సీతక్క ఛాలెంజ్.. గో హంగర్ గో
దిశ, వరంగల్: ఆ ఆదివాసీల బిడ్డది ఎంత దొడ్డ మనసో… వాగులు, వంకలు దాటి కొండ, కోనలు ఎక్కిదిగుతూ గూడేల గుండె తడుతోంది. గుడిసెగుడిసే తిరుగుతోంది. దయనీయత గూడుకట్టుకున్న ఆదివాసీలను ఆత్మీయతంగా పలకరిస్తోంది. ఎంతోకొంత సాయమందించి వారిని అక్కున చేర్చుకుంటోంది. ఆమే ములుగు ఎమ్మెల్యే సీతక్క. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుల కడుపులు నింపుతున్నారు. నెలరోజులుగా ఉదయం లేచింది మొదలు ఏటూర్ నాగారం ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ, గిరిజన, కోయగూడెల్లో పర్యటిస్తూ తన వంతు సహాయ […]
దిశ, వరంగల్: ఆ ఆదివాసీల బిడ్డది ఎంత దొడ్డ మనసో… వాగులు, వంకలు దాటి కొండ, కోనలు ఎక్కిదిగుతూ గూడేల గుండె తడుతోంది. గుడిసెగుడిసే తిరుగుతోంది. దయనీయత గూడుకట్టుకున్న ఆదివాసీలను ఆత్మీయతంగా పలకరిస్తోంది. ఎంతోకొంత సాయమందించి వారిని అక్కున చేర్చుకుంటోంది. ఆమే ములుగు ఎమ్మెల్యే సీతక్క. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుల కడుపులు నింపుతున్నారు. నెలరోజులుగా ఉదయం లేచింది మొదలు ఏటూర్ నాగారం ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ, గిరిజన, కోయగూడెల్లో పర్యటిస్తూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ మహత్కార్యంలో మరికొందరిని భాగస్వామ్యులను చేయాలనే సదుద్దేశంతో గో హంగర్ గో అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆమె కొంతమంది ప్రముఖులకు ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్‌ను ఖచ్చితంగా స్వీకరించి నిరుపేదలను ఆదుకోవాలని కోరారు. అంతేగాకుండా సవాల్‌ను పూర్తి చేసిన వారు సోషల్ మీడియా ద్వారా మరి కొందరిని గో హంగర్ గో ఛాలెంజ్‌ను నామినేట్ చేయాలని పిలుపు నిచ్చారు. మొదటిగా తన సేవలను మెచ్చుకున్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ఛాలెంజ్ విసిరారు. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ కి సైతం గో హంగర్ గో ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు.
ఆదివాసీల ఆడబిడ్డ..
మనసు దొడ్డ ములుగు ఎమ్మెల్యే సీతక్క పేద బడుగు బలహీనవర్గాల పక్షపాతిగా పేరొందారు. అభివృద్ధికి ఆమడ దూరంలో అడవుల్లో జీవనం సాగిస్తున్న ఆదివాసీ, కోయ, గిరిపుత్రుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తుంటారు. నాడు వారి అభ్యున్నతి కోసం తుపాకి చేతపట్టి నక్సలైట్ ఉద్యమంలో కదం తొక్కారు. ఆ తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో రాజకీయాల్లో వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ ఏజెన్సీ వాసులను మరువలేదు. ప్రపంచాన్నివణికిస్తున్నకరోనా కట్టడి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఏజెన్సీ వాసులకు తినడానికి తిండి దొరకని పరిస్థితి నెలకొంది. ఏ మాత్రం రవాణా సౌకర్యాలు లేని అడవులు, గూడాల్లో నివాసం ఉంటున్న వారి అవసరాలను తెలుసుకుని కొండ, కోనలు దాటి వెళ్లి నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు. గత నెల రోజులుగా ఆమె ఏజెన్సీ వాసుల సేవలో తరిస్తున్నారు. ట్రాక్టర్లలో బియ్యం, ఉప్పు, పప్పులు, కూరగాయలు తీసుకెళ్లి వారికి అందజేస్తున్నారు. అంతేగాకుండా ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర నుంచి ములుగు జిల్లాకు వచ్చిన వలస కార్మికుల కోసం నిత్యావసర వస్తువులు సమకూరుస్తూ కడుపులు నింపుతున్నది. ఈ నేపథ్యంలో సీతక్క చేస్తున్న నిస్వార్థ సేవలను గవర్నర్ తమిళిసై చూసి అభినందనలతో ముంచెత్తారు.
Tags: Sitakka Challenge, Go Hungry Go, Governor Tamilisai, Revanth Reddy, Mulugu