ఎన్నికలే లక్ష్యం.. కేటాయింపులే సాక్ష్యం
దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నగరాభివృద్ధికి రూ.10వేల కోట్లను రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించారు. ఏడాదిలో జరగనున్న బల్దియా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం ఈ కేటాయింపులు చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇన్ని రోజులు నగరంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలను ఆకర్షించేందుకే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నట్టు కనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రచారాస్త్రాంగా కేటాయింపులు! మినీభారత్‌గా మారిన హైదరాబాద్ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు కేటాయించింది. నిజానికి గ్రేటర్ అభివృద్ధికి రూ.50 వేల […]
దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నగరాభివృద్ధికి రూ.10వేల కోట్లను రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించారు. ఏడాదిలో జరగనున్న బల్దియా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం ఈ కేటాయింపులు చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇన్ని రోజులు నగరంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలను ఆకర్షించేందుకే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నట్టు కనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రచారాస్త్రాంగా కేటాయింపులు!
మినీభారత్‌గా మారిన హైదరాబాద్ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు కేటాయించింది. నిజానికి గ్రేటర్ అభివృద్ధికి రూ.50 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసినట్టు, అందులో భాగంగా ఈ ఏడాది కేటాయింపులు జరిగాయని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెబుతున్నారు. రాష్ట్ర ఆదాయంలో మెజారిటీ వాటా గ్రేటర్ నుంచే లభిస్తుంది. అయితే, ఈ సారి బడ్జెట్‌లోని కేటాయింపులే రేపటి బల్దియా ఎన్నికల్లో అస్త్రంగా అధికార పార్టీ ఉపయోగించుకోనున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌కు వరుసగా వరాలు ప్రకటించడంతో పాటు నగరంలో పలు అభివృద్ధి పనులను కొనసాగిస్తోంది. రోడ్లను ప్రైవేటుకు అప్పగించి ఎన్నికల నాటికి అందమైన రోడ్లను మోడల్‌గా చూపాలని సంబంధిత మంత్రిత్వశాఖ భావించి ఇప్పటికే రోడ్ల అప్పగింత కార్యక్రమాన్ని పూర్తి చేసింది. నగరంలో రోడ్ల సుందరీకరణతో పాటు వారసత్వ కట్టడాల పునరుద్ధరణ వంటి పనులు చేపడుతోంది. మెట్రో రెండోదశ విస్తరణ పనులను చేపట్టడంతో పాటు మిగిలి ఉన్న పాతబస్తీ మెట్రో రూట్ పనులను కూడా పూర్తి చేస్తామని ఆర్థికమంత్రి హరీశ్‌రావు అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. ఈ పనులు పూర్తయితే నగరంలోని శివారు ప్రాంతాలను మెట్రోకు అనుసంధానం పూర్తిచేసినట్టవుతుంది. మరోవైపు నగరంలో ప్రస్తుతమున్న 118 బస్తీ దవాఖానాలను 350కి పెంచాలని నిర్ణయించారు. గ్రేటర్‌లో ప్రభుత్వ ప్రధాన హామీగా ఉన్న మూసీ ప్రక్షాళన, తాగు నీటి సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నారు. అన్ని రకాలుగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్రజల ముందు నిరూపించుకునేందుకు ప్రభుత్వం కష్టపడుతోంది. తమ పార్టీ గ్రేటర్ అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పడం ద్వారా ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ భావిస్తోంది.
Tags: Hyderabad, Trs, GHMC, elections, budget