సినిమా ఆత్మను అర్థం చేసుకోకుండా.. ఇన్నిసెన్సార్ కట్‌లు చెబుతారా?

ఒక సినిమాను రూపొందించాలంటే.. ఎంతో పరిశోధన చేసి, అహర్నిశలు కృషి చేసి, కథ తయారు చేసుకుని, 24 శాఖలను సమీకరించి..

Update: 2024-05-29 01:00 GMT

ఒక సినిమాను రూపొందించాలంటే.. ఎంతో పరిశోధన చేసి, అహర్నిశలు కృషి చేసి, కథ తయారు చేసుకుని, 24 శాఖలను సమీకరించి, ఒక కళారూపాన్ని తయారుచేసి, సెన్సార్ వాళ్ళ చేతిలో పెడితే.. వారికి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక, ఆర్థిక, సాంఘిక రంగాల్లో పటిష్టమైన అవగాహన లేక సినిమా సెన్సార్‌కి కట్ మీద కట్ చెబితే.. సినిమాకు, సినిమా తీసిన వాడి పరిస్థితి ఏమిటి?

'నెరవేరిన కల' ఒక ఊరి కథ. తరతరాలుగా, ఎన్నెన్నో త్యాగాలు, పోరాటాలు, బలిదానాలు చేసుకున్నా, నెరవేరని ఆ ఊరి కల చిట్టచివరికి ఎలా నెరవేరుతుందో అనే ఇతివృత్తంతో తీసినటువంటి సినిమా. ఒక దర్శకుడిగా ఐమాక్ కంప్యూటర్‌పై, రీ రికార్డింగ్ థియేటర్ స్క్రీన్‌పై పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్‌లో చూసుకున్న అవుట్ ఫుట్ ని మొదటిసారిగా సెల్యులైడ్‌పై చెక్ చేసుకోవడానికి ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ బుక్ చేసుకున్నప్పుడు, నాతో పాటుగా సినిమాను తిలకించడానికి కొంతమంది మాజీ బ్యూరోక్రాట్లకు, మేధావులకు, జర్నలిస్టులకు మెసేజ్ పంపాను. మొదటి టెస్టింగ్ షో కి వీళ్లను ఆహ్వానిస్తే ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఇంప్రెషన్ పోతుందేమో, ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని మా టీమ్ మెంబర్స్ సూచించినా, నేను మాత్రం వినకుండా వారిని స్వాగతించి, వారితో పాటు సినిమాను తిలకించి, వారి అభిప్రాయాలను కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నాను. నేను అనుకున్నట్లే మేధావులకే కాకుండా సామాన్యులకు కూడా సినిమా కనెక్ట్ అయ్యింది.

తెలుగు రానివారికి సినిమా చూపిస్తే...

ఫస్ట్ కాపీలో, ఏ కరెక్షన్ చేసే అవసరం రాలేదు. ఇక విడుదలకు, సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ దాఖలు చేసి, స్క్రీనింగ్ కోసం క్యూలో మా సినిమాను నిలబెట్టినాము. సుమారు 7 వారాల తర్వాత మే 8వ తారీకు నాడు మా సినిమా సెన్సార్ స్క్రీనింగ్ జరిగింది. సెన్సార్ బోర్డు వాళ్లు మా సినిమాలో, కటింగ్స్ ఇవ్వడానికి, ఏ అవకాశం ఉండదని భావించి రిలాక్స్‌గా కూర్చున్నాను. సినిమా స్క్రీనింగ్ తర్వాత డిస్కషన్ రూమ్‌లోకి నన్ను పిలిపించారు. సినిమా కాన్సెప్ట్ గురించి సహజసిద్ధంగా చిత్రీకరించే విధానం గురించి మనస్ఫూర్తిగా అభినందించారు. విని సంతోషపడ్డాను. ఆ స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రీజినల్ ఆఫీసర్ బెంగళూరు నుంచి వచ్చినారు. ఆయనతో నేను తెలుగులో మాట్లాడుతుంటే ఆ సార్‌కు తెలుగు రాదని ఒక సభ్యులు చెప్పడంతో నేను ఇంగ్లీషులో మాట్లాడడం మొదలు పెట్టాను. తెలుగు రానివారు తెలుగు సినిమాను ఎలా అర్థం చేసుకుంటారు..?

