వద్దని చెప్పినా వినట్లే.. ‘మూసీ’లో చేపల వేట
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : మూసీ నీటిలో పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ స్థానికంగా నివాసముండే వారిలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు నదిలో నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నా ఏమాత్రం లెక్క చేయకుండా నీటి వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మూసీకి వరద పోటెత్తడంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట ఓల్డ్ మలక్ పేట్‌లో మూసీలో ఈతకు వెళ్లిన […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : మూసీ నీటిలో పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ స్థానికంగా నివాసముండే వారిలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు నదిలో నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నా ఏమాత్రం లెక్క చేయకుండా నీటి వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మూసీకి వరద పోటెత్తడంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట ఓల్డ్ మలక్ పేట్‌లో మూసీలో ఈతకు వెళ్లిన వ్యక్తి కుమారుని కండ్ల ముందే నీటిలో పడి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు స్థానికంగా నివాసముండే వారి కళ్లు తెరిపించడం లేదు. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా నీటిలో చేపలు పట్టడానికి వెళ్తున్న వారిని అడ్డుకునే వారే లేకుండా పోయారు. కొంతమంది ఏకంగా వలలు, బుట్టలు తీసుకుని మూసీనదిలోకి దిగి చేపలు పడుతున్నారు. పిల్లలకు జాగ్రత్తలు చెప్పవలసిన పెద్దలు కూడా వారితో కలిసి మూసీ నీటిలోకి దిగుతుండటాన్ని గమనిస్తే.. స్థానిక పోలీసులు, అధికారులు మూసీ ఉధృతి పై ఏ విధంగా పర్యవేక్షణ చేస్తున్నారో అర్థమవుతుంది.
భద్రతా చర్యలేవి..?
మూసీ నదికి ఇరువైపులా ఎక్కడి నుంచైనా నీటి వద్దకు వెళ్లడానికి వీలుంది. ముఖ్యంగా చాదర్ ఘాట్, అంబర్ పేట్, కొత్తపేట, నాగోల్ ప్రాంతాల్లో సమీపంగా నివాసముండే వారు కొంతమంది కాలకృత్యాలకు సైతం మూసీ నీటిలోకి దిగుతున్నారు. ఇలా దిగిన సందర్భంలో కాలు జారీ నీటిలో పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మూసీ నీటిలో గుర్తు తెలియని మృతదేహాలు సైతం కొట్టకువచ్చిన విషయం తెలిసిందే. కండ్ల ముందే ఇలా పిల్లలు, పెద్దలు మూసీ నీటిలోకి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నా అధికారులు ఎలాంటి రక్షణ, భద్రతా చర్యలు చేపట్టడం లేదు. గతంలో జరిగిన ఘటనలను వారు మర్చిపోయినట్టు ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు మూసీకి ఇరువైపులా నీటిలోకి ఎవరూ వెళ్లకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.