గ్రామీణ విద్యా వ్యవస్థను.. గాడిన పెట్టేదెలా?
తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టింది. ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అదే ఒరవడి కొనసాగింది.
తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టింది. ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అదే ఒరవడి కొనసాగింది. గ్రామీణ ఉపాధ్యాయుల ఎంపిక నుంచి యూనివర్సిటీ వైస్ చాన్సలర్ వరకు ఇన్చార్జిగా పాలనలతోనే మమ అనిపించారే తప్ప ఏనాడూ విద్య అభివృద్ధిపై పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ప్రైవేటు యూనివర్సిటీలపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ గ్రామీణ విద్యా వ్యవస్థపై లేకపోవడమే నేటి దుస్థితికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో గత పాలకపక్షాలు విపరీత నిర్లక్ష్యం చేశాయి. ఫలితంగా గ్రామీణ నిరుపేద విద్యార్థి సామర్థ్యానికి, వ్యక్తిగత ఎదుగుదల, సామాజిక అభివృద్ధి అవకాశాలలో ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులతో పోల్చినప్పుడు అందనంత దూరంలో వెనుకబడి పోతున్నాడు. పాఠశాల మౌలిక వసతులు, ఉపాధ్యాయుల లభ్యత, విద్యా నాణ్యతలో ఉన్న లోపాలను పరిష్కరించడం ద్వారా సమాజంలోని అన్నివర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిం చడం అందరికీ సమానమైన విద్యా అవకాశాలను కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి.
మౌలిక వసతులు, వనరుల లేమి..
తెలంగాణ, భాషా పరంగా విభిన్నత కలిగిన రాష్ట్రం. గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు, ఉర్దూ లేదా ఇంగ్లిష్ భాషలో బోధన సమస్యగా మారుతోంది. గ్రామీణ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, బోధనా పరికరాలు, సాంకేతికత వంటి అవసరమైన వనరులు తరచుగా లేవు. అలాగే, అనేక గ్రామీణ పాఠశాలల్లో విద్యుచ్ఛక్తి, నీటి సరఫరా, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేవు. ఈ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లోని విద్యా వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో పెట్టుబడి పెంచుతోంది కానీ, ఆర్థిక పరిమితులు అడ్డంకిగా మారుతున్నాయి.
క్వాలిఫైడ్ టీచర్ల కొరత
గ్రామీణ ప్రాంతాలు తరచుగా అర్హత కలిగిన, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా గణితం, సైన్స్, ఆంగ్లంలో బోధనా నైపుణ్యంలో ఈ అంతరం విద్యార్థులకు అందించే విద్య నాణ్యతను నేరుగా ప్రభావితం చేస్తుంది. చివరికి వారి భవిష్యత్ ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపుతుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల మధ్య విద్యా నాణ్యతలో అసమానతలు పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యావ్యవస్థ లోతుగా పాతుకుపోయిన లింగ అసమానతలతో పోరాడుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో, బాలికలు పాఠశాలకు వెళ్లడం లేదా ఉన్నత విద్యను అభ్యసించడంపై పరిమితులను ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగత వృద్ధి, సాధికారత కోసం వారి అవకాశాలను పరిమితం చేస్తారు. అమ్మాయిల విద్యను ప్రోత్సహించే ప్రోగ్రాములు, రుతుక్రమ హైజీన్ నిర్వహణ కోసం సహాయపడే విధానాలు, భద్రమైన పాఠశాల వాతావరణం ఏర్పాట్లు చేయడం. ఆంగన్‌వాడీల వంటి ప్రారంభ బాల్య సంరక్షణ, విద్యా (ECCE) కేంద్రాలను బలోపేతం చేస్తుంది.
చదవడం కూడా రావడం లేదు..
