‘నయీం కేసును సీబీఐకి అప్పగించండి’
దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలో నేర సామ్రాజ్యాన్ని నెలకొల్పుకున్న గ్యాంగ్‌స్టర్ నయీం కేసు వివాదం కేంద్ర ప్రభుత్వం వద్దకు చేరింది. నయీం తన నేరాలను ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలకు విస్తరించి ఉన్నందున తెలంగాణ రాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టడం అంత సులువైన విషయం కాదంటూ, ఈ కేసును సీబీఐ అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రధాని […]
దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలో నేర సామ్రాజ్యాన్ని నెలకొల్పుకున్న గ్యాంగ్‌స్టర్ నయీం కేసు వివాదం కేంద్ర ప్రభుత్వం వద్దకు చేరింది. నయీం తన నేరాలను ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలకు విస్తరించి ఉన్నందున తెలంగాణ రాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టడం అంత సులువైన విషయం కాదంటూ, ఈ కేసును సీబీఐ అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రధాని నరేంద్ర మోడీకి ఫిబ్రవరిలో లేఖ రాసింది. ఈ లేఖలో నయీం కేసును సీబీఐ విచారణకు ఎందుకు అప్పగించాలో తెలుపుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి సవివరంగా తెలిపారు. నయీం ఎన్‌కౌంటర్ జరిగి ఐదేళ్లు గడుస్తున్నా.. కేసు విచారణకు నియామించిన సిట్ ఇంత వరకూ ఎలాంటి విచారణ చేపట్టలేదని పద్మనాభరెడ్డి ఆరోపించారు. కేవలం లెక్కల కోసమే నయీం అనుచరులపై రెండు వందల కేసులను నమోదు చేశారన్నారు. రాజకీయ, శాఖాపరమైన ఒత్తిడులతో సిట్ నిస్తేజంగా మారిందని ఆయన విమర్శించారు. సిట్‌తో సరైన విచారణ జరగకపోవచ్చనే సందేహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా, నయీంకు సహకరించిన వారికి శిక్ష పడదని ఆ లేఖలో స్పష్టం చేశారు. నయీం నక్సలైట్ మాత్రమే కాకుండా వీధి రౌడి అని అన్నారు. రెండు దశాబ్దాలుగా రాజకీయ, పోలీసుల అండతో ఎంతో మంది అమాయకుల భూములను బలవంతంగా లాక్కున్నారని తెలిపారు.
ఎన్ కౌంటర్ అనంతరం నయీం ఇల్లు సోదాలలో 24 తుపాకులు, 2 స్టెన్ గన్‌లు వంటి మారణాయుధాలు, 752 రిజిస్ట్రేషన్ పత్రాలు, 130 డైరీలు, 602 సెల్ ఫోన్లను జప్తు చేసినట్టు పేర్కొన్నారు. కట్టలు కట్టులుగా లభించిన డబ్బును లెక్కించేందుకు రెండు కౌంటింగ్ మిషన్లను వినియోగించినా రూ.3.74 లక్షలను మాత్రమే లెక్కలోకి చూపిస్తున్నారని, మొత్తంగా రూ.2.16 కోట్ల ఆస్తులను మాత్రమే జప్తు చేసినట్టు చూపుతున్నారన్నారు. గోవాలో కూడా ఆస్తులు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయని అన్నారు. సిట్ విచారణ ప్రారంభంలో పోలీసు అధికారులతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరిగినా.. సిట్ మాత్రం పోలీస్ అధికారులకు క్లీన్ చీట్ ఇవ్వడంపై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ విషయాలన్నింటినీ తెలుపుతూ ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని 2016 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించగా, సిట్ విచారణ సరిగానే చేస్తున్నారంటూ మా విజ్ఞప్తిని తిరస్కరించడం జరిగిందన్నారు. దీంతో 2020 అక్టోబరులో రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ పరిస్థితుల్లోనే ప్రధాని మోడీకి లేఖ రాసినట్టు పద్మనాభరెడ్డి తెలిపారు. దీంతో ఈ ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసినట్టు పద్మనాభరెడ్డి తెలిపారు. రాజకీయ నేతలు, పోలీసులు ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలున్న ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు.