ఉత్తరాంధ్ర ‘ఉత్తి ఆంధ్ర’గా మారకూడదంటే...
YSRCP Government neglects Uttarandhra development
సహజవనరులను కలిగున్న ఉత్తరాంధ్ర ‘ఉత్తి ఆంధ్ర’గా మిగలకుండా ఉండాలంటే ఈ ప్రాంతానికి జనసేన మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ‘ప్రతి చేతికి పని... ప్రతి చేనుకు నీరు...’ కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దగాపడుతున్న ఈ ప్రాంతం ప్రజలకు న్యాయం జరగాలంటే వారు త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ వజ్రాయుధమైన ఓటుతో సమాధానం చెప్పాలి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను తమ ఎజెండాలో కచ్చితంగా చేర్చేలా అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఇప్పుడు కలిగింది.
ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కూడా వివక్షకు గురవుతూనే ఉంది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని గణాంకాలతో సహా చూపింది. రాష్ట్ర విభజన సందర్భంగా హామీ ఇచ్చినట్లు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇచ్చి ఉంటే ప్రస్తుతం ఉత్తరాంధ్ర పరిస్థితులు భిన్నంగా ఉండేవని కచ్చితంగా చెప్పవచ్చు. ఉత్తరాంధ్ర పట్ల సాగుతున్న నిర్లక్ష్యం, వనరుల విధ్వంసం, అభివృద్ధి రాహిత్యాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఉత్తరాంధ్రలో భారీగా సహజ వనరులున్నా వెనుకబాటుతనంలో మగ్గిపోవడానికి ప్రధాన కారణం స్థానికేతర రాజకీయ నేతలు ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతూ, పెత్తనం చెలాయిస్తూ ఇక్కడి వనరులను కొల్లగొట్టడమే. ఉత్తరాంధ్రలో నదులు, అడవులు, సముద్ర తీరం, ఖనిజ సంపద, రైలు, జాతీయ రోడ్లు, ఓడరేవు, విమానాశ్రయం, పెద్ద ఎత్తున మానవ వనరులున్నాయి. ‘మా వనరులను మా అభివృద్ధికే వెచ్చించాలి’, ‘మా వనరులు కొల్లగొట్టడానికి ఇతరులకు హక్కు లేదు’ అని గొంతెత్తే వారినే రాబోయే ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఇక్కడి ప్రజలపై ఉంది.
ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే...
జనసేన పార్టీ చెప్పినట్టుగా ‘ప్రతి చేతికి పని..’ హామీని అమలు పరిస్తే, ఉత్తరాంధ్రలో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీ, జ్యూట్ మిల్లులను తెరిపిస్తే రోడ్డున పడ్డ అనేక మంది కార్మికులకు జీవనోపాధి లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పితే ఉత్తరాంధ్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి. దీంతో పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన ఇబ్బందులు ఇక్కడి యువతకు తప్పుతాయి. ‘ప్రతి చేనుకు నీరు...’ హామీని ఆచరణలోకి తెస్తే ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో మొత్తం 23.24 లక్షల ఎకరాలు సాగుభూమి ఉండగా, అందులో కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోందని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ఇక్కడ సాగునీరు, తాగునీరు కష్టాలను పరిష్కరించడానికి ఏకైక మార్గం బాబూ జగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేయడమే. ఈ ప్రాజెక్టుతో విశాఖపట్నంలో 3.21లక్షల ఎకరాలు, విజయనగరంలో 3.94 లక్షల ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో 0.85 లక్షల ఎకరాలు మొత్తం 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 12 వందల గ్రామాలకు తాగునీరు లభిస్తుంది. 53.40 టీఎంసీలు వ్యవసాయం కోసం, 4.46 టీఎంసీలు తాగునీటి కోసం, 5.34 టీఎంసీల నీరు పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించేలాగా ఈ ప్రాజెక్టు డిజైన్‌ను రూపొందించారు. సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణంతో పాటు గోదావరి జలాల్లో ఉత్తరాంధ్రకు న్యాయమైన నీటి వాటాను కేటాయింపు, నదుల అనుసంధానం, ఇతర నీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెడితే ఈ ప్రాంతంలో కరువు కాటకాలను పారద్రోలి వలసలను అరికట్టవచ్చు.
అరకు డిక్లరేషన్ అమలు ఏది?
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఉన్న ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి, 2012లో ‘‘అరకు డిక్లరేషన్’’ సూచించిన అభివృద్ధి పథకాలు ఇంతవరకూ అమలులోకి నోచుకోలేదు. ఈ ప్రాంతంలో 340 కి.మీల మేర ఉన్న సముద్రతీరంపై ఆధారపడ్డ మత్స్యకారులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలి. ఫిష్ ప్రాసెసింగ్ పరిశ్రమలను, కోల్డ్ స్టోరేజీలను స్థాపించాలి. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు రాష్ట్ర సగటు కన్న తక్కువ అక్షరాస్యతతో ఉన్నాయి. పందొమ్మిదో శతాబ్ది చివరికే విద్యా నగరంగా పేరుగాంచిన విజయనగరం ఇరవయ్యొకటో శతాబ్దిలో అక్షరాస్యతలో చివరికి చేరడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అన్ని కీలకమైన రంగాల్లో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గణాంకాలతో స్పష్టంగా కనబడుతుంది.
ఉత్తరాంధ్రపై ప్రభుత్వ నిర్లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014, సెక్షన్ 46 (3)లో నిర్దేశించినట్టుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ఉత్తరాంధ్రకు ప్రకటించాలి. వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర ఆకాంక్షల పట్ల శ్రద్ధ పెట్టలేదు. ఇక్కడి ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పు తీసుకరాకపోగా ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తామంటూ ఈ ప్రాంత ప్రజలను మభ్యపెడుతూ, వనరులను కొల్లగొడుతూ ఉత్తరాంధ్రను ‘‘ఉత్తి ఆంధ్ర’’గా మార్చివేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ తన లక్ష్యంగా చెప్పిన ‘‘ప్రతీ చేతికి పని - ప్రతీ చేనుకు నీరు’’ హామీని అమలు చేస్తేనే వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత ఇచ్చే వారికి ఈ ఎన్నికల్లో మద్దతుగా నిలిచి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఏ ప్రాంతం అయినా అభివృద్ధి కావాలంటే పని, నీరు, బడ్జెట్ అత్యవసరం. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఉద్యమించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించింది. తెలంగాణను మించి వెనుకబాటుతనానికి గురైన ఉత్తరాంధ్రకు కూడా నీళ్లు, నిధులు, నియామకాలు కావాలి. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీతో నిధులు సాధించడంతో పాటు నీళ్లు, నియామకాలు కోసం జనసేనాని లక్ష్యమైన ‘ప్రతి చేతికి పని...ప్రతి చేనుకు నీరు...’’ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడుతాయి.
- కొణతాల రామకృష్ణ,
అనకాపల్లి మాజీ ఎంపీ, మాజీ మంత్రి,
కన్వీనర్, ఉత్తరాంధ్ర చర్చావేదిక
konathalaramkrishna1957@gmail.com