బాల్యానికి భరోసా ఏదీ?
ప్రపంచవ్యాప్తంగా బాలకార్మికుల దయనీయ స్థితిని గుర్తించి, వారి జీవితాలను బాగుపరచడం కోసం ఐక్యరాజ్యసమితి ప్రతియేటా ఒక నినాదంతో
ప్రపంచవ్యాప్తంగా బాలకార్మికుల దయనీయ స్థితిని గుర్తించి, వారి జీవితాలను బాగుపరచడం కోసం ఐక్యరాజ్యసమితి ప్రతియేటా ఒక నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ సంవత్సరం 'Let's act on our commitments: End Child Labour!' నినాదాన్ని ఎంపిక చేసింది.
బాల్యం ఓ అందమైన కల.. ఆనందాల అల.. అపురూపమైన మధురానుభూతి. గడచిపోయిన అందమైన బాల్యం మళ్లీ తిరిగొస్తే బావుండు అని అనుకోని వారెవరైనా ఉంటారా.! కానీ ప్రస్తుతం సమాజంలో బాల్యం ఎందరికో భారంగా మారింది. అనేక కారణాల వల్ల కొన్ని బాల్యాలు చీకట్లలోనే మగ్గుతున్నాయి. పలకా బలపం పట్టి బుడి బుడి నడకలతో సందడి చేయాల్సిన వసివాడని పసి చేతులు కార్ఖానాల పాలవుతున్నాయి. రేంచీలు, సుత్తులు, రాడ్లరాపిళ్ళతో కందిపోయి, పాల చేతులు కాస్తామడ్డి కొట్టుకు పోతున్నాయి. చిట్టి చిట్టి చేతులతో చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. ఆడిపాడాల్సిన వయస్సులో నాలుగు గోడల మధ్య బందీ అవుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో విజ్ఞానవంతులు కావాల్సిన పిల్లలకు తగిన ఆదాయాలు లేక తల్లిదండ్రులు పౌష్టికాహారం అందించలేకపోతున్నారు.
బాల కార్మికుల స్వేద బిందువులతో..
నిజంగానే పిల్లలను బాలకార్మికులుగా మారకుండా రక్షించుకోవలసిన అవసరం గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో స్వయంగా పిల్లల తల్లిదండ్రులు, పెద్దలు తమ స్వార్థం కోసం, స్వలాభం కోసం పసి పాపల నిండు జీవితాలు బుగ్గిపాలు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అల్పాదాయ పరిస్థితుల మూలంగా చిన్న చిన్న పిల్లలను పనులకు పంపి కుటుంబాలను లాక్కొస్తున్నారు. చట్టపరంగా పసి వారికున్న హక్కులు, సౌకర్యాల గురించి వారికి ఏ మాత్రం తెలియదు. తెలిసినా దాంతో వారికి నిమిత్తం లేదు. పిల్లల హక్కుల చట్టాలను గురించి తెలిసిన వారు, అమలు చేస్తున్నవారు చాలా తక్కువ మంది. వివిధ రంగాలలో బాల కార్మికుల స్వేద బిందువులను పెట్టుబడిగా పెట్టి లాభాలు గడిస్తున్నవారు, చివరికి వారిని సంఘ వ్యతిరేక శక్తులుగా తయారు చేసి, వారిని వినియోగించుకొని, వారి భవిష్యత్తును ఛిన్నాభిన్నం చేసేవారు, చేస్తున్నవారు సమాజంలో లేకపోలేదు.
అభం శుభం తెలియని అలాంటి పసి జీవితాల గురించి ఆలోచిస్తేనే గుండె తరుక్కుపోతుంది. ఎంతోమంది చిన్న పిల్లలు హోటళ్లలో, రెస్టారెంట్లలో, మెకానిక్ షెడ్లలో, గ్యారేజీల్లో, కర్మాగారాలు, పరిశ్రమల్లో వెట్టిచాకిరీ చేస్తూ, యజమానుల ఇళ్ళలో గొడ్డు చాకిరీ చేస్తూ, రోడ్లపై కాగితాలు, ప్లాస్టిక్, గాజు సీసాలు ఏరుకుంటూ.. తగినంత వేతనం కానీ, కడుపునిండా తిండి గాని, తగిన సదుపాయాలు గాని లేక నిస్సహాయ స్థితిలో దారుణంగా నలిగి పోతున్నారు. ముష్టివాళ్ళు గా మారిపోతున్నారు. మరో దురదృష్టకరమైన, భయంకర వాస్తవం ఏమిటంటే, కొంతమంది అమాయక పసి బాలికలు అతి చిన్న వయసులోనే బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టివేయబడుతున్నారు.
పిల్లలను పాఠశాలల్లో చేర్పించగలిగితే..
ఈ అమాయక ప్రాణులు అలాంటి మురికి కూపాల్లో పడకుండా ఎవరు రక్షించాలి? పడిన వారిని ఎవరు బయటకు తీయాలి? వీరిని ఎవరు ఆదరించాలి? వీరందరికీ స్వేచ్ఛగా, ఆనందంగా, ఆహ్లాదంగా జీవించే హక్కు ఉన్నదని ఎవరు చెప్పాలి? ప్రస్తుతం ఎంతో కొంత ఈ పని చేస్తున్నది స్వచ్ఛంద సంస్థలే.. ప్రాథమిక విద్య దశలోనే పిల్లలు బడి మానేయకుండా, మధ్యలోనే చదువు ఆపేయకుండా చూడగలిగితే, సమస్య తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చు. పిల్లలకు చదువు ద్వారానే మంచి భవిష్యత్తు దక్కుతుందన్న విశ్వాసాన్ని, తద్వారా పిల్లల చదువు కోసం ఒక బలమైన కోరికను తల్లిదండ్రుల్లో రగిలించాలి. బాల కార్మిక సమస్య నిర్మూలనకు ఇదొక్కటే సరైన మార్గం.
ఒక్కసారి పిల్లల్ని పనికి పంపించడం మంచిది కాదని, అదేమంత అవసరం కూడా కాదని ఒప్పించగలిగితే పిల్లల్ని పాఠశాలలో చేర్పించడం చాలా సులువైపోతుంది. ఎప్పుడైతే సమాజం పాఠశాల నుంచి ఎక్కువ ఫలితాన్ని ఆశిస్తుందో, అప్పుడు పాఠశాల గురించి పట్టించుకోవడం జరుగుతుంది. తద్వారా విద్యా బోధనలో వాసి దానంతట అదే రాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లల అవసరాలకు తగ్గట్టుగా పాఠశాల బాధ్యతల్లో విప్లవాత్మకమైన మార్పులు సంభవిస్తాయి. పిల్లలు బాగుంటేనే దేశ భవితవ్యం బాగుటుంది. కనుక చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి మంచి భవిష్యత్తును అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తిస్తే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించబడి, భావిభారత పౌరుల భవిష్యత్తు బంగారు మయం అవుతుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
(నేడు అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం)
- యండి. ఉస్మాన్ ఖాన్
సీనియర్ జర్నలిస్ట్
99125 80645