నిషేధంతో పొగాకును అరికట్టగలమా?
ఆరోగ్యానికి హానికరంగా మారిన గుట్కాపై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఆరోగ్యానికి హానికరంగా మారిన గుట్కాపై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో గుట్కా తయారీ, క్రయవిక్రయాలను నిషేధిస్తూ ఫుడ్ సేఫ్టీ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.
గుట్కా, పాన్ మసాలాల్లో ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకు, నికోటిన్ ఉండడం మూలంగానే వాటిని నిషేధించినట్లు పేర్కొంది. 2025 మే 24 వరకు గుట్కాను తయారు చేసినా, నిల్వ ఉంచినా, విక్రయాలు జరిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అయితే తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాలు గుట్కా విక్రయాలపై ఇలాంటి నిర్ణయమే తీసుకున్నా.. ఇప్పటికీ క్రయవిక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. నిబంధనలు సరిగా అమలు చేయలేకపోవడం, కోర్టు కేసుల కారణంగా అడ్డంకులు వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గుట్కా, పొగాకు విక్రయాలను నిషేధిస్తూ పార్లమెంటులో చట్టం చేస్తేనే సత్ఫలితాలు వచ్చే అవకాశముంది.
వివిధ రాష్ట్రాల్లో నిషేధించినా..
ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2011 ప్రకారం పొగాకు ఉత్పత్తులపై 2012 నుంచి పలు రాష్ట్రాలు వాటిని నిషేధించడం మొదలుపెట్టాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం 2013 జనవరి 9న గుట్కా ఉత్పత్తులను నిషేధించింది. ఏటా నిషేధం కొనసాగించేలా గెజిట్ జారీ చేసింది. అయితే గుట్కాను మాత్రమే నిషేధించడంతో పొగాకుతో తయారయ్యే పాన్‌మసాలా ఉత్పత్తులు మార్కెట్‌లో బాగా పెరిగాయి. దీంతో 2014 జనవరి 9న సమగ్రంగా ఆదేశాలు ఇచ్చింది. అందుకే నికోటిన్, పొగాకు ఆనవాళ్లు ఉండి నోటి ద్వారా తీసుకునే అన్ని ఉత్పత్తులపైనా నిషేధం విధించింది.
నియంత్రణ చర్యలు ఫెయిల్
పొగాకు ఉత్పత్తుల వినియోగంపై 2014లో భారత్ చట్టం చేసింది. దీని తర్వాత సిగరెట్ పెట్టెపై ‘పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే పదాలు రాయాలని సూచించింది. ఈ నిర్ణయంపై సిగరెట్ తయారీదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ.. కోర్టు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. అంతేకాకుండా పొగతాగే అలవాటును మాన్పించడాన్ని అనేక రకాలైన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. గుట్కాను నిషేధించడం, బహిరంగ ప్రదేశాలలో సిగరెట్లు తాగనివ్వకపోవడం, పొగాకు ఉత్పత్తుల ప్రచారాలపై నిషేధం, పద్దెనిమిదేళ్ల లోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులను విక్రయించకుండా ఉండడం, పాఠశాలలు, కళాశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించారు. సిగరెట్ ప్యాకెట్లు, గోడలు, బిల్ బోర్డులు, హోర్డింగులు, సినిమా థియేటర్లలో, ఇంకా అనేక మార్గాల్లో పొగాకు తాగడం హానికరమంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. పన్నులు కూడా భారీగా పెంచారు. ఎంతగా ప్రచారం చేసినా... సిగరెట్లు, బీడీలు, గుట్కా, ఖైనీల రూపంలో పొగాకు వాడకం ఏటేటా పెరుగుతోందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
పెరుగుతున్న క్యాన్సర్ బాధితులు
పొగాకు, నికోటిన్ ఉత్పత్తుల వినియోగంతో అధిక శాతం మంది నోటి క్యాన్సర్ బారినపడుతున్నారు. గ్లోబల్ అడల్ట్ టుబాకో సర్వే (జీఏటీఎస్) ప్రకారం.. సిగరెట్లు, బీడీల కంటే ఎక్కువగా పొగ రహిత పొగాకుకే ప్రజలు ఆకర్షితులవుతున్నారని తేలింది. భారత దేశంలో సుమారు 27 కోట్ల మంది పొగాకును ఉపయోగిస్తుంటే.. ఇందులో పది కోట్ల మంది వరకు సిగరెట్లు, బీడీలు తాగే వారు ఉన్నారు. ఇండియాలో స్మోకింగ్ వల్ల ఏటా 12 లక్షల మంది, పొగాకు నమలడం వల్ల 3.5 లక్షల మంది చనిపోతున్నారు. 2018 లో చేసిన సర్వేలో సిగరెట్లు తాగే వారిలో 46 శాతం మంది నిరక్షరాస్యులని, 16 శాతం మంది కాలేజీ విద్యార్థులని తేలింది.
ప్రత్యామ్నాయ జీవనోపాధిని చూపిస్తేనే..
పొగాకు ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వ పన్ను రాబడిలో రూ.50 వేల కోట్లకు పైగా జమ అవుతున్నాయి. దీని ద్వారా వార్షిక విదేశీ మారకపు ఆదాయం 2022-23 లో రూ.9,000 కోట్లుగా ఉన్నది. ఇండియాలో 4.64 లక్షల హెక్టార్లలో పొగాకు సాగవుతున్నది. దాదాపు 80 కోట్ల కిలోల వార్షిక ఉత్పత్తితో దేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పొగాకు ఉత్పత్తిదారుగా ఉన్నది. ముఖ్యంగా పొగాకును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఎక్కువగా పండిస్తున్నారు. దాదాపు 2.6 కోట్ల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు పొగాకు ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. పొగాకు ఉత్పత్తులపై పూర్తిస్థాయి నిషేధం విధించే ముందు పొగాకుపై ఆధారపడి జీవిస్తున్న రైతులు, చిరువ్యాపారులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపెట్టాలి. ఆ తర్వాత నియంత్రణ చర్యలు మానుకొని పూర్తిస్థాయి నిషేధం విధించేలా అడుగులు వేయాలి. అవసరమైతే పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం చేయాలి. అప్పుడే పొగాకు ఉత్పత్తుల ద్వారా కలిగే దుష్పరిణామాల నుంచి దేశాన్ని, దేశప్రజలను కాపాడుకోగలుగుతాం.
-ఫిరోజ్ ఖాన్,
సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,
9640 466464