యువగళం.. జనగళం.. విజయగళం

Yuvagalam.. Janagalam.. Vijayagalam

Update: 2023-12-20 01:15 GMT

క‌లిమి లేకున్నా బలం ఉండాల‌నేది సామెత‌. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విష‌యంలో ఇది స్ప‌ష్టంగా రుజువైంది. పార్టీకి అధికారం లేద‌న్న చింత త‌ప్ప‌ నిజానికి టీడీపీ పార్టీకి బ‌లం. బ‌లగం.. ఎంత ఉందో పార్టీ యువ నాయ‌కుడు, నారా లోకేశ్ చేసి ముగించిన యువ‌గ‌ళం పాద‌యాత్ర నిరూపించింది. ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా పూర్తయింది.

ఈ ఏడాది జనవరి 27న కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాలచెంత నుంచి టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. విశాఖ జిల్లా అగనంపూడి దగ్గర పూర్తి చేశారు. మొత్తం 226 రోజులపాటు 3 వేల 132 కిలోమీటర్లు లోకేశ్ పాదయాత్ర చేశారు. 97 నియోజకవర్గాల్లో, 232 మండలాలు, 2 వేల 28 గ్రామాల మీదుగా టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సాగింది. మొత్తం 226 రోజులపాటు 3 వేల 132 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో టీడీపీ శ్రేణులు లోకేష్ వెంట పాల్గొన్నాయి.

కోటి ఆశ‌లు ప్రేరేపిస్తూ...

పాద‌యాత్ర‌ అగనంపూడి చేరుకునే స‌రికి.. ఇంతింతై.. అన్న‌ట్టుగా పుంజుకుంది. ఇసుక వేస్తే.. రాల‌నంత‌గా జ‌నాలు కిక్కిరిసిపోయారు. అడుగుతీసి అడుగు వేసేందుకు చోటు లేనంత‌గా అనంత ప్ర‌జ‌లు హార‌తులు ప‌ట్టారు. ఇదేమీ.. అవాస్త‌వ‌మ‌ని కొట్టి పారేసేందుకు లేదు. భారీ ఎత్తున పుంజుకుంది. కేవ‌లం నారా లోకేశ్‌ను చూసేందుకు మాత్ర‌మే కాదు.. పాద‌యాత్ర‌లో పాదం క‌లిపేందుకు తండోపతండాలుగా ప్ర‌జ‌లు తర‌లి వ‌చ్చారు. ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఏదో ఉద్వేగం.. ప్ర‌తి అడుగులోనూ.. అనంత కోటి ఆశ‌లు.. ప్ర‌జ్వ‌రిల్లాయి. నారా లోకేష్ చేస్తున్న పాద‌యాత్ర‌కు అనూహ్య స్పంద‌న ల‌భించింది. యువగళం ప్రజాగళమైంది. ఈ విస్తృత పాదయాత్రలో నారా లోకేష్ 70 బహిరంగ సభలు, 145 ముఖాముఖి, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నారు. మొత్తంమీద 1063 రాతపూర్వక పిటిషన్లను స్వీకరించారు. తన సమస్యలను పంచుకున్న లక్షలాది మంది వ్యక్తులతో నేరుగా సంభాషించారు. ప్రజా నాయకుడిగా తనని తాను మలుచుకున్నాడు. పదునైన వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అధికార పక్షాన్ని ఇరుకున పెట్టిన సందర్భాలు కోకొల్లలు.

