ముందు కౌగిలింత.. ఆ తర్వాతే డిశ్చార్జ్

పనాజీ: ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజలాడిస్తున్నది. ఎక్కడ వైరస్ బారిన పడుతామో అనే భయాందోళనతో జనం బిక్కబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో కరోనా బారిన పడి రికవరీ అయినా సరే వారిని కూడా తీవ్ర ఆందోళనతో ఒకరకంగా సామాజిక వెలి వేస్తున్నారు. కనీసం వారిని తమ చుట్టు పక్కల ప్రాంతాల్లోకి సైతం రానివ్వడం లేదు. ఇలాంటి వారికి కనువిప్పు కలిగించడం కోసం ఓ వైద్యుడు నడుం బిగించారు. కరోనా సోకి తగ్గిపోయిన తర్వాత కౌగిలించుకున్న […]

Update: 2020-07-07 05:36 GMT

పనాజీ: ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజలాడిస్తున్నది. ఎక్కడ వైరస్ బారిన పడుతామో అనే భయాందోళనతో జనం బిక్కబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో కరోనా బారిన పడి రికవరీ అయినా సరే వారిని కూడా తీవ్ర ఆందోళనతో ఒకరకంగా సామాజిక వెలి వేస్తున్నారు. కనీసం వారిని తమ చుట్టు పక్కల ప్రాంతాల్లోకి సైతం రానివ్వడం లేదు. ఇలాంటి వారికి కనువిప్పు కలిగించడం కోసం ఓ వైద్యుడు నడుం బిగించారు. కరోనా సోకి తగ్గిపోయిన తర్వాత కౌగిలించుకున్న అనంతరం ఇంటికి పంపించారు. ఈ వినూత్న అవగాహన‌ కార్యక్రమానికి గోవా రాష్ట్రం వేదికైంది.

గోవాలోని వాస్కో పట్టణం కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్ మారింది. ఈ ప్రాంతంలో ఈఎస్‌ఐ సంబంధిత మంగొర్ హాస్పిటల్‌ ఉంది. ఇక్కడ కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించే వైద్య బృందానికి గోవా మెడికల్ కాలేజీల మెడిసిన్ డిపార్ట్‌మెంట్‌ అధిపతి డాక్టర్ ఎడ్విన్ గోమ్స్ మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తర్వాత మూడు నెలల కాలంలో 190 మంది బాధితులు మెరుగైన చికిత్స పొంది ఇంటికి వెళ్లారు.

అయితే, వీరు వివక్ష గురికావద్దని, సమాజం మనస్ఫూర్తిగా అక్కున చేర్చుకోవాలని భావించిన డాక్టర్ ఎడ్విన్ గోమ్స్ ఓ సందేశం ఇవ్వాలని భావించారు. ఇందుకోసం మంగోర్ హాస్పిటల్‌లో కరోనాకు చికిత్స పొంది, తగ్గిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిని కౌగిలించుకున్న తర్వాత వారిని డిశ్చార్జ్ చేశారు. ఇలా మూడు నెలల కాలంలో 190మంది కరోనా రికవరీ పేషెంట్లను ఆయన కౌగిలించుకున్నారు.

కరోనా రోగులకు దాదాపు 98మంది రోజులపాటు అవిశ్రాంతంగా సేవలందించిన డాక్టర్ ఎడ్విన్ గోమ్స్ న్యూస్ ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడారు. ‘కరోనా నెగెటివ్ వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన ప్రతి ఒక్క పేషెంట్‌ను నేను కౌగిలించుకున్నాను. కరోనా భయాందోళనతో ఎవరూ వీరిని ముట్టుకోవడానికి వెనుకాడకూడదు. ఈ సందేశం నా పద్ధతిలో సమాజానికి పంపించాలని అనుకున్నాను. కరోనా తగ్గిపోయిన వారి ప్లాస్మా ఇతరులకు యాంటిబాడీస్‌గా ఉపయోగపడుతాయి. అంతేకాకుండా తగ్గిపోయిన పేషెంట్ తమ వైద్య అనుభవాలను ఇతరులతో పంచుకుంటారు. ఇలాంటి సంఘటనే ఒక్కటి నాకు ఎదురైంది. వైరస్ బారి నుంచి బయట పడిన ఓ పేషెంట్ హాస్పిటల్‌లో ఇతర రోగులకు సహాయ సహకారాలు అందించాడు. ఓ రకంగా అతను నర్సుగా వ్యవహరించాడు. కరోనా పేషెంట్లకు ఆహారం అందించడం, బెడ్ ప్యాన్ పెట్టడం తదితర పనులను నిర్వర్తించాడు. ఎవరైనా పేషెంట్‌కు ఏదైనా అనుమానం ఉంటే అతనే సమాధానం ఇచ్చేవాడు. ఇలాంటి వారిని కొవిడ్ కేర్ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న కరోనా పేషెంట్లే ఎక్కువగా మంగోర్ హిల్ ఏరియా హాస్పిటల్‌‌కు వచ్చేవారు. ఇందులో 25శాతం మంది పునర్జన్మను పొందారు’ అని ఆయన చెప్పారు.

Tags:    

Similar News