ఆర్గానిక్ సేద్యం.. లాభాలు తథ్యం
దిశ, స్టేషన్ ఘన్‌పూర్: కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చునేమో గానీ, ఎరువులు వేయకుండా పంటలు పండించడం మాత్రం అసాధ్యమనే చెప్పాలి. పూర్వం పశువులు, కోళ్ల నుంచి లభించిన ఎరువును వ్యవసాయ క్షేత్రాల్లో చల్లడం ద్వారా భూమికి జవసత్వాలను అందించేవారు. కాలక్రమేణా వెలుగుచూసిన నూతన సాగువిధానాలు పాత పద్ధతులన్నిటికీ మంగళం పాడగా.. ఈ క్రమంలోనే సహజసిద్ధమైన ఎరువుల స్థానాన్ని రసాయనిక ఎరువులు ఆక్రమించేశాయి. అయితే ఈ తరహా ఎరువులను పరిమితికి మించి వాడటం వల్ల పంట ఉత్పత్తులన్నీ విషతుల్యంగా […]
దిశ, స్టేషన్ ఘన్‌పూర్: కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చునేమో గానీ, ఎరువులు వేయకుండా పంటలు పండించడం మాత్రం అసాధ్యమనే చెప్పాలి. పూర్వం పశువులు, కోళ్ల నుంచి లభించిన ఎరువును వ్యవసాయ క్షేత్రాల్లో చల్లడం ద్వారా భూమికి జవసత్వాలను అందించేవారు. కాలక్రమేణా వెలుగుచూసిన నూతన సాగువిధానాలు పాత పద్ధతులన్నిటికీ మంగళం పాడగా.. ఈ క్రమంలోనే సహజసిద్ధమైన ఎరువుల స్థానాన్ని రసాయనిక ఎరువులు ఆక్రమించేశాయి. అయితే ఈ తరహా ఎరువులను పరిమితికి మించి వాడటం వల్ల పంట ఉత్పత్తులన్నీ విషతుల్యంగా మారడమే కాక, పెట్టుబడి వ్యయమూ పెరిగింది. ఈ నేపథ్యంలోనే సేంద్రియ విధానంలో ప్రకృతిసంబంధ ఎరువులను వాడుతూ మంచి దిగుబడులను సాధిస్తున్న పలువురు రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు. కాగా స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గంలోని వంగాలపల్లి రైతులు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తూ, తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
స్థానికంగా లభించే వనరులు, తక్కువ పెట్టుబడితో రసాయన ఎరువుల జోలికి పోకుండా సేంద్రియ విధానంలో వరి, టమాట, సోరకాయలతో పాటు ఆకుకూరలు సాగు చేస్తూ ఆర్థిక సమస్యలను అధిగమిస్తున్నారు. బాలవికాస మేలుకొలుపు, వ్యవసాయ శాఖ ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నారు.
బాలవికాసతో మేలుకొలుపు..
జనగామ జిల్లా, చిల్పూర్ మండలం, వంగాలపల్లి గ్రామ జనాభా దాదాపు 2500. వీరి ప్రధాన జీవనాధారం వ్యవసాయమే కాగా, ఇక్కడి రైతులు ప్రతియేటా పంటల సాగు కోసం అప్పులు చేస్తూ వాటిని తీర్చలేక సతమతమ్యేవారు. ఈ తరుణంలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ 2009లో ఆ గ్రామ రైతులను మేల్కొనేలా చేసింది. రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం కోల్పోయి పంటల దిగుబడి తగ్గుతుందని, సేంద్రియ సాగులో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించవచ్చని వివరించారు. అంతేకాదు ఈ విధానంలో పండించిన పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడాన్ని రైతులకు అర్థమయ్యేలా తెలిపారు. దీంతో గ్రామానికి చెందిన నూనె యాదగిరి, అంకేశ్వరపు వీరస్వామి ముందుకు వచ్చారు. ఆ తర్వాత మరికొంత మంది రైతులు వారినే ఫాలో అవుతుండటం విశేషం.
చేవెళ్ల పర్యటనతో చైతన్యం..
బాలవికాస ఆధ్వర్యంలో సేంద్రియ సాగుపై ఆసక్తి ఉన్న రైతులను ఎంపిక చేసి 2009లో వారిని చేవెళ్ల పర్యటనకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో అక్కడి రైతులు అవలంబిస్తున్న సాగు విధానాలను పరిశీలించిన వంగాలపల్లి రైతులు కొంతమేర అవగాహన పెంచుకున్నారు. ఆ పర్యటన ద్వారా చైతన్యం పొందిన పలువురు రైతులు గ్రామంలో వరి, కూరగాయల సాగును ప్రారంభించారు. మొదటి ఏడాది దిగుబడి తగ్గినా ఆ తదుపరి క్రమంగా పెరగడంతో మరికొంత మంది రైతులు కూడా ముందుకు వచ్చారు.
