పొంగులేటి చూపు బీజేపీ వైపు!?

దిశ‌, ఖ‌మ్మం: ‘‘ఈ అవ‌మానాలు మ‌న‌కొద్దు..! పార్టీ మారుదాం. లేదంటే ప‌క్క‌కు పోదాం… మ‌నం ఎంత చేసినా చివ‌రికి వాళ్ల మాట‌ల‌నే అధిష్ఠానం న‌మ్ముతోంది. ఇంత జ‌రిగాక మ‌నం అణిగి మ‌ణిగి ఉండాల్సిన అవసరం లేదు. మ‌న బ‌లం, బ‌ల‌గం ఎంత‌మాత్రం త‌క్కువ‌లేదు. మీకు పార్టీతో సంబంధం లేకుండా ప్ర‌జాబ‌లం ఉంది. జ‌నంలో మీపై అభిమానమూ ఉంది. అది చాలు ఏ ఎన్నికలో అయినా మీరు నిలిచి గెల‌వ‌డానికి..’’ ఇదీ స్థూలంగా ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి […]

Update: 2020-03-14 03:40 GMT

దిశ‌, ఖ‌మ్మం:
‘‘ఈ అవ‌మానాలు మ‌న‌కొద్దు..! పార్టీ మారుదాం. లేదంటే ప‌క్క‌కు పోదాం… మ‌నం ఎంత చేసినా చివ‌రికి వాళ్ల మాట‌ల‌నే అధిష్ఠానం న‌మ్ముతోంది. ఇంత జ‌రిగాక మ‌నం అణిగి మ‌ణిగి ఉండాల్సిన అవసరం లేదు. మ‌న బ‌లం, బ‌ల‌గం ఎంత‌మాత్రం త‌క్కువ‌లేదు. మీకు పార్టీతో సంబంధం లేకుండా ప్ర‌జాబ‌లం ఉంది. జ‌నంలో మీపై అభిమానమూ ఉంది. అది చాలు ఏ ఎన్నికలో అయినా మీరు నిలిచి గెల‌వ‌డానికి..’’ ఇదీ స్థూలంగా ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఆయ‌న ముఖ్య అనుచ‌రులు చేస్తున్న విజ్ఞ‌ప్తి. పొంగులేటికి రాజ్య‌స‌భ సీటు ద‌క్క‌క‌పోవ‌డంతో ఆయ‌న అనుచ‌రుల్లో తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటిని కాద‌ని నామా నాగేశ్వర్ రావుకు పార్టీ టికెట్ కేటాయించింది. అయితే ఆ టైంలో పొంగులేటికి రాజ్య‌స‌భ సీటు ఇస్తామ‌ని సీఎం కేసీఆర్ స్వ‌యంగా మాటిచ్చారని స‌మాచారం. దీంతో పొంగులేటి కూడా అదే న‌మ్మ‌కంతో పార్టీకి విధేయుడిగా ప‌నిచేస్తూ వ‌స్తున్నారు. అయితే మూడు రోజుల క్రితం నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా మాజీ అసెంబ్లీ స్పీక‌ర్ సురేష్‌రెడ్డిని ఎంపిక చేయ‌డంతో పొంగులేటి అనుచ‌రులు ఎంత‌మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. త‌మ నాయ‌కుడికి అధిష్ఠానం తీవ్ర అన్యాయం చేసింద‌ని ఆవేద‌న చెందుతున్నారు. అనేక మంది సోష‌ల్ మీడియాలో పార్టీకి వ్య‌తిరేకంగా త‌మ గ‌ళాన్ని వినిపిస్తున్నారు.

అయితే పొంగులేటికి రాజ్య‌స‌భ అభ్య‌ర్థిత్వం ద‌క్క‌క‌పోవ‌డానికి అధిష్ఠానంపై జిల్లా ముఖ్య‌నేత‌లు ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావు, మంత్రి అజ‌య్‌కుమార్‌, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు పాత్ర కూడా ఉంద‌న్న క‌థ‌నాలు ప‌లు ప‌త్రిక‌ల్లో రావ‌డంతో పొంగులేటి అనుచ‌రుల్లో ఆగ్ర‌హ‌వేశాలు మ‌రింత పెరిగాయి. రెండుసార్లు హైకమాండ్ పెద్ద‌లు ఇచ్చిన మాట నిలుపుకోలేక పోయార‌ని కొంత‌మంది ముఖ్య నేత‌లు పొంగులేటి ఎదుట వాపోయార‌ట‌. ఇలా అయితే ప్ర‌జ‌ల్లో, పార్టీలో త‌మ ఉనికి ప్ర‌శ్నార్థ‌కం అవుతుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశార‌ని స‌మాచారం. జిల్లాలో రాజ‌కీయంగా నిల‌దొక్కుకోవాలంటే పార్టీ మార‌డం ఉత్త‌మమ‌న్న‌గ‌ట్టి వాద‌న‌ను కూడా వినిపించిన‌ట్లు తెలుస్తోంది.

అయితే పొంగులేటి మాత్రం అనుచ‌రుల‌ను ఆవేశ‌ప‌డొద్దు అంటూ స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. పార్టీకి సానుకూలంగా పొంగులేటి మాట్లాడ‌టం కూడా ఆయ‌న అనుచ‌రుల‌కు ప్రస్తుతం అంతు చిక్క‌డం లేదు. ఇంకా పార్టీలోనే కొన‌సాగాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకుంటే అది కేవ‌లం వ్యాపార వ్య‌వ‌హ‌రాల రీత్యే అయి ఉంటుంద‌ని ఖ‌మ్మం రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా పొంగులేటి రాజ‌కీయ నిర్ణ‌యం ఇటు ఆయ‌న అభిమానులు, జిల్లా ప్ర‌జ‌ల‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల రాష్ట్ర స్థాయి నేత‌లు నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. పొంగులేటిని పార్టీలోకి తీసుకు రావ‌డం వ‌ల్ల జిల్లాలో పార్టీకి గ‌ట్టి పునాదులు వేయ‌గులుతామ‌నే భావ‌న‌తో బీజేపీ ఉన్న‌ట్లు స‌మాచారం.

Tags: Khammam Ex MP Ponguleti, Nama Nageswara Rao, CM KCR, TRS, BJP, Congress

Tags:    

Similar News