అసెంబ్లీలో నేడే బడ్జెట్‌.. మళ్లీ అప్పులు తప్పవా..?

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. గురువారం ఉదయం 11.30 గంటలకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శాసన మండలిలో ప్రవేశపెడతారు. గతేడాది బడ్జెట్‌ సైజు రూ. 1.82 లక్షల కోట్లు అయినప్పటికీ అందులో పన్నుల ద్వారా సుమారు రూ. 1.43 లక్షల కోట్లు వస్తుందని, మరో రూ. 39,550 కోట్లను అప్పుల ద్వారా సమకూర్చుకోవచ్చని అంచనా వేసింది. ఆ అంచనాల […]

Update: 2021-03-17 14:10 GMT

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. గురువారం ఉదయం 11.30 గంటలకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శాసన మండలిలో ప్రవేశపెడతారు. గతేడాది బడ్జెట్‌ సైజు రూ. 1.82 లక్షల కోట్లు అయినప్పటికీ అందులో పన్నుల ద్వారా సుమారు రూ. 1.43 లక్షల కోట్లు వస్తుందని, మరో రూ. 39,550 కోట్లను అప్పుల ద్వారా సమకూర్చుకోవచ్చని అంచనా వేసింది. ఆ అంచనాల ప్రకారం జనవరి చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా రూ. 60 వేల కోట్లు, ఇతర మార్గాల ద్వారా మరో రూ. 14 వేల కోట్లు మాత్రమే సమకూరాయి. కరోనా పరిస్థితుల్లో సుమారు రూ. 52 వేల కోట్ల మేర రాబడి తగ్గిపోయిందని, దీని ప్రభావం సుమారు లక్ష కోట్ల మేర ఉన్నట్టు సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూపొందించిన వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం బుధవారం రాత్రి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో బడ్జెట్‌పై చర్చల అనంతరం ఆమోదముద్ర పడింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ఉదయం 11.30 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు. గతేడాది సుమారు 1.82 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా కరోనా పరిస్థితుల్లో సుమారు రూ. 52 వేల కోట్ల మేర రాబడి తగ్గిపోయింది. ఈ ప్రభావం సుమారు లక్ష కోట్ల మేర ఉన్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. తాజాగా బుధవారం అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో కొత్త ఏడాది బడ్జెట్ అంచనాలు ఎలా ఉంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.

కరోనా కారణంగా దాదాపు మూడు నెలల పాటు కనీస స్థాయికి ఆదాయం పడిపోయినా ‘అన్‌లాక్’ పేరుతో ఆంక్షలను సడలించడంతో క్రమేణా ఆదాయ వనరులు మెరుగుపడ్డాయి. అయితే పూర్తి స్థాయిలో గాడిలో పడకపోయినప్పటికీ జీఎస్టీ వసూళ్ళు, రాష్ట్ర స్వీయ ఆర్థిక వనరుల్లో ప్రధానమైనవిగా ఉన్న మద్యం ఆదాయం (స్టేట్ ఎక్సయిజ్), పెట్రోలు-డీజిల్ ద్వారా సమకూరే ‘వ్యాట్’ (వాణిజ్య పన్నులు) సంతృప్తికరంగానే ఉన్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన డివొల్యూషన్, వివిధ పద్దుల కింద వచ్చే గ్రాంట్-ఇన్-ఎయిడ్ లాంటివి గణనీయంగా తగ్గిపోయాయి. ఇక జీఎస్టీ పరిహారం కూడా సకాలంలో అందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న బడ్జెట్‌లో కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందుతుందనే ఆశలు లేకపోయినా రాష్ట్ర స్వీయ ఆర్థిక వనరులపైన, అప్పులపైనే నమ్మకం పెట్టుకుని కనీసంగా పది శాతం పెంపుతో బడ్జెట్ రూపొందించే అవకాశం ఉన్నట్లు ఆర్థికశాఖ వర్గాల సమాచారం.

గతేడాది బడ్జెట్‌ సైజు రూ. 1.82 లక్షల కోట్లు అయినప్పటికీ అందులో పన్నుల ద్వారా సుమారు రూ. 1.43 లక్షల కోట్లు వస్తుందని, మరో రూ. 39,550 కోట్లను అప్పుల ద్వారా సమకూర్చుకోవచ్చని అంచనా వేసింది. ఆ అంచనాల ప్రకారం జనవరి చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా రూ. 60 వేల కోట్లు మాత్రమే సమకూరాయి. ఇక కేంద్రం నుంచి గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపంలో మరో రూ. 11,764 కోట్లు వచ్చాయి. అయితే అప్పుల ద్వారా కేవలం రూ. 34 వేల కోట్లను మాత్రమే సమకూర్చుకోవాలని భావించినా కేంద్రం ప్రభుత్వం కొన్ని సంస్కరణలను అమలు చేస్తే మరిన్ని రుణాలు తీసుకోవచ్చని ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంచుతూ అవకాశం కల్పించింది. ఆ ప్రకారం జనవరి చివరి నాటికే సుమారు రూ. 44 వేల కోట్లను తీసుకున్నట్లు ‘కాగ్’ రూపొందించిన ప్రొవిజనల్ గణాంకాల ద్వారా స్పష్టమైంది.

