వరదల వల్లే ‘కజిరంగా’ పునర్నిర్మాణం!
కరోనా వైరస్ కారణంగా మిగతా మంచి వైరస్‌లను కూడా తప్పుగా అర్థం చేసుకున్నామని తెలుసుకున్నాం. ఇప్పుడు అస్సాంలో వరదలు వచ్చాయి. ఈ వరదల్లో 73 మంది చనిపోగా 40 లక్షల మంది జనాభా ప్రభావితమయ్యారు. అంతేగాకుండా వివిధ జంతువృక్ష జాలానికి నిలయమైన కజిరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ 85 శాతం నీటమునిగిపోయింది. అందువల్ల ఖడ్గమృగాలు, జింకలు వంటి 86 జంతువులు చనిపోగా, 125 జంతువులను అధికారులు కాపాడగలిగారు. 1988 నుంచి ఇంత తీవ్రస్థాయిలో వరదలు […]
కరోనా వైరస్ కారణంగా మిగతా మంచి వైరస్‌లను కూడా తప్పుగా అర్థం చేసుకున్నామని తెలుసుకున్నాం. ఇప్పుడు అస్సాంలో వరదలు వచ్చాయి. ఈ వరదల్లో 73 మంది చనిపోగా 40 లక్షల మంది జనాభా ప్రభావితమయ్యారు. అంతేగాకుండా వివిధ జంతువృక్ష జాలానికి నిలయమైన కజిరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ 85 శాతం నీటమునిగిపోయింది. అందువల్ల ఖడ్గమృగాలు, జింకలు వంటి 86 జంతువులు చనిపోగా, 125 జంతువులను అధికారులు కాపాడగలిగారు. 1988 నుంచి ఇంత తీవ్రస్థాయిలో వరదలు రావడం ఇది ఆరోసారి.
అయితే పైన చెప్పిన గణాంకాలన్నీ చూసి ఈ వరదలను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నిజానికి ఇలా వరదలు రాకపోతే కజిరంగా పార్కు ఎప్పుడో ఎడారిగా మారి ఉండేది. అవును… ఆ పార్కు ఎదుగుదలకు ఈ వరదలే ప్రధాన కారణం. వాస్తవానికి మొత్తం అస్సాం రాష్ట్రమే ఒక వరద పీడిత ప్రాంతం, అందులోనూ ఈ కజిరంగా పార్కు బ్రహ్మపుత్ర, కార్బీ ఆంగ్లాంగ్ కొండల మధ్య ఉండటంతో వరద రావడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. సూటిగా చెప్పాలంటే.. ఈ పార్కు జీవావరణం ఒక వరద ఆధారిత జీవావరణం. బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల నుంచి వచ్చిన మట్టి పేరుకుపోయి ఈ కజిరంగా ఏర్పడిందని పార్కు డైరెక్టర్ పి. శివకుమార్ అంటున్నారు. అందుకే ప్రతి ఏడాది వరదలతో ఇది ప్రభావితమైతేనే దాని వైభవాన్ని పునర్నిర్మించుకోగలుగుతుందని ఆయన వివరించారు.
పార్కులో ఉన్న నీటి వనరులను ఈ వరదలు శుద్ధి చేస్తాయి. తద్వారా ల్యాండ్‌స్కేప్ సమతలంగా మారి పచ్చికబయళ్లు, చిన్నచిన్న పొదలు ఏర్పడటానికి వీలుగా ఉంటుంది. ఈ వరదల్లో కొట్టుకొచ్చిన చేపలు ఇక్కడి వనరుల్లో పెరిగి పెద్దవై ఇతర పెద్ద జంతువులకు ఆహారంగా మారతాయి. ఈ ప్రక్రియతో కజిరంగా తనను తాను పుష్కలంగా వనరులు ఉండేలా మార్చుకుంటుందని కజిరంగా జంతుజాల వార్డెన్ ఉత్తమ్ సైకియా వివరించారు. అలాగే వేసవికాలంలో సమృద్ధిగా దొరికిన సూర్యరశ్మి వల్ల నీటిలో ఏపుగా పెరిగిన నీటి హైసింత్ మొక్కలను ఈ వరదలు తొలగించి, ఇతర జీవులు పెరిగేందుకు వీలు కల్పిస్తాయని ఆయన చెప్పారు. అందుకే వరదలే గనక లేకపోతే ఈ ప్రాంతం ఎండిన మొక్కలతో నిండిపోయి ఉండేదని ఆయన చెబుతున్నారు. అయితే ఎలాగూ వరదలు వస్తాయని తెలుసు కాబట్టి, ప్రాణనష్టం, ఆస్తి నష్టం తగ్గించడానికి ముందే ఒక అప్రమత్త ప్రణాళిక ఉంటే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు.