పత్రికా స్వేచ్ఛను పరిరక్షించుకుందాం!
World Press Freedom Day, let’s protect voices of journalists
భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ పరిస్థితి ఎలా ఉందో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ కచ్చితంగా తెలియచేసింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవమైన మే 3వ తేదీన ఈ ఏడాది సూచీ విడుదల చేశారు. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్.ఎస్.ఎఫ్) ఈ సూచీని సిద్ధం చేసింది. మొత్తంగా 180 దేశాల జాబితాలో భారత్‌కు 161వ స్థానాన్ని ఇచ్చింది. గతేడాది ఈ సూచీలో భారత్ 150వ స్థానంలో ఉంది. కానీ ఈసారి 11 స్థానాలు కిందకి దిగజారడం ఆందోళన కలిగించే వాస్తవం. ‘జర్నలిస్టులపై హింస, రాజకీయ పక్షపాతంతో కూడిన మీడియా, మీడియా యాజమాన్యాల కేంద్రీకరణ ఇవన్నీ కలిసి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో ఉందని తెలియచేస్తున్నాయి’ ప్రభుత్వ అణచివేత, బెదిరింపులు అనేవి పత్రికా స్వేచ్ఛకు అతిపెద్ద ముప్పుగా ఉన్నాయి. మీడియాను కుదించడానికి, స్వతంత్ర మీడియా సంస్థలను, జర్నలిస్టులను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఏవో చర్యలు తీసుకుంటూనే వస్తోంది.
గతేడాది మలయాళం వార్తా చానెల్ 'మీడియా వన్'పై నిషేధం విధించారు. అప్ లింక్, డౌన్ లింక్ లైసెన్స్‌ను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. జాతీయ భద్రతను సాకుగా చూపింది. చివరకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని, ఆ ఆదేశాలను రద్దు చేయడంతో చానెల్‌పై నిషేధం తొలగిపోయింది. మీడియా సంస్థలపై దాడులకు ఈడీ, ఆదాయ పన్ను వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి, వాటిని వెంటాడి వేధించింది. ఇది మీడియాను భయపెట్టడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న మరో ఎత్తుగడ. 2002 గుజరాత్ నరమేధంపై ఒక డాక్యుమెంటరీని ప్రసారం చేసిన వెంటనే బీబీసీ వార్తా చానెల్ కార్యాలయాల్లో ఐ.టి సోదాలు మొదలయ్యాయి. దానికి ముందు, బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రసారం కాకుండా నిరోధించేందుకు ఐ.టి చట్టాన్ని ప్రయోగించింది.
వ్యతిరేకంగా రాస్తే కేసులు..
కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏదైనా వార్త ప్రచురితమైందని భావిస్తే చాలు. దేశద్రోహంతో సహా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని వివిధ క్లాజుల కింద జర్నలిస్టులను అరెస్టు చేసే ధోరణి పెరుగుతోంది. రత్నగిరిలో శశికాంత్ వారిషె వంటి క్రిమినల్, మాఫియా కార్యకలాపాల గురించి బట్ట బయలు చేస్తే జర్నలిస్టులు హత్యలకు గురవుతున్నారు. అందువల్లే మొత్తం 180 దేశాల్లో చిట్టచివరి 31స్థానాల్లో ఉన్న దేశాల్లో జర్నలిస్టుల పరిస్థితి 'చాలా దారుణంగా' ఉందని సూచీ పేర్కొంది. భారత్ కూడా ఈ కేటగిరీలోనే ఉంది.
జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారి కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వచ్చినప్పటి నుండి అక్కడ మీడియా అణచివేత, సెన్సార్‌షిప్ బాగా పెరిగిపోయింది. కాశ్మీర్‌లో స్థానిక వార్తాపత్రికలపై, ఆన్‌లైన్ మీడియాపై పదేపదే దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇక అక్కడ స్వతంత్ర మీడియాకు స్థానం లేకుండా పోయింది. ఏవో కొన్ని మాత్రమే వార్తా సంస్థలు ఉన్నప్పటికీ వాటిపై భారీగా ఆంక్షలు, సెన్సార్‌షిప్ విధించారు. ఈ ఏడాది మార్చిలో, ఇర్ఫాన్ మెహరాజ్ అనే జర్నలిస్టును ఎన్‌ఐఎ అరెస్టు చేసింది. యుఏపిఏ లోని ఒక క్లాజుతో సహా ఐపీసీ లోని వివిధ నిబంధనల కింద అభియోగాలు మోపారు. ప్రస్తుతం జైల్లో నలుగురు జర్నలిస్టులు ఉన్నారు. వారందరూ ప్రజా భద్రతా చట్టం లేదా యుఏపిఏ కింద నిర్బంధంలో ఉన్నారు.
