పురుగులమందుతో రైతుల నిరసన.. ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక

దిశ, కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట స్టేజి వద్ద బుధవారం రైతులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. పురుగుల మందు డబ్బాలను చేత పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటల పాటు రైతులు రోడ్డుపై బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న కామారెడ్డి డీఎస్పీ సోమనాథం రైతుల ధర్నా వద్దకు వచ్చి సముదాయించే ప్రయత్నం చేసినా రైతులు […]

Update: 2021-11-18 03:27 GMT

దిశ, కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట స్టేజి వద్ద బుధవారం రైతులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. పురుగుల మందు డబ్బాలను చేత పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటల పాటు రైతులు రోడ్డుపై బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది.

విషయం తెలుసుకున్న కామారెడ్డి డీఎస్పీ సోమనాథం రైతుల ధర్నా వద్దకు వచ్చి సముదాయించే ప్రయత్నం చేసినా రైతులు వినిపించుకోలేదు. కొందరు రైతులు పురుగుల మందు తాగడానికి ప్రయత్నించగా తోటి రైతులు అడ్డుకున్నారు. అలాగే కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని సరంపల్లి వద్ద రైతులు రోడ్డెక్కారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులపై పట్టింపులేదని, ఒకరిపై ఒకరు నిందలు మోపుతూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో రైతులు అల్లాడిపోతుంటే ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒకరిపై ఒకరు నిందారోపణలు మానుకుని వెంటనే తడిసిన ధాన్యాన్ని మాయిశ్చర్ తో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News