ఐసీటీసీ కేంద్రాల కుదింపు ప్రమాదం!
Without ICTC employees, HIV cannot be stopped in villages.
రేషనలైజేషన్ పేరుతో ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ పరీక్ష, కౌన్సిలింగ్ (ఐసీటీసీ) కేంద్రాలను కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. రేషనలైజేషన్ పేరుతో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (న్యాకో) చర్యలు చేపట్టినట్టు సమాచారం. జూలై 5వ తారీఖున న్యాకో జారీ చేసిన సర్కులర్ నంబర్ 11025 పట్ల ఆ సంస్థ సిబ్బంది, ఎయిడ్స్ రోగులు ఆందోళనలో పడ్డారు. ప్రపంచ దేశాలను గడగడలాడించిన హెచ్ఐవి. ఈ వ్యాధిగ్రస్తులలో ఉన్న వివక్షతలను పారద్రోలి, రోగులలో మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని కౌన్సిలింగ్ స్కిల్స్‌తో సుశిక్షితులైన కౌన్సిలర్స్ ఇన్ని రోజులు సేవలు అందించగా, ఇకనుండి వారు కరువు కానున్నాయి. పరీక్షలు చేయించుకోవడానికి అందుబాటులో ఐసీటీసీ కేంద్రాలు లేకపోవడం వల్ల, సదరు హెచ్ఐవీ, అనుమానిత, హైరిస్క్ గ్రూప్, సంక్రమిత వ్యక్తుల ద్వారా చాప కింద నీరు లాగా సమాజంలో మరింతగా ఎయిడ్స్ వ్యాధి ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంది. దేశంలో 593 కేంద్రాలను రేషనలైజేషన్ పేర ఎత్తివేయడానికి న్యాకో సిద్ధమైంది. తెలంగాణలోనూ 40 కేంద్రాలు మూతపడనున్నాయి.
ఇందులో ఉన్న కౌన్సిలర్, ల్యాబ్ టెక్నీషియన్ సిబ్బందిని ఇతర ప్రాంతాల్లోని ఐసీటీసీ కేంద్రాలలో సర్దుబాటు చేయనున్నారు. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ పరిపాలన, ప్రజా సంక్షేమ పథకాలు ఉండాలని పదేపదే వల్లే వేసే ప్రభుత్వాలు వాటిని ప్రజలకు అందకుండా హేతుబద్ధీకరణ పేరిట పట్టణాలకే పరిమితం చేయడం పట్ల ఉద్యోగులు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2005 సంవత్సరం నుంచి దాదాపు ఇరవై ఎండ్లుగా ప్రతి సామాజిక ఆసుపత్రిలలో సేవలు అందించే కౌన్సిలర్, ల్యాబ్ టెక్నీషియన్లను ఏరియా, జిల్లా కేంద్ర ఆస్పత్రులలో సర్దుబాటు చేయడం వల్ల పల్లె ప్రాంతాల్లోని రోగులకు వైద్య సేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, కౌన్సిలింగ్ సేవలు చేరువలో ఉండవు. అందుకే ఇప్పటికైనా దీనిపై కేంద్రం పునరాలోచించి సామాజిక ఆరోగ్య కేంద్రాలలో యధాస్థితిని కొనసాగించాలని ప్రభుత్వానికి ప్రజాసంఘాల నాయకులు విన్నవిస్తున్నారు.
రావుల రాజేశం
98488 11424