డిజిటల్ మీడియాకు చుక్కలు
ప్రధాన స్రవంతిలోని వార్తాపత్రికలు, టెలివిజన్ చానెళ్ళను లొంగదీసుకున్న తర్వాత, ఇక చిన్న స్వతంత్ర వార్తా వెబ్‌సైట్‌లు, డిజిటల్ మీడియాపై దాడిని కేంద్రీకరించింది. 2021లో సమాచార సాంకేతిక పరిజ్ఞానం (మధ్యంతర మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నిబంధనావళి) కింద నిబంధనలు రూపొందించారు. వార్తా వెబ్‌సైట్లను, డిజిటల్ మీడియాను నియంత్రించడానికి సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ఈ నిబంధనలు అనుమతిస్తాయి. వార్తలు, సమాచార ప్రసారాలపై ప్రభుత్వ నియంత్రణను మరింత కఠినతరం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన వార్తల్లో ఏది బూటకమైన వార్త, ఏది కాదు అని నిర్ణయించే అధికారాన్ని, వాస్తవాలను తనిఖీ చేసే అధికారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలోని కమిటీకి ఇచ్చారు.
కొద్దిమంది కార్పొరేట్లు మీడియాను గుప్పిట్లో పెట్టుకోవడం పత్రికా స్వేచ్ఛకు రెండో పెద్ద ముప్పుగా పరిణమించిందని పత్రికా స్వేచ్ఛ సూచీ నివేదిక పేర్కొంది. ప్రింట్, విజువల్ మీడియాపై ఆధిపత్యం చెలాయిస్తున్న కార్పొరేట్ మీడియా కేంద్ర ప్రభుత్వానికి భజన చేస్తూ, గోడీ (ఇంటి పెంపుడు కుక్క) మీడియాగా మారిపోయింది. ఈ కార్పొరేట్ల అధీనంలోని టెలివిజన్ చానెళ్ళు మోడీ ప్రభుత్వానికి, కరడుగట్టిన హిందూత్వ మతోన్మాద రాజకీయ ప్రచార బాకాలుగా మారిపోయాయి. ఆ దారిలో వెళ్లకుండా స్వతంత్రంగా వ్యవహరించిన వారిపై దాడులు, వేధింపులు తప్పవు. లేదా అదానీ వంటి ఆశ్రిత పెట్టుబడుదారులు ఎన్‌డిటీవీని కబళించిన విధంగానే కబళిస్తాయి.
అంతరిస్తున్న స్వతంత్ర జర్నలిజం
ఫలితంగా స్వతంత్ర జర్నలిజానికి లభించే స్థానం కుంచించుకుపోతోంది. అధికారంలో ఉన్నవారి తప్పులను ఎత్తి చూపించగల పరిశోధనాత్మక జర్నలిజం మనుగడలో లేకుండా పోతోంది. ఇలా పత్రికా స్వేచ్ఛ గొంతు నులమడం ప్రభుత్వం నిరంకుశంగా ప్రజాస్వామ్యంపైన, ప్రజాస్వామిక హక్కులపైన చేస్తున్న దాడిలో భాగమే. ఇదంతా వార్తలు ఎలా ఉండాలి వాటిని ఎలా చిత్రీకరించాలి అన్న అంశాలపై ప్రధాన స్రవంతి మీడియాకు షరతులు నిర్దేశించ గలమన్న ధీమాతో ప్రభుత్వం ఉంది. పత్రికా స్వేచ్ఛకు అత్యంత హాని ఒక వైపు తలపెడుతూ మరోవైపు దేశంలో ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడానికి సాయపడటంలో కీలకపాత్ర పోషిస్తున్నందుకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం రోజున జర్నలిస్టులను అభినందిస్తున్నామని హోంమంత్రి చెప్పడం అత్యంత విచారకరమైన అంశం.
భారతదేశంలో జర్నలిజం ఎదుర్కొంటున్న ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అన్ని రకాల బెదిరింపులు, ఒత్తిళ్ళను తట్టుకుని నిలబడి ధైర్య సాహసాలతో, నిజాయితీతో తమ విధి నిర్వహణను సమర్థవంతంగా నిర్వహిస్తున్న అనేక మంది జర్నలిస్టులకు, మీడియా సిబ్బందికి శాల్యూట్ చేయాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి జరుగుతున్న పోరాటంలో పత్రికా స్వేచ్ఛ కోసం జరిగే పోరాటం భాగం కావాలి.
వి. కృష్ణ మోహన్
నేషనల్ వైస్ చైర్మన్,
కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్
9440668281