గన్నవరంలో దారుణం... వల్లభనేని వంశీ అనుచరుల అరెస్ట్
టీడీపీ నాయకుడిపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు..
దిశ, వెబ్ డెస్క్: గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former MLA Vallabhaneni Vamsi) అనుచరులు రెచ్చిపోయారు. గత ప్రభుత్వం హయాంలో టీడీపీ నాయకుడు రంగబాబు(TDP leader Rangababu)పై దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గన్నవరం పార్క్ ఎలైట్ హోటల్(Gannavaram Park Elite Hotel) వద్ద వెయిట్ చేస్తున్న రంగబాబుని ఒక్కసారిగా చుట్టుముట్టి చితకబాదారు. అయితే అప్పట్లో కేసు నమోదు చేసినా విచారణ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ తీసుకున్నారు. పార్క్ ఎలైట్ హోటల్ వద్ద నమోదైన సీసీ ఫుటేజులు పరిశీలించారు. రంగబాబుపై దాడి చేసిన సూత్రధారులు వైసీపీ నాయకులేనని గుర్తించారు. ఈ మేరకు ఉదయం నుంచి అరెస్ట్‌లు చేస్తున్నారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పలువురిలో వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు ఉన్నారు. మరికొంతమంది కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ‘‘రంగబాబుపై ఎందుకు దాడి చేశారు. ఎంత మంది ఉన్నారు. దాడి వెనుక ఎవరున్నారు. రాజకీయ ప్రేరిపితం ఉందా..? . అసలు కారణాలేంటి..?. ’’ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.