పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి : మంత్రి జగదీశ్ రెడ్డి

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారంతో పాటు, అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతుల సమస్యలపై శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆదివారం సాయంత్రం కలెక్టర్ పీజే పాటిల్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. నల్లగొండ జిల్లాలో17 లక్షల 59 […]

Update: 2021-11-07 10:03 GMT

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారంతో పాటు, అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతుల సమస్యలపై శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆదివారం సాయంత్రం కలెక్టర్ పీజే పాటిల్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

నల్లగొండ జిల్లాలో17 లక్షల 59 వేల 885 ఎకరాల జియోగ్రఫీ ప్రాంతం ఉండగా, లక్ష 56 వేల 164 ఎకరాలలో అటవీ ప్రాంతం విస్తరించి ఉందన్నారు. జిల్లాలోని 13 మండలాల్లో 63 గ్రామాల్లో 164 హ్యాబిటేషన్లలో 13,771 వేల ఎకరాల అటవీ భూమి ఆక్రమణలో ఉందని చెప్పారు. పోడు వ్యవసాయదారులకు న్యాయం చేసేందుకు అడవులను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, తాను కూడా సబ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నానని వెల్లడించారు. అటవీ హక్కుల చట్టం- 2005 పరిధికి లోబడి పోడు వ్యవసాయ దారులకు న్యాయం చేకూర్చేందుకు అఖిలపక్ష సభ్యుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని అన్నారు.

రాష్ట్రంలో దాదాపు 8 లక్షల ఎకరాల పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులకు అటవీ హక్కు లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అటవీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంతో పారదర్శకంగా తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు.

నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా, పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని అన్నారు. నిరు పేదలైన వారికి న్యాయం జరగడంతో పాటు అటవీ సంరక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు.

నేటి నుంచి క్లయింమ్స్ సేకరణ: కలెక్టర్

పోడు వ్యవసాయదారులకు అటవీ హక్కుల కల్పనకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లాలో పోడు సాగు చెడుకుంటున్న వ్యవసాయ దారుల నుంచి నవంబర్ 8 నుంచి క్లయిమ్స్ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్​ పీజే పాటిల్​చెప్పారు. జిల్లాలోని అడవి దేవులపల్లి, చందంపేట, చింతపల్లి, దామరచర్ల, దేవరకొండ, గుండ్లపల్లి, మిర్యాలగూడ, నేరేడుగొమ్ము, నిడమనూర్, పీఏపల్లి, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, త్రిపురారం, మండలాల్లో పోడు సమస్య ఉందని చెప్పారు. సంబంధిత ఫారెస్ట్ రైట్ కమిటీలు, సబ్ డివిజన్ కమిటీ, జిల్లా స్థాయి కమిటీల ద్వారా పోడు సమస్యకు ప్రభుత్వ ఆదేశాలు, ఆర్ఓఎఫ్ఆర్ చట్టం అనుసరించి పరిష్కార చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిల్లా అటవీ సంరక్షణ కమిటీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, క్షీణించిన అడవులను పునరుద్ధరించి అభివృద్ధి పరచేందుకు తీర్మానించినట్లు చెప్పారు.

అంతకుముందు అఖిలపక్ష సమావేశానికి హాజరైన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సలహాలు, సూచనలను అందజేశారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, రవీంద్ర కుమార్, భాస్కర్ రావు, గాదరి కిశోర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రాం చంద్ర నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్, సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి, టీడీపీ నల్గొండ పార్లమెంట్ నియోజక వర్గ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి బక్క పిచ్చయ్య, సీపీఐ పట్టణ కార్యదర్శి గాదె పాక రమేష్, ఎంఐఎం నుంచి ఖాజా గౌస్ మహియుద్దీన్ హషం, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కొర్ర శంకర్ నాయక్, తెలంగాణ రైతు సంఘం నుంచి నాగిరెడ్డి, పోడు సమస్య ఉన్న13 మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, గిరిజన సంఘాల నాయకులు అఖిల పక్ష సమావేశంలో పాల్గొని తమ సలహాలు, సూచనలు అందచేశారు.

ప్రభుత్వం పోడు సమస్య పరిష్కారానికి చేస్తున్న కృషికి అన్ని పార్టీల నాయకులు స్వాగతిస్తూ ఏకగ్రీవంగా మద్దతు పలికారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్, జిల్లా అటవీ శాఖ అధికారి రాంబాబు, జిల్లా పంచాయతీ అధికారి విష్ణు వర్ధన్, మిర్యాలగూడ, దేవరకొండ ఆర్డీవోలు రోహిత్ సింగ్, గోపిరాం, పోలీస్ అటవీ శాఖ జిల్లా అధికారులు, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్ రావు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News