‘ఉపాధి’ పనుల్లో విద్యావంతులు
ఉన్నత చదువులు చదివిన యువకులకు ఉద్యోగాలు దొరకలేదు. కానీ వారు ఏమాత్రం నిరాశ చెందలేదు. కొంత మంది పట్టనానికి వెళ్లి చిన్నా చితక ఉద్యోగాలు చేసుకునే వారు. కానీ, లాక్‌డౌన్ పుణ్యమా అని వారి ఉద్యోగాలు పోయాయి. అయినా వారు వెనకడుగు వేయలేదు. సొంతూళ్లకు వచ్చి ఉపాధి హామీ పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దిశ, వరంగల్: ఉన్నత చదువులు చదివి కొందరు పట్నంకు పోయి ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటే, మరి కొందరు అవకాశాల కోసం […]
ఉన్నత చదువులు చదివిన యువకులకు ఉద్యోగాలు దొరకలేదు. కానీ వారు ఏమాత్రం నిరాశ చెందలేదు. కొంత మంది పట్టనానికి వెళ్లి చిన్నా చితక ఉద్యోగాలు చేసుకునే వారు. కానీ, లాక్‌డౌన్ పుణ్యమా అని వారి ఉద్యోగాలు పోయాయి. అయినా వారు వెనకడుగు వేయలేదు. సొంతూళ్లకు వచ్చి ఉపాధి హామీ పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
దిశ, వరంగల్: ఉన్నత చదువులు చదివి కొందరు పట్నంకు పోయి ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటే, మరి కొందరు అవకాశాల కోసం ఎదురు చూడకుండా ఏదో ఒక పని చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో కంపెనీల్లో చిన్నాచితకా ఉద్యోగుల ఉద్యోగాలు పోయాయి. పట్నంలో ఇబ్బందులు పడుతూ బతకడం కంటే పల్లెలకు పోవటం మేలని భావించిన వారు సొంతూళ్లకు వచ్చారు. కుటుంబాలను పోషించుకోవడం కోసం ఉపాధి హమీ పనులకు వెళ్తున్నారు. గడ్డపార పట్టి తవ్వుతూ, తట్టలో మట్టి తీసే వారిలో ఎంబీఏ, ఎంటెక్, బీటెక్, డిగ్రీ, పీజీ, ఎంఈడీలు, బీఈడీలు చేసిన ప్రైవేటు ఉపాధ్యాయులు సైతం ఉన్నారు. అందరూ కలిసి ఉత్సాహంగా పనులు చేస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1613 గ్రామ పంచాయతీలున్నాయి. వరంగల్ అర్భన్ జిల్లాలో 130, వరంగల్ రూరల్ జిల్లాలో 401, మహబూబాబాద్ జిల్లాలో 461, జనగామ జిల్లాలో 206, భూపాలపల్లి, ములుగు జిల్లాలో 415 గ్రామ పంచాయతీల్లో మొత్తం 7,12,282 జాబ్ కార్డులున్నాయి. 16,67,339 మంది కూలీలు ఉపాధి హామీ పనులు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా కూలీలే కాకుండా కులవృత్తుల వారితో పాటుగా నగరంలోని అడ్డాకూలీలు, బీడీ కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులు సైతం చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టేందుకు వస్తున్నారు. ఖాళీగా ఉండటం కంటే పనులు చేయటం వల్ల ఊరికి మంచి జరగడమే కాకుండా ఉపాధి దొరుకుతోందని వారు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెన్నారావుపేట మండలం ఝల్లి గ్రామంలోని ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు 24 మంది ఉపాధి హమీ పనులకు వెళ్లుతున్నారు. ఇలా జిల్లాలో సుమారు 10 వేల మంది వరకు ఉన్నత చదువులు చదివిన వారితో పాటు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉపాధి హమీ పనులు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
ముందుకు రావడం అభినందనీయం: స్వరూప, డివిజనల్ పంచాయతీ అధికారి, వరంగల్
చెరువులో నీటి నిల్వలు పెంచేందుకు మట్టి తవ్వకాలు జరుపుతున్నాం. ఈ పనులకు డిగ్రీ, బీటెక్ చేసిన వారే కాదూ లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారు సైతం వస్తున్నారు. వారి కుటుంబాలకు బాసటగా నిలవడమే కాదు చెరువుల పూడిక తీత, సేద్యపు గుంటలు, ఫీడర్ ఛానెల్ పనులు, ఫిష్ పాండ్స్ పనుల్లో సైతం విద్యావంతులు పాల్గొనడం అభినందనీయం.