రాజకీయాల్లో ఎదురులేని నేత ఈటల.. సాక్ష్యాలివే..!
దిశ ప్రతినిధి, వరంగల్: ఐదు నెలల ఉత్కంఠకు తెరపడింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ విజయం సాధించారు. కేసీఆర్ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు వ్యూహాత్మకంగా వేసిన అడుగులు ఫలించలేదు. పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల అభిమానాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నించినా జనం మాత్రం ఈటలకే ఓటేశారని స్పష్టమవుతోంది. టీఆర్ఎస్ పార్టీని ఎదురించి బయటకు వచ్చిన ఆయన చరిత్రాత్మక రాజకీయ విజయాన్ని నమోదు చేశారనే చెప్పాలి. టీఆర్‌ఎస్ పార్టీలో ఎదుగుతూనే.. ఆ పార్టీ ఎదుగుదలకు కృషి […]
దిశ ప్రతినిధి, వరంగల్: ఐదు నెలల ఉత్కంఠకు తెరపడింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ విజయం సాధించారు. కేసీఆర్ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు వ్యూహాత్మకంగా వేసిన అడుగులు ఫలించలేదు. పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల అభిమానాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నించినా జనం మాత్రం ఈటలకే ఓటేశారని స్పష్టమవుతోంది. టీఆర్ఎస్ పార్టీని ఎదురించి బయటకు వచ్చిన ఆయన చరిత్రాత్మక రాజకీయ విజయాన్ని నమోదు చేశారనే చెప్పాలి. టీఆర్‌ఎస్ పార్టీలో ఎదుగుతూనే.. ఆ పార్టీ ఎదుగుదలకు కృషి చేసిన ఈటల అనేక రాజకీయ పరిణామాల మధ్య కొద్ది నెలల క్రితం గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.
ఏడుసార్లు ఎమ్మెల్యేగా..
2002లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన రాజేందర్ ఆ పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు. తొలిసారిగా 2004లో ఎమ్మెల్యేగా కమలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2008లో ఉప ఎన్నికలో విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనం జరగడంతో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి 2009 సాధారణ ఎన్నిక, 2010లో ఉప ఎన్నిక, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 సాధారణ ఎన్నిక, 2018 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్-ఈటలకు మధ్య ఏర్పడిన రాజకీయ వైరుధ్యంతో అనుహ్య పరిణామాల నడుమ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు.
తాజాగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి 2021 ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మొత్తం ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మూడుసార్లు ఉప ఎన్నికను ఎదుర్కొవడం విశేషం. తెలంగాణ తొలి ఆర్థిక శాఖ మంత్రిగా, మలి దశలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా, పౌరసరఫరాలశాఖ మంత్రిగా పనిచేశారు. ఎన్నో సవాళ్లను అధిగమించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దారు. వైద్య శాఖ మంత్రిగా కరోనా కష్టకాలంలో ఆయన చేసిన పనితీరు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి ఫ్లోర్ లీడర్‌గా కూడా వ్యవహరించారు.
ఇదీ.. ఈటల నేపథ్యం
ఈటల రాజేందర్ మార్చి 20, 1964లో ప్రస్తుత హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు. చదువంతా కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. బీఎస్సీ డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే నాటి సామాజిక, రాజకీయ కారణాలతో విప్లవ భావాలకు ఆకర్షితులయ్యాడు. ప్రజల కోసం విప్లవబాట పట్టారు. కొద్ది కాలం తర్వాత బయటకు వచ్చారు. జమునారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. పౌల్ట్రీ వ్యాపారంలో అడుగు పెట్టి బాగా రాణించారు. 2002లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ కేసీఆర్‌కు తలలో నాలికలా మెదిలారు. పార్టీ కార్యాచరణలో కీలక భూమిక పోషించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే.