారు పోటీలో ఉన్నా..
బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌కు డ్యామేజ్ చేసేందుకే వీరంతా నామినేషన్లు వేసినా.. జాతీయ ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన నేషనల్ పార్టీలు, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులకు ఈవీఎంలలో ప్రాధాన్యత కల్పిస్తారు. ఆ తరువాత ఇండిపెండెంట్ అభ్యర్థులకు అల్ఫాబెటికల్ వారీగా ప్రాధాన్యత క్రమంలో ఉంచుతారు. అయితే ఈటలకు పోటీగా ముగ్గురు రాజేందర్‌లు కూడా జాతీయ పార్టీల తరుఫునే నామినేషన్లు వేసినప్పటికీ స్క్రూటినీలో వాటిని తిరస్కరించడం గమనార్హం.