ప్రజారోగ్యం అందరి బాధ్యత!

ప్రతి సంవత్సరం దాదాపు 60 కోట్ల మంది అసురక్షిత ఆహారాన్ని తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి మన ఆహారం

Update: 2024-06-07 00:30 GMT

ప్రతి సంవత్సరం దాదాపు 60 కోట్ల మంది అసురక్షిత ఆహారాన్ని తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి మన ఆహారం సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడం, మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఆహారోత్పత్తి సంస్థకు, అమ్మకందార్లకు ప్రభుత్వానికి డబ్బే ముఖ్యమైపోయింది. ప్రజల ఆరోగ్యంతో వీరెవ్వరికీ సంబంధం లేదు. ప్రజలు వారిపైన ఉన్న నమ్మకంతో కొంటున్నారు, తింటున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. ఈ రోజు మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే పొలం నుండి మనం తినే టేబుల్‌ వరకు ఆహారం సురక్షితంగా ఉండాలి దానికి ప్రజలు, ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇటీవల హైదరాబాద్‌లోని ఒక ఫేమస్‌ రెస్టారెంట్‌‌పై, ఇతర హోటళ్ళు, రెస్టారెంట్‌లపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. భారీగా కల్తీ పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. మైదాపిండిపై పురుగులు ఉండటాన్ని చూసి 20 కేజీల మైదాపిండిని అధికారులు సీజ్‌ చేయడమే కాకుండా, ప్రక్కనే ఉన్న పెద్ద డబ్బాలోని చింతపండుపై పురుగులు పడి ఉండడాన్ని గమనించారు. ఆహార ప్రియులను తియ్యగా మోసం చేస్తున్న హోటళ్ళు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి.

రసాయన ఎరువుల వినియోగంతో..

బిజీ జీవితంలో ఇంట్లో వంట చేయడమే చాలా మంది మరచిపోయారు. టిఫిన్స్‌, లంచ్‌, డిన్నర్‌లు హోటళ్లలో సేవించడమే కాకుండా, ప్రాసెస్డ్‌ ఫుడ్‌తో పిల్లలకు టిఫిన్స్‌ తినిపిస్తున్నారు. హోటళ్ళలో ఆహారం కుళ్ళిన పదార్థాలతో తయారు చేసి వేడి చేసి వడ్డిస్తున్నారు, అవి చల్లారితే వాటి నాణ్యత బయట పడుతుంది. హోటళ్ళలోని కిచెన్‌లలో ఈగలు, దోమలు, బల్లులు, బొద్దింకలు తిరుగుతున్నాయి. గడువు ముగిసిన మసాలాలు, కుళ్లిన కోడిగుడ్లు, దుర్వాసన వెదజల్లే మాంసం, గడువు ముగిసిన పన్నీరు, ఇలా సర్వం కల్తీ. ఈ రకమైన కలుషిత ఆహారం తినడం వలన అనారోగ్యానికి గురి కావడం, వాంతులు, విరేచనాలు, నొప్పులు వంటి లక్షణాలు కలుగుతాయి.

ఈ హోటళ్ళలో వడ్డించే ఆహారమే కాకుండా, ఆహారోత్పత్తి సంస్థలు నాణ్యతను పాటించడం లేదు. ఆరేడు దశాబ్దాల క్రితంతో పోల్చితే వరి, గోధుమ, వంగడాల్లో ఎముకలూ, నరాల పటుత్వానికి, వ్యాధి నిరోధకతకు ప్రాణప్రదమైన ఖనిజాలు లోపిస్తున్నాయి. ఆర్గెనిక్‌, క్రోమియం, బేరియం వంటి విషతుల్య మూలకాలు ఎక్కువవుతున్నాయి. దానికి కారణం దేశంలో రసాయన ఎరువుల విచ్చలవిడి వినియోగం. ప్రభుత్వం సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

తప్పు చేసినా పట్టించుకోకపోవడంతో..

భారతీయ మసాలాలపై హాంకాంగ్‌ ఈ మధ్యే నిషేధం విధించింది. ఈ మసాలలలో ఎథిలీన్‌ ఆక్సైడ్‌ అనే కేన్సర్‌ కారక రసాయనం ఉన్నట్లు తేలింది. అమెరికా చేరుతున్న అనేక భారతీయ ఉత్పత్తులు నాణ్యత లేమితో తిరస్కరణకు గురి అవుతున్నాయి. సీసం వంటి ప్రమాదకర భార లోహాలు పరిమితికి మించి ఉంటున్నాయి. పాచి, పురుగులు పట్టిన ఆహారాన్ని వేడి చేసి వడ్డిస్తున్న వైనాన్ని, ఎక్స్‌పైరీ ఆహార సామాగ్రిని ప్రభుత్వం తనిఖీలు చేసి హోటళ్ళను సీజ్‌ చేయాలి. నగరంలో కొనసాగుతున్న ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, దాడులను నిరంతరం చేయడమే కాకుండా, ఆ కిచెన్‌లను కస్టమర్లు పరిశీలించే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టాలి. లేకుంటే ప్రజలు డబ్బు పెట్టి అనారోగ్యాన్ని కొనుకున్నట్లే. పరిశ్రమలను, ఎగుమతులు కాపాడుకోవాలనే నెపంతో ఉత్పత్తి సంస్థలు తప్పు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని, పౌర సమాజ నిపుణుల అభిప్రాయాలను తోసిపుచ్చుతున్నాయి.

ప్రతి సంవత్సరం జూన్‌ 7న మన ఆహారం సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి మనం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2024లో ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం కోసం ఎంపిక ధీమ్‌ ‘‘ఆహార భద్రత ఊహించని వాటికి సిద్ధం’’. సంభావ్య ప్రమాదాల నుండి మన ఆహార సరఫరాను కాపాడుకోవడంలో క్రియాశీలకంగా ఉండటం గురించి ఈ ధీమ్‌ చెబుతుంది. ఈ విషయాలను గమనించి ఈ రోజున ప్రజారోగ్యమే మన ప్రాథమిక కర్తవ్యం అని ప్రతిజ్ఞ చేద్దాం.

(నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం)

సి.వి.వి. ప్రసాద్‌

విశ్రాంత ప్రధానాచార్యులు

80196 08475

Tags:    

Similar News