ఎన్‌కౌంటర్ ఎలా చేశారో వివరించిన గడ్చిరోలి ఎస్పీ
దిశ, తెలంగాణ బ్యూరో : భారీ సంఖ్యలో మావోయిస్టులు సమావేశమవుతున్నట్లు లభించిన నమ్మకమైన సమాచారంతోనే కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి 26 మందిని మట్టుబెట్టినట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు నమ్మకమైన మార్గాల ద్వారా మావోయిస్టు పార్టీకి చెందిన నాల్గవ కంపెనీ, ‘విస్తార్’ ప్లాటూన్, టిపాగఢ్ లోకల్ ఆపరేషన్ స్క్వాడ్, కొర్చి లోకల్ ఆపరేషన్ స్క్వాడ్‌లకు చెందిన దళాలు సమావేశమవుతున్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యుడు మిళింద్ టెల్టుంబ్డే […]
దిశ, తెలంగాణ బ్యూరో : భారీ సంఖ్యలో మావోయిస్టులు సమావేశమవుతున్నట్లు లభించిన నమ్మకమైన సమాచారంతోనే కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి 26 మందిని మట్టుబెట్టినట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు నమ్మకమైన మార్గాల ద్వారా మావోయిస్టు పార్టీకి చెందిన నాల్గవ కంపెనీ, ‘విస్తార్’ ప్లాటూన్, టిపాగఢ్ లోకల్ ఆపరేషన్ స్క్వాడ్, కొర్చి లోకల్ ఆపరేషన్ స్క్వాడ్‌లకు చెందిన దళాలు సమావేశమవుతున్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యుడు మిళింద్ టెల్టుంబ్డే ఈ సమావేశంలో పాల్గొంటున్నట్లు స్పష్టమైన ఇన్ఫర్మేషన్ రావడంతో దాని ప్రాధాన్యతను గుర్తించి తాము కూడా అన్ని జాగ్రత్తలతో కూంబింగ్ ప్లాన్ చేసినట్లు తెలిపారు.
మావోయిస్టులంతా ఇక్కడ సమావేశమై డిసెంబరులో జరగనున్న వారోత్సవాల సందర్భంగా భారీ స్థాయిలో దాడులు నిర్వహించాలనే పథకం వేశారని, దాన్ని ముందుగానే తెలుసుకుని ఎదురుదాడి చేసి సక్సెస్ అయ్యామని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌పై ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి ఈ ఆపరేషన్ గురించి వివరించారు. కూంబింగ్ ఆపరేషన్స్ లో పట్టు ఉన్న అదనపు ఎస్పీ సౌమ్యా ముండే నేతృత్వంలో సీ-60 భద్రతా బలగాలను రంగంలోకి దించామని తెలిపారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు క్యాంపు వేశారన్న ఇన్ఫర్మేషన్ రావడంతో దీన్ని ప్రతిష్ఠగా తీసుకుని ఆపరేషన్‌లో ఆశించిన ఫలితాలను సాధించినట్లు తెలిపారు.
మా వ్యూహం ఫలితాలనిచ్చింది
మావోయిస్టులు క్యాంపు వేసినట్లు పక్కా సమాచారం వచ్చినందునే ఎన్‌కౌంటర్ జరగడానికి ఒక రోజు ముందే సీ-60 స్పెషల్ ఆపరేషన్ స్క్వాడ్‌కు చెందిన పోలీసు బలగాలను గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి సబ్ డివిజన్‌లోని మర్దింటోల అటవీ ప్రాంతానికి తరలించామని తెలిపారు. రాత్రంతా భద్రతా బలగాలు అడవిలోనే మకాం వేశాయన్నారు. మావోయిస్టులు క్యాంపు వేసిన ప్రాంతాన్ని వెతక్కుంటూ తెల్లవారుజామున భద్రతా బలగాలు గాలింపుకు బయలుదేరాయని, తొలుత మావోయిస్టుల నుంచి కాల్పులు మొదలైనట్లు వివరించారు. తెల్లవారుజాము ఆరు గంటలకు మావోయిస్టుల నుంచి కాల్పులు మొదలయ్యాయని, లొంగిపోవాల్సిందిగా హెచ్చరించినా వినలేదని, కాల్పులు ఆపేయాల్సిందిగా వార్నింగ్ ఇచ్చినా మరింత ఎక్కువ చేశారని, చివరకు ఆత్మరక్షణలో భాగంగా తమ బలగాలు కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరించారు.