రైతు సంఘం ఏర్పాటు..
వంగాలపల్లిలో సేంద్రియ సాగు చేసే రైతులందరూ కలిసి ‘శ్రీ గణేష్ సేంద్రియ వ్యవసాయ రైతు సంఘం’ ఏర్పాటు చేశారు. ప్రతీ నెల రూ.100 చొప్పున పొదుపు చేస్తూ ఆ డబ్బును సంఘసభ్యుల అవసరాలకు అప్పుగా ఇస్తున్నారు. పంటల పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా సంఘంలోని డబ్బులను సేంద్రియ ఎరువుల తయారీకి, పంటల సాగుకు ఖర్చు చేస్తున్నారు. ప్రతీ నెల మొదటి వారంలో సమావేశమై సాగులో ఎదురవుతున్న సమస్యల్ని చర్చిస్తారు. రెండో వారంలో.. గ్రామానికి వచ్చే బాలవికాస ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సలహాలు సూచనలు తీసుకుంటారు.
ఆవు పేడతో సేంద్రియ ఎరువు.. అండగా వ్యవసాయ శాఖ
ఇంట్లో ఉండే ఆవుల పేడ, మూత్రంతో తయారుచేసే ఘన, ద్రవ జీవామృతమే సేంద్రియ ఎరువు. ప్రతిరోజు వ్యవసాయ బావుల వద్ద ఉన్న ఆవుల పేడ, మూత్రాన్ని సేకరించి వ్యవసాయ శాఖ అధికారుల సలహాల మేరకు సేంద్రియ ఎరువులను సొంతంగా తయారు చేసుకుంటున్నారు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న గ్రామ రైతులకు వ్యవసాయ శాఖ అండ దండిగా ఉంది. ‘పరం పరాగత్ కృషి వికాస్ యోజన’ పథకం ద్వారా సేంద్రియ ఎరువుల తయారీకి కావలసిన శిక్షణనిస్తూ తోడ్పాటునందిస్తోంది. ఈ క్రమంలోనే నూరు శాతం సబ్సిడీపై జీవ నియంత్రణ ఎరువులు, కీటకనాశినిలను సరఫరా చేయడం, రైతులను విద్యావిజ్ఞాన యాత్రలకు తీసుకెళ్తూ వారిని సాధ్యమైనంత మేర సేంద్రియ సాగు వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నారు.
పదేళ్లుగా సేంద్రియ సాగు..
గత పదేళ్లుగా సేంద్రియ సాగుతో కూరగాయలు పండిస్తున్నా. నాకున్న ఎకరంన్నర భూమిలో ఏ పంట వేసినా పెట్టుబడి కూడా వచ్చేది కాదు. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారి, కొన్నిరోజులు ఆటో నడిపాను. ఈ క్రమంలోనే సేంద్రియ సాగు గురించి తెలుసుకొని ఈ విధానంలో మిర్చి, టమాట, బీర, సొరకాయ, పుదీనా, కోతిమీర, ముల్లంగి, క్యారెట్, మెంతి తదితర పంటలను పండించి వివిధ మార్కెట్లకు తరలించి అమ్ముతున్నాను. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సేంద్రియ సాగుతోనే సాధ్యం.
– నూనె యాదగిరి, రైతు
హేళన చేశారు..
నేను రైల్వే ఉద్యోగిని. రిటైర్‌మెంట్ తర్వాత నాకున్న 3 ఎకరాల్లో వ్యవసాయం మొదలు పెట్టా. రసాయన ఎరువుల వాడకం వల్ల ఖర్చు పెరిగి, దిగుబడి తగ్గడంతో నష్టాలు మిగిలాయి. అప్పుడే గ్రామానికి వచ్చిన బాలవికాస ప్రతినిధుల సలహా మేరకు సేంద్రియ సాగుపై దృష్టిసారించాను. ఆ టైమ్‌లో అందరూ నన్ను అవహేళన చేశారు. అయినా రెండో ఏడాది సేంద్రియ పద్ధతిలోనే కూరగాయలు సాగు చేశా. పెట్టుబడి ఖర్చు వేలరూపాయల నుంచి వందల్లోకి వచ్చింది. గతంలో హేళన చేసిన వాళ్ళే ఇప్పుడు నన్ను అనసరిస్తుండటం గర్వంగా ఉంది.
– అంకేశ్వరపు వీరస్వామి