గోదావరి ఉగ్రరూపం.. ప్రమాద హెచ్చరిక జారీ
దిశ, వెబ్ డెస్క్ : తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నదికి వరద పొటెత్తింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరికి ఇన్ ఫ్లో ఎక్కువగా వస్తోంది. ఈ క్రమంలోనే గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం గోదావరి ఔట్ ఫ్లో 9.84 లక్షల క్యూసెక్కులు ఉందని అధికారులు వెల్లడించారు. నది ప్రవాహం తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం […]
దిశ, వెబ్ డెస్క్ : తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నదికి వరద పొటెత్తింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరికి ఇన్ ఫ్లో ఎక్కువగా వస్తోంది. ఈ క్రమంలోనే గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం గోదావరి ఔట్ ఫ్లో 9.84 లక్షల క్యూసెక్కులు ఉందని అధికారులు వెల్లడించారు. నది ప్రవాహం తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
వరదల కారణంగా దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలు జలదిగ్బంధంలో ఇరుక్కున్నాయి. ఈ గ్రామాల ప్రజలకు ఇతర ప్రాంతాలతో సంబంధం పూర్తిగా తెగిపోయింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలోని చాకలిపాలెం కాజ్ దారి మునిగిపోవడంతో సమీప లంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. ప్రస్తుతం అక్కడ 45 అడుగుల మేర నీటిమట్టం ఉండగా, అది మరింత పెరుగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా ప్రమాదానికి ఎక్కువగా గురయ్యే గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.