రూ. రెండు లక్షల కోట్ల బడ్జెట్.?

ఫిబ్రవరి, మార్చి మాసాల్లో పన్నుల ద్వారా మరికొంత ఆదాయం సమకూరడంతో పాటు రిజర్వు బ్యాంకు నుంచి రుణాలను కూడా తీసుకుంది. జీఎస్టీ వసూళ్ళు, రాష్ట్రంలో మద్యం అమ్మకాల ద్వారా స్టేట్ ఎక్సయిజ్ కూడా సంతృప్తికరంగా వస్తుండడంతో ప్రజల కొనుగోలు శక్తి, వారి జీవన ప్రమాణాలు, ఆర్థిక లావాదేవీలు తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కనీసంగా పది శాతం పెంపుతో కొత్త బడ్జెట్ రూపొందే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ ప్రకారం దాదాపుగా రెండు లక్షల కోట్ల వరకు రానున్న బడ్జెట్ ఉండొచ్చని ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి పెద్ద బడ్జెట్‌గా ఉండే అవకాశం ఉంది.

ఫిట్ మెంట్, భృతి ఎలా?

రానున్న బడ్జెట్‌లో ప్రభుత్వానికి కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులకు గతంలో తీసుకున్నరుణాలను తిరిగి చెల్లించడం ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. అసలుతో పాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగులకు పీఆర్సీ గౌరవప్రదంగా, సంతృప్తికరంగా ఉంటుందని సీఎం చెప్పినందువల్ల 30% ఫిట్‌మెంట్ ఉంటుందన్న అంచనాతో సుమారు రూ. 9000 కోట్ల మేర అదనపు భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే వేతనాలకు ప్రతీ ఏటా సుమారు రూ. 30 వేల కోట్లు అవుతుండగా ఫిట్‌మెంట్ పేరుతో మరికొంత పెరగనుంది. ఇక 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి అదనంగా ఖర్చవుతుంది. దీనికి తగిన ఆదాయ వనరులను వెతుక్కోవాల్సి ఉంటుంది. ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ. 3,016 చొప్పున సుమారు 12 లక్షల మందికి నిరుద్యోగ భృతి పేరుతో సాయం చేయడానికి కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

ఆసరాపై ఆశలు

‘ఆసరా’ పింఛనుదారుల అర్హతా వయసును 57 సంవత్సరాలకు కుదిస్తామన్న హామీ అమలులోకి వస్తే లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగి ఖజానాపై భారం పడే అవకాశం ఉంది. రైతుల రుణమాఫీకి గత బడ్జెట్‌లో పాతిక వేల అప్పును మాత్రమే పరిగణనలోకి తీసుకుని నిధులను కేటాయింపు, విడుదల చేయగా ఈసారి లక్ష రూపాయల పరిమితి వరకు మాఫీ కోసం కేటాయింపు చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు పాలమూరు-రంగారెడ్డి లాంటి పలు సాగునీటి ప్రాజెక్టులను ఏడాది కాలంలో పూర్తి చేయనున్నట్లు సీఎం చెప్పినందువల్ల వాటికి కూడా నిధులను కనీసంగా రూ. 20 వేల కోట్ల మేరకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.

ఆర్థిక వనరులే అసలు సమస్య

వీటన్నింటి కారణంగా బడ్జెట్ సైజు పెరగడం అనివార్యమని ఆర్థిక శాఖ వర్గాలు సూచించాయి. కానీ వీటికి సరిపోయేలా ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంపైనే అసలు సమస్య ఉందని, ఈ ఏడాది లాగానే వచ్చే ఏడాది కూడా సుమారు రూ. 50 వేల కోట్ల మేర రిజర్వు బ్యాంకు, ఇతర ద్రవ్య సంస్థల నుంచి మరికొంత అదనంగా రుణాలను తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని పేర్కొన్నారు. అప్పులపై ప్రతీ ఏటా సుమారు రూ. 15 వేల కోట్ల మేర వడ్డీ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఈ ఏడాది కాలంలో తీసుకున్న అప్పులపై వడ్డీ అదనంగా తోడుకానుంది.

Tags:    

Similar News