ధాన్యం.. అమ్మబోతే దైన్యం

దిశ, కరీంనగర్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నామమాత్రంగా మారిందా? ఫైనల్ డెసిషన్ తీసుకునే విషయంలో ప్రభుత్వాన్ని శాసిస్తోంది మిల్లర్లే అన్నట్టుగా తయారైందా? అంటే కాదని నోటితో చేప్తున్నా చేతల్లో మాత్రం వాస్తవమేనని స్పష్టం అవుతోంది. కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయిందన్న సంతోషంతప్ప ఈ ఏడాది కూడా రైతాంగానికి కష్టాలు తప్పడం లేదు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి కొత్తగా మిల్లర్లు తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మిల్లర్లు అభ్యంతరం చెప్తున్నారని కొనుగోలు […]

Update: 2020-05-10 02:14 GMT

దిశ, కరీంనగర్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నామమాత్రంగా మారిందా? ఫైనల్ డెసిషన్ తీసుకునే విషయంలో ప్రభుత్వాన్ని శాసిస్తోంది మిల్లర్లే అన్నట్టుగా తయారైందా? అంటే కాదని నోటితో చేప్తున్నా చేతల్లో మాత్రం వాస్తవమేనని స్పష్టం అవుతోంది. కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయిందన్న సంతోషంతప్ప ఈ ఏడాది కూడా రైతాంగానికి కష్టాలు తప్పడం లేదు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి కొత్తగా మిల్లర్లు తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మిల్లర్లు అభ్యంతరం చెప్తున్నారని కొనుగోలు కేంద్రాల వద్ద చెప్తుంటే, తమకేమీ సంబంధం లేదని మిల్లర్లు అంటున్నారు.

ట్రక్ షీట్స్ ఇవ్వని వైనం

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన తర్వాత రైతులకు ఇవ్వాల్సిన ట్రక్ షీట్ అందజేయడంలేదు. ఆ ధాన్యం మిల్లులకు చేరి మిల్లర్లు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తర్వాత ట్రక్‌షీట్ ఇస్తున్నారు. దీంతో మిల్లర్లు తాలు ఎక్కువ ఉందని చెప్పినా, మాయిశ్చర్ పర్సెంటేజీ ఎక్కువగా ఉందని చెప్పినా అదనపు తరుగు తీస్తున్నారని రైతులు వాపోతున్నారు. అయితే కరోనా వ్యాధి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణకు ప్రత్యేకచర్యలు తీసుకున్న ప్రభుత్వం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటోంది. అధికారులు టోకోన్ సిస్టం లేదా డ్రా పద్ధతిలో వరి కోయాలని చెప్తున్నారు. ఆ తర్వాత మాయిశ్చర్ శాతాన్ని పరిశీలించిన తర్వాతే కొనుగోళ్లకు అనుమతి ఇస్తున్నారు. చివరకు మిల్లర్లు చెప్తేనే ట్రక్‌షీట్ ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెగులే కారణమా?

వరిపంటకు ఈసారి ఎరుపు తెగులు పట్టిందని, దీనివల్ల తాలు ఎక్కువగా వస్తోందని ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నారు. కానీ, గతంలో తెగులు పట్టిన సందర్భాలు ఉన్నాయని, అప్పుడు ఇన్ని కొర్రీలు పెట్టలేదని రైతులు అంటున్నారు. హార్వెస్టర్ విధానం వల్ల తాలు వస్తోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నారు. తెలంగాణలో పదేళ్ల క్రితం నుండే హార్వెస్టర్ల ద్వారా వరికోతలు జరుగుతున్నాయని, గతంలో ఏనాడూ ఎదురు కాని ఈ సమస్య ఇప్పుడు ఎందుకు వస్తోందన్నది అంతుచిక్కకుండా ఉంది.

మిల్లర్ల ప్రమేయం అంతంతే…

దళారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలన్న లక్ష్యంతో చాలాఏళ్ల నుండి ఐకేపీ, పీఏసీసీఎస్, డీసీఎమ్మెఎస్‌ల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మిల్లర్ల నిర్ణయాలతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిర్వహించిన ప్రభుత్వం ఈసారి మాత్రం వారినే బూచీగా చూపెడుతోందని రైతులు అంటున్నారు. ధాన్యం విక్రయాల్లో నేరుగా రైతులకు, మిల్లర్లకు ఎలాంటి సంబంధం ఉండేది కాదని, ఇప్పుడు మాత్రం వారే కీలకభూమిక పోషిస్తున్నారని స్పష్టం అవుతోంది.

