మీ జమానా... అవినీతి ఖజానా!
YS Jagan and CM KCR are corrupts says Ex MLA Gone Prakash Rao
ప్రజలకు నిజాయితీగా పాలన అందిస్తామని, అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా పరిపాలిస్తామని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత మీరు నమ్మబలికారు. మీ పాలన చూసిన తరువాత మీ మాటలు ‘నీటి మీద రాతలు’గానే మిగిలిపోయాయన్నది స్పష్టమౌతోంది. తెలంగాణలో ఏడున్నర, ఆంధ్రప్రదేశ్లో నాలుగు సంవత్సరాల పాలనలో అవినీతి ఏరులైపారుతోందన్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో చంటిపిల్లవాడిని అడిగినా చెబుతారు. ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ జమానా అంతా అవినీతి ఖజానాగా మారిపోయిందన్న విషయం లోకం కోడై కూస్తోంది. బంగారు తెలంగాణ చేస్తానని కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారం చేశారు తప్ప రాష్ట్రానికి చేసిందేమి లేదు. అదేవిధంగా ఎన్నికలకు ముందు ‘నేను ఉన్నాను-నేను విన్నాను’ అని ఊరువాడ ప్రచారం చేసి వైఎస్ జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ‘నేను దోచుకుంటాను-నేను దాచుకుంటాను’ అనే ఏకైక లక్ష్యంతో పరిపాలిస్తున్నారు. ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు తెలుగు రాష్ట్రాలని దివాలా తీయించి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఉద్యోగస్తులకు జీతాలు, బిల్లులు ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారు.
మీ అభివృద్ధి ఎంత?
ఉమ్మడి రాష్ట్రంలో మాజీ శాసనసభ్యుడిగా, నీతికి, సిద్ధాంతాలకు కట్టుబడి ఆరు నెలల్లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యక్తిగా, ఒక సామాజిక కార్యకర్తగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి, అక్రమాలు, దాష్టికాలపై గొంతెత్తాల్సిన బాధ్యత నాపై ఉంది. ప్రస్తుతం నేను ఏ రాజకీయపార్టీలో సభ్యుడిని కాదు. కేవలం బాధ్యత గల పౌరుడుగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అవినీతిని మీ దృష్టికి తీసుకుని రావడం ద్వారా వీటిని కొంతైన అరికట్టవచ్చనే ఆశాభావంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. కనీసం ఈ బహిరంగ లేఖ చూసిన తరువాతైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కొరడా ఝలిపిస్తారని ఆశిస్తున్నాను. దేశంలోనే ఎంతో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, గూండాయిజంను ఏ విధంగా అరికడుతున్నారో ఒక్కసారి గమనించాలని మిమ్మల్ని కోరుతున్నాను. అది ఇక్కడ అమలు చేసేందుకు తెలుగు రాష్ట్రాల నుండి ఉత్తరప్రదేశ్ కు ఒక బృందాన్ని పంపి అక్కడి ప్రభుత్వం అవినీతి, అక్రమాలు అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేసే విధంగా ఆ బృందాన్ని ఆదేశించి దానికనుగుణంగా తెలుగు రాష్ట్రాల్లో చర్యలు తీసుకుంటే ప్రజలకు మేలు జరుగుతుంది.
శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?
ముఖ్యమంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత మీరు అవినీతిపై ఫిర్యాదులు చేయాలని టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కి వచ్చిన ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటి వరకు వాటికి వచ్చిన ఫిర్యాదులు ఎన్ని? దీనిపైన శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయా? రెండు తెలుగు రాష్ట్రాల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నది మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ అనుచరులే అనేది జగమెరిగిన సత్యం కాదా? మీరు పదవి చేపట్టకముందు మీ ఆస్తులు ఎంత? ప్రస్తుతం మీ ఆస్తులెంత? విదేశాల్లో మీరు పెడుతున్న పెట్టుబడులు ఎన్ని? కర్ణాటకలో 40 శాతం కమీషన్ లాగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు అదే విధంగా ప్రతీ పనికి ఒకరేటు పెట్టి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కమీషన్లు తీసుకుంటున్న చరిత్ర మీకే దక్కుతుంది.
డబ్బు చుట్టూ రాజకీయం
రెండు రాష్ట్రాల్లో రాజకీయమంతా డబ్బుతోనే ముడిపడే విధంగా మార్చివేశారు. ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు అందజేయడంలో కూడా అవినీతి రాజ్యమేలుతుందనేది బహిరంగ రహస్యమే. ఎమ్మెల్సీ, రాజ్యసభ మొదలుకొని ఇతర నామినేటెడ్ పోస్టులను పారిశ్రామికవేత్తలకు, బంధువర్గాలకు ఇస్తున్నారు. వివిధ స్కాంలతో పాటు మద్యం, ఇసుక, గ్రానైట్ రంగాలలో సంపాదించిన అవినీతి సొమ్మును విచ్చలవిడిగా ఎన్నికలలో ఖర్చుపెడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఎన్నికలు జరిగినా భారీగా ఖర్చుచేస్తున్నారనే దానికి నిదర్శనం ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ప్రతీ ఓటుకు రూ.2000 నుండి రూ. 5000ల వరకు చెల్లిస్తున్నారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అక్కడి భవనాలు ఎంతో దుర్భరం..
దేశరాజధానిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అధికారిక భవనాలు ఎంతో దుర్భరంగా ఉన్నాయి. ఈ భవనాల్లో మౌలిక వసతులతో పాటు, కనీస వసతులు కూడా ఎక్కడా కనిపించడం లేదు. అపరిశుభ్రతకు మారుపేరుగా నిలుస్తున్నాయి. మరుగుదొడ్లు మొదలుకొని గదులలో కూడా మెయింటెన్స్ సరిగ్గా నిర్వహించడం లేదు. మాజీ ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉండాలంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమస్యలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం అక్కడ నిర్వహిస్తున్న సులభ్ కాంప్లెక్స్‌లను పరిశీలించి ఢిల్లీలోని రాష్ట్ర భవనాల్లో, తెలుగురాష్ట్రాల్లో కూడా ఇటువంటి సౌకర్యాలే కల్పించాలని కోరుతున్నాను. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, దాష్టికాలపై బహిరంగంగా చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ చర్చకు మీరుగాని, మీ ప్రతినిధులను గానీ పంపాలని కోరుతున్నాను. ఈ చర్చకు మీరు వస్తారని ఆశిస్తూ...
(తెలుగు రాష్ట్రాల సీఎంలకు బహిరంగ లేఖ)
గోనె ప్రకాశ్ రావు,
మాజీ ఎమ్మెల్యే
98487 66000