కట్‌ల మీద కట్‌లు..

దీంతో వారు కట్ లిస్ట్ వినిపించారు మొదటి కట్, ఒక ఎలక్షన్ సన్నివేశంలో రాత్రిపూట ఒక అభ్యర్థి తరపున మందు సరఫరా చేసే సన్నివేశంలో ఏదో ఒక బాటిల్‌పై బ్రాండ్ పేరు కనపడిందట, బ్రాండ్ పేరును బ్లర్ చేయమని చెప్పారు. నేనన్నాను సెట్ ప్రాపర్టీస్‌లో సమాజంలో ఉన్న రకరకాల వస్తువులపై రకరకాల బ్రాండ్లు ఉండడం సహజమే కదా. దాన్ని హైలైట్ చేసి చూపిస్తే అది పొరపాటు అవ్వచ్చు ఏమో, కానీ ఒక లాంగ్ షాట్‌లో రోడ్డుపై వాహనాలు వెళ్తున్నప్పుడు, బస్సుపై అశోక్ లేలాండ్, బైక్‌పై హీరో హోండా, ఫ్యాన్‌పై ఉష, అలాగే మందు బాటిల్‌పై దానికి సంబంధించిన ఏదో ఒక బ్రాండ్ ఉండడం సహజమే కదా అని వివరించాను. ఇక రెండవ కట్, ఒక ఫ్లాష్ బ్యాక్‌లో గ్రామీణ స్త్రీలు తను మానాన్ని రక్షించుకోవడానికి ఒక బావిలో దూకినప్పుడు రజాకార్లు 'డూప్ కే మార్గాయి సాలి సబ్' అనే డైలాగులో 'సాలి' పదాన్ని తొలగించమన్నారు. వాస్తవానికి అప్పటి రజాకారులైనా, పోలీసులైనా వాళ్లు వాడే భాష ఎంత అసభ్యకరంగా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్లు వాడే బూతు పదాలు వాడడం సబబు కాదు కాబట్టి, వాళ్ల టెంపర్‌ని, ఫ్రస్టేషన్ నీ వ్యక్తపరచడానికి వాడుక భాషలో ఒక ఊతపదంలా వాడానని తెలియచేశాను. ఇక మూడవ కట్, సినిమా మొత్తంలో ఎక్కడెక్కడ 'నక్సలైట్' పదం ఉన్నదో తొలగించమన్నారు. సినిమాలో ఒక ముఖ్యమైన ఫ్లాష్ బ్యాక్ ఈ నక్సల్ ఉద్యమంపై ఉంటుంది. ఏ వ్యవస్థ గురించి చెప్పదలుచుకున్నానో, ఆ వ్యవస్థ పేరు ప్రస్తావించకుండా ప్రేక్షకులకు నేనెలా కన్వే చేయగలుగుతాను ఆ వ్యవస్థ గొప్పదా, గొప్పది కాదా, అనే అంశాలపై నేను వెళ్లలేదు కదా. కథలో గత కాలంలో జరిగిన అంశాలను కాల్పనికంగా ప్రస్తావించినాను అని వివరించాను. సెన్సార్ గైడ్‌లైన్స్‌లో యాంటీ నేషనల్ పదాలు ఉండకూడదు అని రాసి ఉంది అని నాకు ఆ కాగితం చూపించారు. అందులో యాంటీ నేషనల్ ఆటిట్యూడ్‌ని వ్యక్తపరిచే పదాలు ఉండకూడదని ఉన్నది. నేను నా ఆర్గ్యుమెంట్ కొనసాగించాను, ఆంటీ నేషనల్ ఆటిట్యూడ్ అంటే మన దేశ కీర్తికి భంగం కలిగించే పదాలు, ఎక్స్‌ప్రెషన్లు అంటే వ్యాకరణంలో 'విశేషణం' (adjective) కానీ నక్సలైట్ అనే పదం ఒక వ్యవస్థ పేరు అంటే నామవాచకం (noun),

కట్స్ తొలగించాల్సిందేనట!