జనసంద్రం కానున్న పోలిపల్లి

చంద్రబాబు అరెస్ట్‌తో యువగళం యాత్రకు బ్రేక్ పడింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన కొన్నాళ్లు పార్టీ వ్యవహారాలు చూసుకున్నారు, ఢిల్లీలో ఉన్నారు. చంద్రబాబు బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత లోకేష్ తన యాత్రను తిరిగి మొదలు పెట్టారు. చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలను ఇబ్బందులను అధిగమించి పాదయాత్రను పూర్తి చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఏ విధమైన కార్యాచరణ చేపట్టబోతున్నాడో తెలియజేయడం బట్టి చూస్తే రాజకీయ పరిణితి సాధించాడనే చెప్పాలి. చంద్రబాబు గతంలో చేపట్టిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్రను కూడా అగనంపూడి వద్దే ముగించారు. ఆ సెంటిమెంటుతో ఇప్పుడు లోకేష్ కూడా తన పాదయాత్రను అక్కడే ముగిస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద నిర్వహించనున్న విజయోత్సవ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బాలకృష్ణ, టీడీపీ ఇతర ముఖ్య నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొనబోతున్నారు. విజయోత్సవ సభలో తెలుగుదేశం, జనసేన కూటమి ఏ విధంగా ఎన్నికల్లో ముందుకు వెళతారో వారి విధానాలు కార్యాచరణ, అభ్యర్థుల ఎంపికపై ఓ స్పష్టత వచ్చే అవకాశం వుంది. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇప్పటికే చంద్రబాబు కొన్ని విధానాలను ప్రకటించిన సంగతి విదితమే. అవి కాకుండా ఇంకా ఏమైనా కొత్తవి ప్రకటిస్తారా లేదా అన్నది ఆసక్తి రేపుతోన్న ఆంశం.

విజయోత్సవ సభ

విజయోత్సవ సభకు విశాఖ పట్టణ శివారు ప్రాంతాన్ని ఎంచుకోవడం ఓ ఎత్తుగడ. ఉత్తరాంధ్ర అభివృద్దికి తాము కట్టుబడి వున్నామని సంకేతమివ్వడంతో పాటు మొదటినుంచి తెలుగు దేశానికి కంచుకోటగా వున్న ప్రాంతం కాబట్టి పార్టీ శ్రేణులను నాయకులను సమన్యయ పరుస్తూ వారిలో నూతన ఉత్సాహాన్ని నింపి ఎన్నికలకు సన్నద్ధం చేయడం వెనుక రాజకీయ వ్యూహం దాగి వుంది. విశాఖ ఉక్కు కర్మాగారంపై వారి వైఖరిని ప్రకటించవచ్చు. అలాగే అ ప్రాంత మత్స్యకారుల కోసం ఫిషింగ్ యార్డు ఏర్పాటుపై ప్రకటన చేయవచ్చు. ఆ ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులపై వారి వైఖరిని తెలియజేయవచ్చు. జనసేన, తెలుగుదేశం కార్యకర్తల మధ్య స్నేహభావం పెంపొందించటానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ వేదికను అవకాశంగా మలుచుకోవచ్చు.

ప్రత్యర్థుల గళంలో గరళం

యువగళం ప్రభావం ఇప్పటికే ప్రత్యర్థుల గళంలో గరళమైంది. నారా లోకేష్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొని వున్న నేపథ్యంలో యువగళం యాత్ర అనుభవాలను, ప్రజల సమస్యలను తెలియజేస్తూ సకారాత్మక విమర్శలు చేయాలి. పాత మూసలో కాకుండా అధికార పక్షాన్ని విమర్శించాలి. వ్యక్తిగత దూషణలకు దూరంగా వుంటూ హుందాగా మాట్లాడాలి. నాయకుడిగా తనని తాను నిరూపించుకున్న లోకేష్ ఇప్పుడు ప్రజానాయకుడిగా ప్రవర్తించాలి. రానున్న రోజుల్లో తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించే వైపుగా ఏ విధమైన కార్యాచరణ చేపట్టబోతున్నాడో ప్రజలకు తెలియజేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే యువగళం జనగళమై, నవశకానికి మేలుకొలిపే విజయగళం కావాలి. నేడు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద నిర్వహించనున్న విజయోత్సవ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బాలకృష్ణ, టీడీపీ ఇతర ముఖ్యనేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొనబోతున్నారు. జనసేన, తెలుగుదేశం కార్యకర్తల మధ్య స్నేహభావం పెంపొందించటానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ వేదికను అవకాశంగా మలుచుకోవచ్చు.

- వాడవల్లి శ్రీధర్

99898 55445


Similar News