హుజురాబాద్ ఎన్నికలపై ఉత్కంఠ.. ఆగస్టు 15 తర్వాత షెడ్యూల్.!
దిశ, తెలంగాణ బ్యూరో : ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక, ’దళితబంధు’ చర్చలే ఆసక్తికరంగా మారాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందో పార్టీలకు కూడా క్లారిటీ లేదు. ఎప్పుడైనా షెడ్యూలు విడుదల కావచ్చనే ఉత్కంఠ నెలకొన్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు, అధికారులు శుక్రవారం సమావేశమయ్యారు. దేశం మొత్తం మీద ఎన్ని ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్నదో, వాటి డెడ్‌లైన్ ఎప్పటివరకు ఉన్నదో పరిశీలన జరిగింది. పంద్రాగస్టు తర్వాత షెడ్యూలు […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక, ’దళితబంధు’ చర్చలే ఆసక్తికరంగా మారాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందో పార్టీలకు కూడా క్లారిటీ లేదు. ఎప్పుడైనా షెడ్యూలు విడుదల కావచ్చనే ఉత్కంఠ నెలకొన్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు, అధికారులు శుక్రవారం సమావేశమయ్యారు. దేశం మొత్తం మీద ఎన్ని ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్నదో, వాటి డెడ్‌లైన్ ఎప్పటివరకు ఉన్నదో పరిశీలన జరిగింది. పంద్రాగస్టు తర్వాత షెడ్యూలు విడుదల చేయడంపై చర్చలు జరిగాయి. సెప్టెంబరు ద్వితీయార్ధంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా ప్రాథమికంగా నిర్ణయం జరిగినట్లు తెలిసింది.
దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాల్లో 110 స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నది. ఇందులో సెప్టెంబరు చివరి వరకు కొన్నింటికి నిర్వహించడం అనివార్యం కాగా మరికొన్నింటికి అక్టోబరు-డిసెంబరు మధ్యకాలంలో జరపాల్సి ఉన్నది. అయితే అన్నింటికీ కలిపి ఒకేసారి నిర్వహించడంపై చర్చలు జరిగాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులతో ఇప్పటికే చర్చలు జరిపిన సీఈసీ ఇప్పుడు ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన రాష్ట్రాల్లోని తాజాగా కరోనా పరిస్థితుల గురించి కూడా వివరాలను సేకరించింది. వాటికి అనుగుణంగానే షెడ్యూలు జారీ చేయడంపై సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహించడానికి డిసెంబరు వరకూ గడువు ఉంది. అయినప్పటికీ మిగిలిన ఉప ఎన్నికలతో పాటే ఇక్కడ కూడా నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం ప్రొఫైల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తెప్పించుకున్నది. ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సమస్యాత్మకమైన కేంద్రాల అంచనా, పోలీసు బలగాల మోహరింపు, ఈవీఎంల లభ్యత, వీవీప్యాట్‌ల పస్ట్ లెవల్ చెకింగ్, పోలింగ్ సిబ్బంది అవసరం.. ఇలా అనేక వివరాలను సేకరించింది.
దళితబంధుపై సీఈసీ ఆరా..
’దళితబంధు’పై వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. కరీంనగర్ జిల్లా కలెక్టరు నుంచి వాస్తవిక వివరాలను సేకరించి ఐదవ తేదీ సాయంత్రానికి పంపించాలంటూ డెడ్‌లైన్ విధించింది. కానీ ఆ గడువు ముగిసినా రాష్ట్రం నుంచి నివేదిక వెళ్ళలేదు. దీనిపైన కూడా సీఈసీ కమిషనర్లు, అధికారులు శుక్రవారం జరిగిన సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.
ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటీవల లేఖ రాసి హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసేంత వరకు దళితబంధు పథకం అమలుకాకుండా చూడాలని కోరింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకపోయినప్పటికీ ‘హుజూరాబాద్ ఎన్నికల కోసమే ఈ పథకం‘ అంటూ కేసీఆర్ బహిరంగంగానే చేసిన వ్యాఖ్యలను కూడా ఆ లేఖలో ఫోరమ్ ప్రధాన కార్యదర్శి పద్మనాభరెడ్డి ఉటంకించారు.
ఈ లేఖను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసి ఐదవ తేదీ లోగా నివేదిక పంపాల్సిందిగా కోరారు. ఆ ప్రకారం రాష్ట్ర సీఈఓ కూడా కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసి క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను వివరించాల్సిందిగా స్పష్టం చేశారు. ఆ సమాచారానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం ఇచ్చి నివేదిక పంపడంపై వివరించారు. కానీ తొందరేముందిలే అనే తీరులో సచివాలయం నుంచి సమాధానం రావడంతో సీఈసీ విధించిన గడువు ప్రకారం ఐదవ తేదీ నాటికి ఎలాంటి నివేదిక రాష్ట్రం నుంచి వెళ్లలేదు.
వాసాలమర్రికి షిప్ట్ అయింది అందుకోసమేనా!
కేంద్ర ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర సీఈఓ నుంచి వివరాలు కోరిన సంగతి తెలుసుకున్న ప్రభుత్వం హఠాత్తుగా వాసాలమర్రి కార్యక్రమాన్ని ఫిక్స్ చేసి పది రోజుల ముందుగానే దళిత బంధును లాంఛ్ చేసింది. ఆ గ్రామంలోని 76 దళిత కుటుంబాలకూ రూ. 7.60 కోట్లు మంజూరయ్యాయి. హుజూరాబాద్‌లో ఈ నెల 16వ తేదీన లాంఛనంగా ‘దళితబంధు‘ పథకాన్ని ప్రారంభించేలా షెడ్యూలు ఖరారైనప్పటికీ ఐదవ తేదీకే వాసాలమర్రిలో అమల్లోకి వచ్చింది. కేవలం కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవడంతోనే ఈ పథకానికి బ్రేకులు పడడానికి ముందే అమల్లోకి తెచ్చిందన్న చర్చ సచివాలయ అధికార వర్గాల్లో మొదలైంది.