అన్నదాత.. ‘వరి’గోస.!
దిశ, నిజామాబాద్ రూరల్ : వానాకాలం సీజన్ ముగుస్తోంది. ఓ వైపు దొడ్డురకం ధాన్యం దిగుబడులు వస్తున్నా ప్రభుత్వం నేటికీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీనికి తోడు ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దళారులను ఆశ్రయిస్తూ మోసపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించినా పట్టించుకోవడం లేదు. కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు.. పది,పదిహేను రోజుల క్రితమే దొడ్డు రకం సాగు చేసిన వరి కోతలు పూర్తయ్యాయి. దిగుబడులు వస్తున్నా […]
దిశ, నిజామాబాద్ రూరల్ : వానాకాలం సీజన్ ముగుస్తోంది. ఓ వైపు దొడ్డురకం ధాన్యం దిగుబడులు వస్తున్నా ప్రభుత్వం నేటికీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీనికి తోడు ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దళారులను ఆశ్రయిస్తూ మోసపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించినా పట్టించుకోవడం లేదు.
కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు..
పది,పదిహేను రోజుల క్రితమే దొడ్డు రకం సాగు చేసిన వరి కోతలు పూర్తయ్యాయి. దిగుబడులు వస్తున్నా సర్కారు నేటికీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని జక్రాన్‌పల్లి, డిచ్పల్లి, మోపా ల్, నిజామాబాద్ రూరల్, ఇందల్వాయి, దర్పల్లి, సిరికొండ మండలాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏడు మండలాల పరిధిలో 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలుండగా ఇప్పటి వరకు ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదని వారు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈ నెల 7న కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
వర్షాలతో ఆందోళన..
ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరి పంట నీటిపాలవుతోంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో కల్లాల్లోనే ధాన్యం తడుస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. సహకార సంఘాలు, ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ఎప్పుడు ప్రారంభిస్తారో అని ఎదురు చూస్తున్నారు. దీనిని అదునుగా తీసుకొని దళారులు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆశ చూపుతూ నట్టేట ముంచుతున్నారని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు గ్రామాల్లో పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలే..
ప్రభుత్వం ఏ గ్రేడ్ రకం ధాన్యానికి రూ. 1,888, బీ గ్రేడ్ కు రూ. 1868 మద్దతు ధర ప్రకటించినా నేటికీ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయా లని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అయితే ప్రభుత్వం నుంచి తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని సహకార సంఘాల చైర్మన్లు దాటవేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గన్నీ బ్యాగుల కొరత, రైస్‌మిల్లులకు తరలించే ధాన్యం అలాట్మెంట్ తదితర సమస్యలు ఉన్నాయని, నేటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం సరికాదని అధికార వర్గాలే పేర్కొంటుండడం గమనార్హం. ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ఇప్పటికే మక్కలు, సోయా దళారుల పాలైందని రైతులు చెబుతున్నారు. కాగా, ఇటీవల రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధ న్ ను హైదరాబాద్ లో సహకార సంఘాల చైర్మన్లు కలిసి సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేయాలని, మద్దతు ధరకు సన్న, దొడ్డు రకం ధాన్యాన్ని కొనాలని రైతులు వేడుకుంటున్నారు.