మావోయిస్టులు భారీ స్థాయిలో కాల్పులు జరుపుడుండడంతో వారు ఏకే-47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ రైఫిళ్ళను వినియోగిస్తున్నట్లు అర్థమైందన్నారు. ఆత్మరక్షణతోపాటు వారిని మట్టుబెట్టడానికి మరింత దూకుడుగా ఫైరింగ్ జరపాల్సిన అవసరాన్ని గుర్తించి వారినే డిఫెన్స్ లో పడేసేలా భద్రతా బలగాలు దీటుగా జవాబిచ్చాయన్నారు. ఉదయం మొదలైన కాల్పులు దాదాపు తొమ్మిదిన్నర గంటల పాటు కొనసాగి సాయంత్రం 3.30 గంటలకు ఆగిపోయాయన్నారు. పూర్తిగా కాల్పులు ఆగిపోవడంతో భద్రతా బలగాలు అడ్వాన్సు అయ్యాయని, అక్కడ మావోయిస్టులు వాడిన ఆయుధాలు కనిపించాయని, అందులో గ్రెనేడ్ లాంచర్లకు వాడే రైఫిళ్ళు కూడా ఉన్నాయన్నారు. మొత్తం గాలింపు పూర్తయిన తర్వాత 26 మంది చనిపోయినట్లు తేలిందని, మరికొంత మంది పారిపోయి ఉండొచ్చన్న అనుమానాన్ని ఎస్పీ అంకిత్ గోయల్ వ్యక్తం చేశారు.
మృతుల్లో ఆరుగురు మహిళా మావోయిస్టులు
పారిపోయినవారిని అదుపులోకి తీసుకునేందుకు అదనపు బలగాలతో గాలింపును కంటిన్యూ చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ దొరికిన ఆయుధాలను పరిశీలించిన తర్వాత కీలకమైన నాయకులే చనిపోయి ఉండొచ్చన్న అంచనాకు వచ్చామని, చివరకు 26 మందిలో 16 మందిని గుర్తించామని, ఇంకా పది మంది వివరాలు తెలియాల్సి ఉన్నదన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు మిళింద్ టెల్టుంబ్డేతో పాటు ఆయన బాడీ గార్డు, ఇద్దరు డివిజనల్ కమిటీ సభ్యులు, ఇద్దరు కమాండర్లు, ఒక ఏరియా కమిటీ సభ్యుడు, ఐదుగురు దళ సభ్యులు, ముగ్గురు ప్లాటూన్ కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు తేలిందన్నారు. మృతి చెందిన 26 మంది మావోయిస్టుల్లో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు.
ఈ ఎన్‌కౌంటర్ తర్వాత ఆరు ఏకే-47, తొమ్మిది ఎస్ఎల్ఆర్, ఒక ఇన్సాస్, మూడు .303 రైఫిళ్ళతో పాటు మొత్తం 29 ఆయుధాలను, రెండు పిస్టళ్ళను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు క్యాంపు చేసినట్లుగా ధ్రువీకరించే టెంట్లు, కిట్ బ్యాగులు, వంట సామాన్లు, నిత్యావసర ఆహార పదార్ధాలు కూడా లభ్యమైనట్లు ఎస్పీ తెలిపారు. వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు యాక్షన్‌కు వాడే వాకీటాకీలు, వాటి ఛార్జర్లు, సోలార్ ప్యానెల్, పేలుడు పదార్ధాలు, డిటొనేటర్లు, ఎలక్ట్రిక్ వైర్ తదితరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
గడ్చిరోలి జిల్లాలో పోలీసులు చాలా కాలం నుంచి బలమైన ఇన్‌ఫార్మర్ నెట్‌వర్క్ ను ఏర్పర్చుకున్నారు. గతంలో ఇన్ఫార్మర్ల ద్వారానే కొన్ని కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టిన పోలీసులు మావోయిస్టులను హతమార్చారు. ఇప్పుడు కూడా ‘పక్కా, పకడ్బందీ సమాచారంతోనే’ కూంబింగ్ చర్యలను చేపట్టినట్లు స్వయంగా ఎస్పీ అంకిత్ గోయల్ నొక్కిచెప్పారు.