నాలుగు ముక్కలాట !

దిశ, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పీఠం కైవసానికి అధికార పార్టీ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. అవసరమైతే గ్రేటర్ హైదరాబాద్‌ను నాలుగు కార్పొరేషన్లుగా విభజించేందుకు కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో మేయర్, ఛైర్మన్ల పీఠాలను దక్కించుకున్నా కొన్నిచోట్ల ఇతరుల సాయం తీసుకోక తప్పలేదు. పార్టీలో అంతర్గత పోరు కూడా లాస్ట్ మినిట్ వరకు కొంత టెన్షన్ పెట్టిన సందర్భాలున్నాయి. ఈనేపథ్యంలోనే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై అందరి నజర్ […]

Update: 2020-02-29 08:33 GMT

దిశ, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పీఠం కైవసానికి అధికార పార్టీ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. అవసరమైతే గ్రేటర్ హైదరాబాద్‌ను నాలుగు కార్పొరేషన్లుగా విభజించేందుకు కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో మేయర్, ఛైర్మన్ల పీఠాలను దక్కించుకున్నా కొన్నిచోట్ల ఇతరుల సాయం తీసుకోక తప్పలేదు. పార్టీలో అంతర్గత పోరు కూడా లాస్ట్ మినిట్ వరకు కొంత టెన్షన్ పెట్టిన సందర్భాలున్నాయి. ఈనేపథ్యంలోనే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై అందరి నజర్ పడటంతో టీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారగా బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తుండటంతో టీఆర్ఎస్‌కు మింగుడు పడటం లేదు.

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో 30 సర్కిళ్లలో 150 వార్డులు ఉండగా వీరిలో 100మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు, 44మంది ఎంఐఎం పార్టీకి చెందిన వారే ఉన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 15 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా ఇతర పార్టీల నుంచి చేరిన వారితో కలుపుకుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు చేరుకుంది. అటు ఎంఐఎం పార్టీకి ఆరుగురు, బీజేపీకి ఒక ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ ఉన్నారు. భౌగోళికంగా ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కొంత భాగం గ్రేటర్‌లోనే కలిసి ఉంది. రంగారెడ్డి జిల్లాలోని 8స్థానాలకుగాను టీడీపీ నుంచి గెలిచిన ఆరుగురు టీఆర్ఎస్‌లో చేరారు. అయితే తాజాగా ప్రకటించిన రిజర్వేషన్లలో జీహెచ్ఎంసీ జనరల్ మహిళకు కేటాయించగా ప్రస్తుత మేయర్ తదుపరి రాజకీయ భవిష్యత్‌ సందిగ్ధంలో పడింది. దీంతో గ్రేటర్ పీఠంపై ఆశలు పెంచుకున్న ఇతర పార్టీ నాయకుల ఆశలపై కూడా నీళ్లు చల్లినట్టయింది. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ గ్రేటర్‌ను విభజించి తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవీ కోసం టీఆర్ఎస్‌కు చెందిన సీనియర్ నాయకుడి కుమార్తె, మరో నాయకుడి సతీమణి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది కాలంలో జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగియనుండగా ఈక్రమంలోనే గ్రేటర్‌ను విభజించి కనీసం మూడు కొత్త మేయర్ స్థానాలను దక్కించుకునేందుకు వ్యూహం రచిస్తోందని సమాచారం. ఎంఐఎంకు పట్టున్న నాంపల్లి, కార్వాన్, చార్మినార్, యాకుత్‌పురా, బహదూర్‌పురా, గోషామహల్ ఎమ్మెల్యే స్థానాలను కలిపి ఒక కార్పొరేషన్, రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న పరిధిలో మరో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మేయర్ పీఠం దక్కించుకోవడం సులభం అనే ప్లాన్‌లో టీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. అటు రాజకీయ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని ప్రాంతాలను కలిపి మరో రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి లబ్ది పొందాలన్న స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో బీజేపీ రోజు రోజుకు బలపడటం, కొన్ని ప్రాంతాల్లో ఎంఐఎం పాతుకు పోవడంతో ఇక జీహెచ్ఎంసీని డివైడ్ చేసి లబ్ది పొందడమే ఫైనల్ టార్గెట్ అన్నట్లుగా టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News