ఇటీవల ASER విడుదలైన 2022 సంవత్సరానికి సంబంధించిన తాజా వార్షిక విద్యా స్థితి నివేదిక (గ్రామీణ) ప్రకారం 14-18 ఏళ్ల మధ్య వయసులో పాఠశాలల్లో చేరని విద్యార్థుల శాతం తెలంగాణలోనే అత్యధికంగా ఉంది. జాతీయ సగటు 13.2%కి వ్యతిరేకంగా, రాష్ట్రంలో 22.1% మంది పిల్లలు ఏ పాఠశా ల లేదా కళాశాలలో నమోదు చేయబడలేదు. నాలుగ వ వంతు మంది అబ్బాయిలు లేదా 26%, 17.4% బాలికలు విద్యావ్యవస్థకు దూరంగా ఉన్నారు. 17-18 సంవత్సరాల వయస్సు గల పిల్లల విషయానికి వస్తే ఈ సంఖ్య 40.1% వరకు పెరుగుతుంది. ఈ జనాభాలో, 68.7% మంది నెలలో 15 రోజులకు పైగా పనిలో నిమగ్నమై ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల పాఠశాలల్లో డ్రాప్‌ఔట్స్‌ను తగ్గించడం తెలంగాణలో ఒక ప్రధాన సమస్యగా ఉంది. ప్రాథమిక విద్యలో చేరిక రేట్లు మెరుగుపడ్డాయి కానీ మాధ్యమిక, ఉన్నత విద్యా స్థాయిలో డ్రాపౌట్ రేట్లు, ముఖ్యంగా బాలికలు, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలలో ఇంకా ఆందోళనకరంగా ఉన్నాయి. ASER నివేదిక అంటే దేశ వ్యాప్తంగా పౌరుల నేతృత్వంలోని గృహ సర్వే జాతీయంగా 14-18 సంవత్సరాల వయస్సు గల 25% మంది ఇప్పటికీ Std II స్థాయి పాఠ్యాంశాన్ని సర ళంగా చదవలేరు, తెలంగాణలో 46.25% మంది విద్యార్థులు దానిని చదవగలరు. అయితే, జాతీయ స్థాయిలో 14-18 ఏళ్ల మధ్య 43.3% మంది విద్యార్థులు అంక గణిత సమస్యలను పరిష్కరించగలిగితే, తెలంగాణలో 19.75% మంది మాత్రమే లెక్కలు చేయగలరు. ఇంగ్లీషులో వాక్యాలను చదవడంలో జాతీయ సగటు 57.3% అయితే తెలంగాణలో ఇది 43.2% మాత్రమే.
ఈ లోపాలను పరిష్కరిస్తే..
ఇది తగ్గించడం కోసం తల్లిదండ్రులను పాఠశాల నిర్వహణలో క్రమం తప్పకుండా పాల్గొనేలా చేయాలి. పాఠశాల పనితీరు పర్యవేక్షణలో వారి పాలు పంచుకోవడాన్ని ప్రోత్సహించాలి. విద్య విలువను ప్రచారం చేసే అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. ముఖ్యంగా అమ్మాయిల విద్య కోసం, అలాగే డ్రాప్ అవుట్ రేట్లను తగ్గించడం, గ్రామీణ విద్యా కమిటీలను పాఠశాల పనితీరు, సౌకర్యాలు, ఉపాధ్యాయ హాజరు వంటి అంశాలను పర్యవేక్షించేలా బలోపేతం చేయాలి. గ్రామీణ విద్యలో నిపుణత కలిగిన ఎన్‌జీఓలతో భాగస్వామ్యాలను ఏర్పాటు చేసి వినూత్న పరిష్కారాలు, అదనపు వనరులను అందించడం CSR ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, డిజిటల్ విద్య, పరస్పరాలు వంటి ప్రణాళికలను అమలు చేయడం, విద్యా నాణ్యత, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉపాధ్యాయ శిక్షణను మెరుగుపరచడానికి PPP మోడల్స్‌ను అన్వయించడం. విద్యార్థుల ఆరోగ్య, పోషక స్థితిని పర్యవేక్షించడానికి క్రమక్రమంగా ఆరోగ్య పరీక్షలను నిర్వహించడం, పిల్లలు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకునేలా చేయడానికి పాఠశాల సిలబస్‌లో హైజీన్, శుచిశుభ్రత విద్యను జోడించడం, పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కాలేని విద్యార్థులకు రేడియో, టీవీ ఛానళ్ల ద్వారా విద్య అందించడం. విద్యా వనరులతో మొబైల్ వ్యాన్లు దూర ప్రాంతాలకు చేరుకుని అదనపు విద్య అందించడం వంటి పద్ధతులను సమగ్రంగా అమలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ విద్యకు సంబంధించి మంచి ఫలితాలను సాధించవచ్చు. పాఠశాల మౌలిక వసతులు, ఉపాధ్యాయుల లభ్యత, విద్యా నాణ్యతలో ఉన్న లోపాలను పరిష్కరించడం ద్వారా సమాజంలోని అన్నివర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, అందరికీ సమానమైన విద్యా అవకాశాలను కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి.
డాక్టర్. బి. కేశవులు, ఎండి. సైకియాట్రీ.
చైర్మన్ తెలంగాణ మేధావుల సంఘం.
85010 61659