మిల్లర్ల ద్వంద్వ వైఖరి

క్వింటాల్ ధాన్యానికి 68 కిలోల బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సిన బాధ్యత మిల్లర్లకు ఉంటుంది. అయితే తాలు పేరిట తరుగు వస్తే తాము నష్టపోతామని మిల్లర్లు వాదిస్తున్నారు. ఇటీవల కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయి. రైతులకు తమకు ఎలాంటి సంబంధం లేదని తమను కావాలనే కొంతమంది రాజకీయ నాయకులు ఇరికిస్తున్నారని అంటూనే జిల్లా మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్‌కు పూర్తి అవగాహన ఉందని అంటున్నారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల తీరును మొదట తప్పు పట్టింది రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ కావడం గమనార్హం. మరోవైపు మిల్లర్ల ప్రతినిధులు మాట్లాడుతూ తాము షాంపిల్‌గా బస్తా ధాన్యాన్ని పరిశీలిస్తే నాలుగు కిలోల మేర తరుగు వచ్చిందని అన్నారు. తమకు రైతులతో సంబంధం లేదంటున్న మిల్లర్లే ధాన్యంలో తాలు వస్తోందని చెప్పడం విడ్డూరంగా ఉంది.

రైతుల గుబులే వరం

కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం లోడ్ అయ్యే వరకూ రైతులదే బాధ్యత కావడంతో వారిలో సహజంగానే ఆందోళన తీవ్రంగా ఉంటుంది. కష్టపడి పండించిన పంట చేతికి వచ్చినా దానిని ప్రభుత్వం మిల్లులకు తరలించే వరకూ వర్షం పడితే ధాన్యం రంగు మారుతోంది. దీంతో గిట్టుబాటు ధర రాకుండా పోయే ప్రమాదం ఉందన్న భయంతో తాలు, తరుగు పేరిట 5 నుండి 6 కిలోల వరకు కోత విధిస్తున్నా రైతులు కిమ్మనకుండా ఉంటున్నారు.

అన్నింటా మోసమే- ముకుందరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి

రైతులను అన్నింటా మోసం చేసే పరిస్థితే కనిపిస్తోంది. సివిల్ సప్లై మంత్రి కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తే అయినా జిల్లా రైతాంగానికి మాత్రం న్యాయం జరగడం లేదు. ఐకేపీ సెంటర్ల నిర్వహణ బాధ్యతలు గతంలో చేసిన గ్రూపులకే అప్పగిస్తుండడం వల్ల వారు మిల్లర్లకు మిలాఖాత్ అవుతున్నారు.

మద్దతు అంటూనే మోసం- శశిభూషన్ కాచే, కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కో ఆర్డినేటర్

ధాన్యానికి గిట్టుబాటు ధర ఇస్తున్నామని చెప్తూనే ప్రభుత్వం రైతును నట్టేట ముంచుతోంది. క్వింటాలుకు 140 రూపాయల వరకూ రైతు నష్టపోవాల్సిన పరిస్థితి తయారైంది. తరుగు పేరిట ఎక్కువ ధాన్యం తూకం వేసుకోవడమే కాకుండా హమాలీ ఛార్జి చెల్లించడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

రైతులను దగా చేస్తున్నారు- భేతి మహేందర్‌రెడ్డి, బీజేపీ కరీంనగర్ అధ్యక్షుడు

రైతాంగాన్ని దగా చేసే కుట్ర జరుగుతోంది. మిల్లర్లతో కుమ్మక్కై సరికొత్త డ్రామాకు తెరలేపి ఇప్పుడు తాలు, తేమ పేరిట తరుగు తీస్తున్నారు. ఇంతకాలం మిల్లర్లతో సంబంధంలేకుండా జరిగిన కొనుగోళ్లు ఇప్పుడు వారి ప్రమేయంతో జరగడం విచిత్రంగా ఉంది. రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లే నిర్ణయాలు మంచిది కాదు.

Tags:    

Similar News