మీరు వివరణ ఇచ్చారు కదా, మేము ఆలోచించి మా నిర్ణయం చెప్తాము అని చెప్పి పంపించారు. రెండు రోజుల తర్వాత, రీజినల్ ఆఫీసర్ గారి ద్వారా ఈమెయిల్ వచ్చింది. డిస్కషన్‌లో తెలియపరిచిన కట్స్ అలాగే తొలగించాలని ఆదేశించారు. ఈ పదాన్ని నిఘంటువు లోంచే తొలగించేస్తారా? అలా అయితే పత్రికల్లో కూడా ముద్రించకూడదు, ఎలక్ట్రానిక్ మీడియాలో వినిపించకూడదు కదా. అక్కడ, ఎక్కడ ఏ సినిమాలో కూడా నిషేధించినటువంటి పదంపై నెరవేరిన కల సినిమాలోనే ఎందుకీ నిషేధం?

రాజీపడితేనే విడుదలవుతుందా?

ఒక సినిమా సెన్సార్‌కి ఇన్ని మార్గదర్శక సూత్రాలు పాటిస్తున్నారు కదా, ఈ మెంబర్స్‌ని నియమించేటప్పుడు ఏ గైడ్‌లైన్స్ ఫాలో అవుతుంది ప్రభుత్వం. అనుభవం, అవగాహన లేని వారికి ఇంత బాధ్యతగల బాధ్యత అప్పజెప్పితే ఎలా సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక, ఆర్థిక, సాంఘిక రంగాలలో పటిష్టమైన అవగాహన కలిగిన వివిధ రంగాలకు చెందిన అనుభవజ్ఞులను నియమిస్తే ఇలాంటి సమస్యలు రావు కదా. ఎంతో పరిశోధన చేసి, అహర్నిశలు కృషి చేసి, కథ తయారు చేసుకుని, 24 శాఖలను సమీకరించి, ఒక కళారూపాన్ని తయారుచేసి, ఇటువంటి వాళ్ళ చేతిలో పెడితే సినిమాకు, సినిమా తీసిన వాడి పరిస్థితి ఏమిటి? సాధారణంగా ఇది సినిమా చివరి దశ, ఎంతో డబ్బులు వెచ్చించి, శ్రమించి, విడుదలకు సిద్ధమైనప్పుడు, ఎన్నో ఒత్తిడిలు ఉంటాయి. ఆ ఒత్తిడులను అధిగమించడానికి నిర్మాతలు లంచాలు ఇచ్చి ఒప్పించుకుంటారు, లేదా రాజీ పడిపోయి వారు చెప్పినవి తొలగించేసి విడుదల చేసుకుంటారు.

ఆత్మను చంపుకుని రిలీజ్ చేయాలా?

తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2 నాడు సినిమాను ప్రేక్షకుల ముందుకు తెద్దాం అనుకున్నాను. అది జరగాలంటే నేను రాజీ పడాల్సిందే, ఇచ్చిన కట్స్ ఒప్పుకొని సినిమాలో ఉన్న ఆత్మను చంపుకోవాల్సిందే. ఆత్మను చంపుకొని సినిమాను విడుదల చేయడం కంటే ఆత్మవిశ్వాసంతో పోరాటం చేయడం ఉత్తమం అని భావించి, సెన్సార్ బోర్డ్ చైర్మన్‌కి, సీఈఓకి, రీజినల్ ఆఫీసర్‌కి కట్స్ గురించి పునరాలోచించాలని ఉత్తరాలు రాయడం జరిగింది. వారు అర్థవంతమైన మా ఆవేదనను అర్థం చేసుకొని మా విన్నపాన్ని స్వీకరిస్తారని భావిస్తున్నాం. లేకుంటే న్యాయపోరాటానికైనా నడుం బిగించాలని నిర్ణయించుకున్నాం. దీనిపై, ఈ వివక్షపై, ఈ అవగాహనా రాహిత్యంపై, రాష్ట్ర ప్రభుత్వం, పౌర సమాజం స్పందించి మద్దతు తెలుపుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాం.

- సయ్యద్ రఫీ

'నెరవేరిన కల' దర్శక, నిర్మాత

99660 25325

Tags:    

Similar News