ఈటల దారెటు.. ముందుకా, వెనక్కా.. సర్వే ఏం చెబుతోంది!
దిశ ప్రతినిధి, కరీంనగర్ : పదునుపెట్టిన వ్యూహంతో కదనరంగంలోకి దిగితే కార్యం సిద్ధిస్తుందా? లక్ష్యం నెరవేరుతుందా? అంచనాలకు తగ్గట్టుగానే ప్రజలు బాసటగా నిలుస్తారా? రాజ్యాధికారంలో ఉన్న శత్రువు ఎత్తుగడలు ఎలా ఉంటాయి, వాటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకెళ్తే సక్సెస్ అవుతామా అన్న అంశాలనే ప్రధానంగా తీసుకుని సీక్రెట్ సర్వే చేయించారు రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నినాదానికి అనుగుణంగా సొంత నియోజకవర్గంలో బై పోల్ తీసుకొచ్చి బరిలో నిలిస్తే బలవుతానా […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : పదునుపెట్టిన వ్యూహంతో కదనరంగంలోకి దిగితే కార్యం సిద్ధిస్తుందా? లక్ష్యం నెరవేరుతుందా? అంచనాలకు తగ్గట్టుగానే ప్రజలు బాసటగా నిలుస్తారా? రాజ్యాధికారంలో ఉన్న శత్రువు ఎత్తుగడలు ఎలా ఉంటాయి, వాటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకెళ్తే సక్సెస్ అవుతామా అన్న అంశాలనే ప్రధానంగా తీసుకుని సీక్రెట్ సర్వే చేయించారు రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నినాదానికి అనుగుణంగా సొంత నియోజకవర్గంలో బై పోల్ తీసుకొచ్చి బరిలో నిలిస్తే బలవుతానా లేక బంగారు జీవితాన్ని అందుకుంటానా అన్న వివరాలు తెలుసుకున్నట్టుగా సమాచారం. ఈ అంశాలన్నింటిపై సమగ్ర నివేదికలు తెప్పించుకున్న తరువాతే ఈటల ఉప ఎన్నికలకు ఒంటరిగా వెళ్లే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. మంత్రివర్గం నుండి ఉద్వాసన పలికిన తరువాత కాన్ఫిడెన్షియల్ గా చేయించుకున్న సర్వే ఫలితం అంతా కూడా వ్యతిరేకంగా రావడం వల్లే ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు విముఖత చూపినట్టు సమాచారం. బల పరీక్షలో చతకిలపడితే రాజకీయ భవిషత్తు శూన్యంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదని నిపుణులు ఇచ్చిన సలహాలను కూడా పరిగణణలోకి తీసుకున్నందునే ఈటల నిర్ణయాన్ని మార్చుకున్నట్టు సమాచారం.
స్వతంత్రగా వెళితే..
అధికార టీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడల ముందు ఇండిపెండెంట్ అభ్యర్థి వ్యూహాలు చిత్తవడమే తప్ప మరోటి కాదన్నది సర్వేలో తేలిన వాస్తవం. స్వతంత్ర అభ్యర్థిగా ఈటల పోటీ చేస్తే ముందుగా ప్రజల్లోకి ఆయనకు ఎన్నికల కమిషన్ కేటాయించే గుర్తును తీసుకెళ్లడం అంత సులువైన విషయం కాదు. అంతేకాకుండా ఈటల రాజేందర్ కారు గుర్తు అన్న భావనలో ఉన్న సామాన్య జనం సాధారణంగా కారు గుర్తుకు వేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇండిపెండెట్లు కూడా పెద్ద ఎత్తున పోటీలో నిలిచే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈటల గుర్తు ఈవీఎంలలో ఓటర్లు గుర్తించే అవకాశం చాలా అరుదే. స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీ చేస్తే వారు చీల్చుకునే ఓట్లు కూడా గెలుపు ఓటములను శాసిస్తాయి. ఈ నేపథ్యంలో రాజీనామా చేయకుండా మిన్నకుండి పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు ఈటల. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు అభ్యర్థులను పోటీలో నిలబెట్టకుండా ఉంచాలన్న ప్రయత్నాలు చేసినప్పటికీ సానుకూలత లభించనట్టుగా సమాచారం. దీంతో చివరకు తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే తీరని నష్టాన్ని చవి చూడల్సి వస్తుందని భావించిన ఈటల తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా సమాచారం.
కౌశిక్‌ను కాదంటరా..?
కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసం ప్రయత్నించిన ఈటల మదిని మరో ప్రశ్న కూడా తొలుస్తోంది. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీప బంధువు అయిన కౌశిక్ రెడ్డిని కాదని తనకు మద్దతు ఇచ్చే అవకాశాలు లేవన్న సంకేతాలు అందాయి. ఒక వేళ కాంగ్రెస్ పార్టీలో చేరినా ఇదే పరిస్థితి ఉంటుందని భావించిన ఈటల తన చూపును మరల్చుకున్నట్టుగా తెలుస్తోంది.
మానుకోట ఘటన రోజునే..
2010 మే 28న తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానుకోట టూర్‌కు వెళ్లారు. తెలంగాణ ఉద్యమకారులకు, వైఎస్సార్సీపీ నాయకులకు మధ్యన పెద్ద ఎత్తున గొడవ జరిగింది. రాళ్ల దాడి నుండి కాల్పుల వరకూ వెల్లింది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో అత్యంత ఘోరమైన ఘటనగా చెప్పే మానుకోట ఘటనలో ఇద్దరు ఉద్యమకారులు మరణించగా పెద్ద ఎత్తున గాయాలపాలయ్యారు. ఈ ఘటన జరిగి సరిగ్గా 12 ఏళ్లయిన రోజునే తన రాజకీయ భవిష్యత్తుపై కీలక సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. అప్పుడు వైఎస్ జగన్ ఈటల రాజేందర్ లక్ష్యంగానే పలు ఆరోపణలు చేశారు. తాను స్థానికేతరున్ని అయినప్పుడు ఈటల రాజేంద్ర స్థానికేతరుడు కాదా అంటూ పదే పదే ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ మానుకోట ఘన జరిగి పుష్కర కాలం గడిచిన రోజునే ముఖ్యమైన నిర్ణయం తీసుకునేందుకు భేటీలు నిర్వహించడం గమనార్హం. ఇకనుండి ఈటల తీసుకునే ప్రతి నిర్ణయం వెనక తెలంగాణ ఉద్యమ ఆనవాళ్లు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారని స్పష్టం అవుతోంది.