‘తొలి ఏకాదశి’ స్పెషల్.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా..!

దిశ, వెబ్‌డెస్క్ : నేడు తెలుగువారి మొట్టమొదటి పండుగ తొలిఏకాదశి. ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు తొలి ఏకాదశి జరుపుకుంటారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘తొలి […]

Update: 2021-07-19 22:01 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నేడు తెలుగువారి మొట్టమొదటి పండుగ తొలిఏకాదశి. ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు తొలి ఏకాదశి జరుపుకుంటారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘తొలి ఏకాదశిగా’’ గా పిలుస్తారు.

దీని తర్వాతే వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి. హైందవ సంస్కృతంలో తొలి ఏకాదశికి విశిష్ఠ స్థానం ఉంది. అందుకే దీన్ని ‘‘శయనైకాదశి’’ అని ‘‘హరి వాసరమని‘‘ , ‘‘పేలాల పండుగ’’ అని కూడా పిలుస్తారు. పురాణాలను అనుసరించి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు.. అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని.. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు అని పురాణాలు చెప్తున్నాయి. ఈ నాలుగు నెలలని చతుర్మాసాలు అంటారు. ఈ కాలంలో కొంతమంది చతుర్మాస దీక్ష చేస్తారు. ఈ నాలుగు నెలలూ స్వామివారు పాతాళంలో బలి చక్రవర్తి దగ్గర ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని పురాణాలు చెబుతున్నాయి.

తొలి ఏకాదశి రోజున ఉపవాసం..

ఈ రోజు తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి, విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది. మర్నాడు ద్వాదశి. ఆ రోజున దగ్గర్లోని ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్ష విరమించాలి. ఇవాళ ఆవులను పూజిస్తే ఎంతో మంచిదని పండితులు తెలిపారు.

ఉపవాసం చేసేవారు అనుసరించాల్సిన నియమాలు..

  • ఏకాదశి రోజున ఉపవాసం ఉండే వారు తులసి ఆకులను తెంపకూడదు. అలాగే శ్రవణం, కీర్తనం, హరి నామ స్మరణం ఎక్కువ చేయాలి.
  • ఏకాదశి రోజు కృష్ణుడిని పూజించాలి అనుకునేవారు ముందు రోజు తులసి దళాన్ని సిద్ధం చేసుకుని ఏకాదశి రోజున కృష్ణుడిని ధూపం, దీపం, తులసి పత్రాలతో పూజిస్తే శుభఫలితాలు సొంతమవుతాయి.
  • ఏకాదశిని చేసేవారు పండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్, కంద మూలాలు, సగ్గు బియ్యం, సామల తో చేసిన వంటలు తినవచ్చు.
  • ఏకాదశి ఉపవాసం చేసేవారు పప్పుధాన్యాలు, గోకరకాయ, చిక్కుడుకాయ, బఠాణిలను ఆహారపదార్ధాలుగా తీసుకోకూడదు.

పేలాల పిండి…

పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలంటారు పెద్దలు. మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండుగ రోజున గుర్తు చేసుకోవడం మన ధర్మం. వాతావరణంలో మార్పుల వల్ల మనకు రకరకాల రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం మొదలైంది కాబట్టి ఇన్ఫెక్షన్ల దాడి తప్పదు. ఈ సమయంలో పేలాల పిండి బాడీలో వేడిని పెంచుతుంది. తద్వారా ప్రోటీన్స్, ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్లు రావు. అందుకే నేడు ఇళ్లలో, ఆలయాల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు. పైన చెప్పిన నియమాలు, ఉపవాసం ఇవన్నీ చేస్తే మంచిదే. అనారోగ్యంతో ఉన్న వారు ఇలాంటివి చెయ్యడం కష్టం. అలాంటి వారు పూర్తి విశ్రాంతి తీసుకోవడం మేలని పండితులు తెలిపారు.

Tags:    

Similar News