టీఆర్‌ఎస్‌పై బీజేపీ అదిరిపోయే వ్యూహం.. ఈటలకు కీలక బాధ్యతలు!

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ ఇకపై దూకుడు పెంచాలనుకుంటున్నది. ఇతర పార్టీల నేతలను ఇప్పటివరకు టీఆర్ఎస్ ఆకర్షించిన వ్యూహాన్నే ఇకపైన బీజేపీ అమలుచేయాలనుకుంటున్నది. ఇందుకోసం అధికార పార్టీనే టార్గెట్ చేయాలని భావిస్తున్నది. ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను గుర్తించి వారిని కమలం గూటికి తీసుకురావాలనుకుంటున్నది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే బీజేపీకి ఈ ఆలోచన ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒకింత సీరియస్ గా దృష్టి పెట్టనున్నది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ […]

Update: 2021-11-14 20:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ ఇకపై దూకుడు పెంచాలనుకుంటున్నది. ఇతర పార్టీల నేతలను ఇప్పటివరకు టీఆర్ఎస్ ఆకర్షించిన వ్యూహాన్నే ఇకపైన బీజేపీ అమలుచేయాలనుకుంటున్నది. ఇందుకోసం అధికార పార్టీనే టార్గెట్ చేయాలని భావిస్తున్నది. ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను గుర్తించి వారిని కమలం గూటికి తీసుకురావాలనుకుంటున్నది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే బీజేపీకి ఈ ఆలోచన ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒకింత సీరియస్ గా దృష్టి పెట్టనున్నది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే ఈ వ్యూహాన్ని మొదలుపెట్టి అసెంబ్లీ ఎన్నికల నాటికి కొలిక్కి తేవాలని టార్గెట్‌గా పెట్టుకున్నది. టీఆర్ఎస్‌ లో దీర్ఘకాలిక అనుభవం, ఆ పార్టీలోని నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఆ బాధ్యతను ఈటలకే అప్పజెప్పాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. పార్టీ వర్గాలు అధికారికంగా, బహిరంగంగా ఈ విషయాలను వెల్లడించకపోయినప్పటికీ ‘ఫామ్ హౌజ్’ మీటింగుల్లో దీనిపై లోతుగానే చర్చలు జరిగాయి. టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి, అసమ్మతి ఉన్న నేతలపై ఈటల రాజేందర్‌కే ఎక్కువ అవగాహన ఉన్నందున ఆయనకే ఈ బాధ్యతలు అప్పజెప్పాలని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తించిన జితేందర్‌రెడ్డిని సైతం ఈ వ్యూహంలో భాగం చేయాలనుకుంటున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

టీఆర్ఎస్‌ను డిఫెన్సులోకి నెట్టేసే వ్యూహం

అధికార పార్టీని ఇరుకున పెట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ధీటుగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ హుజూరాబాద్ గెలుపుతో స్పీడ్ పెంచనున్నది. నిత్యం టీఆర్ఎస్ ను ఏదో ఒక రూపంలో టెన్షన్‌కు గురిచేయాలని, బీజేపీ చుట్టే దాని దృష్టి ఉండేలా ఉక్కిరిబిక్కిరి చేయాలనేది ప్లాన్. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థుల్ని బరిలోకి దించాలనుకుంటున్నది. సంఖ్యాపరంగా పెద్దగా బలం లేకపోయినప్పటికీ అభ్యర్థుల్ని నిలబెట్టడం ద్వారా క్రాస్ ఓటింగ్ భయాన్ని అధికార పార్టీలో కలిగించాలని అనుకుంటున్నది. కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశాన్ని ఆశించి భంగపడినవారితో సంప్రదింపులు జరిపి కమలం గూటికి తీసుకొచ్చే పనితోనే ఈ వ్యూహాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నది. ఉద్యమకారులకు పార్టీలో స్థానం లేదనే అసంతృప్తిని ఎలా వాడుకోవాలన్నదానిపై బీజేపీకి స్పష్టత ఉన్నది. అధికార పార్టీ గతంలో హామీలను ఇచ్చి అమలు చేయకుండా ఉన్న అంశాలు, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వడ్ల కొనుగోలు, నిరుద్యోగం, దళితబంధు.. ఇలా అన్నింటితో ప్రజల మధ్యకు వెళ్ళి వారితో ఆందోళనలు చేపట్టాలనుకుంటున్నది.

బండి సంజయ్‌ కి పూర్తి స్వేచ్ఛ

రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం తెలంగాణలో బలపడాలని కేంద్ర అధిష్టానం రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. అధికార పార్టీ వైఫల్యాలను హైలైట్ చేస్తూ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి భాగస్వామ్యంతో ఆందోళనలకు శ్రీకారం చుట్టడం ద్వారా గ్రామ స్థాయిలోనూ పార్టీని బలోపేతం చేసుకోవాలంటూ ఢిల్లీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని పార్టీ రాష్ట్ర నేతలు పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీ నాయకత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా కేంద్ర ప్రభుత్వం తరపున మంత్రులు కూడా సహకారం అందించనున్నారు. నిర్దిష్టంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా వివరాలను ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్లు పార్టీ నేతలు నర్మగర్భంగా చెప్తున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా మొదలుపెట్టే వ్యూహం, ఎత్తుగడలు, ఆందోళనలు, నిరసనలు రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకూ కొనసాగించాలని, ఆ పార్టీని నైతికంగా నిరుత్సాహానికి గురిచేసేలా సమిష్టి కృషితో కార్యాచరణను రూపొందించుకోవాలని కేంద్ర నాయకత్వం సూచించినట్లు పేర్కొన్నాయి. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడున్నట్లుగానే మూడో ప్లేస్‌కు పరిమితం చేసి టీఆర్ఎస్ పార్టీకి బలమైన ప్రత్యర్థి బీజేపీ మాత్రమే అనే ముద్ర సామాన్య జనంలో వచ్చేలా చూసుకోవాలని కేంద్ర నాయకత్వం సూచించింది.

టీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ.. క్షణ క్షణం… టెన్షన్ టెన్షన్..

Tags:    

Similar News