పాఠాలు చెప్పిన మేమే పరేషాన్‌ అయితున్నం.. అదేమంటే..?

దిశ ప్రతినిధి, వరంగల్: కరోనా దెబ్బకు ప్రైవేట్ టీచర్ల జీవితాలు ఆగమయ్యాయి. లాక్‌డౌన్ దెబ్బకు అన్నిసంస్థలు మూతపడటంతో ఉద్యోగులు బతుకీడ్చలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా విద్యాసంస్థలు తెరుచుకోని కారణంగా ప్రైవేట్ టీచర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కళాశాలలు మూతపడడంతో టీచర్లు, లెక్చరర్లు ఏం చేయాలో తెలియక జర మమ్మల్ని ఆదుకోండంటూ సారూ.. అంటూ మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. నాలుగు నెలలుగా జీతాలు లేవంటూ కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని ఆందోళన వ్యక్తం […]

Update: 2020-07-19 21:20 GMT

దిశ ప్రతినిధి, వరంగల్: కరోనా దెబ్బకు ప్రైవేట్ టీచర్ల జీవితాలు ఆగమయ్యాయి. లాక్‌డౌన్ దెబ్బకు అన్నిసంస్థలు మూతపడటంతో ఉద్యోగులు బతుకీడ్చలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా విద్యాసంస్థలు తెరుచుకోని కారణంగా ప్రైవేట్ టీచర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కళాశాలలు మూతపడడంతో టీచర్లు, లెక్చరర్లు ఏం చేయాలో తెలియక జర మమ్మల్ని ఆదుకోండంటూ సారూ.. అంటూ మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. నాలుగు నెలలుగా జీతాలు లేవంటూ కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేట్ టీచర్ల గోస..

కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో మూసివేశారు. ఎప్పుడు తెరుస్తారో అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఆయా విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో 12 వేల పాఠశాలలు, 1,525 జూనియర్ కళాశాలలు, వెయ్యి డిగ్రీ, పీజీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో సుమారు 5.5 లక్షల మంది టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. విద్యా సంస్థలు మూసి ఉన్న కారణంగా మెజార్టీ యాజమాన్యాలు వేతనాలు ఇవ్వడం లేదు. కొన్ని యాజమాన్యాలు చెల్లించినప్పటికీ మూడో వంతు ఇస్తుండటంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొంతమంది ఉపాధిహామీ పనులకు వెళ్తున్నారు. మరి కొందరు కుల వృత్తులపై ఆధారపడుతున్నారు.

ప్రభుత్వం చొరవ తీసుకోవాలి..

కరోనా విపత్కర పరిస్థితుల్లో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేశామని, అంతేగాకుండా టీఆర్ఎస్ పార్టీ గెలుపునకు పని చేసామని అసోషియేషన్ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు తెరిచే వరకు ప్రభుత్వ అనుమతి ఉన్నపాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రూ. 20 వేలు, నాన్ టీచింగ్ ఉద్యోగులకు నెలకు రూ. 10 వేలు ఇవ్వాలని కోరుతున్నారు. అంతేగాకుండా కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు 12 నెలల వేతనం చెల్లించి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

కనీస వేతనం ఇవ్వాలి: పులి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న వారి సర్వీస్‌ను పరిగణలోకి తీసుకుని కనీస వేతనం ఇవ్వాలి. డబుల్ బెడ్ రూం ఇండ్ల ఫథకంలో అవకాశం కల్పించాలి. పాఠశాలలు, కళాశాలలు తెరిచే వరకు ప్రత్యేక ప్యాకేజీ కింద అధ్యాపకులను ఆదుకోవాలి.

సీఎం ఆదుకోవాలి: చిలువేరు శంకర్, ప్రైవేట్ లెక్చరర్

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ అధ్యాపకులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలి. లాయర్లకు ఇచ్చినట్లు అధ్యాపకులకు సైతం ప్రత్యేక నిధిని కేటాయించాలి. విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చించి కనీస వేతనం అందేలా చర్యలు తీసుకోవాలి.

Tags:    

Similar News